Abn logo
Jun 18 2021 @ 03:24AM

ప్రభుత్వాలే మోసం చేస్తే ఎలా?

548వ రోజుకు చేరుకున్న రైతుల ఆందోళనలు 


తుళ్ళూరు, జాన్‌ 17: ప్రజా ప్రభుత్వాలే మోసం చేస్తే ప్రజలు ఎవర్ని నమ్మాలని రాజధాని రైతులు, మహిళలు ప్రశ్నించారు. అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగాలని రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తోన్న ఉద్యమం గురువారంతో 548వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు రాజధానులని మోసం చేస్తే భవిష్యతులో ఏ ఒక్క రైతు ప్రజల అవసరాల కోసం భూమిని ఇవ్వడని తెలిపారు. అమరావతి రైతులకు జరిగిన మోసాన్ని గమనించినందుననే... ఏ ఒక్క కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావటం లేదన్నారు. అమరావతి అభివృద్ధిని కొనసాగిస్తుంటే ఎన్నో కంపెనీలు క్యూ కట్టేవన్నారు. మూడు ముక్కలాటలో రైతులను బలి చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. ప్రత్యేక హోదా తీసుకొస్తామన్న సీఎం జగన్‌రెడ్డి ఆ సంగతి పక్కన పెట్టి మూడు రాజధానులతో అభివృద్ధి అంటూ ప్రజల ఆలోనచనలు పక్కదారి పట్టించారన్నారు. విభజన చట్టంలోని హామీలు నెరవేర్చాలని పోరాడతామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం వద్ద మోకరిల్లిందన్నారు. అహింసాయుతంగా గాంధేయ మార్గంలో ఉద్యమం చేస్తుంటే అణగదొక్కడానికి అక్రమ కేసులు పెట్టారని వాపోయారు. అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని రాజధాని 29 గ్రామాలతో పాటు తాడికొండ మండలంలో ఆందోళనలు కొనసాగాయి.