Hateపై మోదీకి CCG లేఖను ఖండించిన కన్సర్న్‌డ్ సిటిజన్స్

ABN , First Publish Date - 2022-05-01T00:21:19+05:30 IST

దేశంలో బీజేపీ ప్రభుత్వాలు విద్వేష రాజకీయాలు చేస్తున్నాయని

Hateపై మోదీకి CCG లేఖను ఖండించిన కన్సర్న్‌డ్ సిటిజన్స్

న్యూఢిల్లీ : దేశంలో బీజేపీ ప్రభుత్వాలు విద్వేష రాజకీయాలు చేస్తున్నాయని 108 మంది మాజీ సివిల్ సర్వెంట్లు చేసిన ఆరోపణలను వ్యతిరేకిస్తూ మాజీ న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు, సాయుధ దళాల మాజీ అధికారులు ప్రధాన మంత్రి Narendra Modiకి ఓ లేఖ రాశారు.  


కాన్‌స్టిట్యూషనల్ కండక్ట్ గ్రూప్ పేరుతో 108 మంది మాజీ సివిల్ సర్వెంట్లు ఇటీవల ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. దేశంలో విద్వేషం నిండిన విధ్వంసకర వెర్రిని తాము చూస్తున్నామని పేర్కొన్నారు. ఈ బలిపీఠంపై ఉన్నది కేవలం ముస్లింలు, ఇతర మైనారిటీలు మాత్రమే కాదని, స్వయంగా భారత దేశ రాజ్యాంగమని ఆరోపించారు. ఈ ఆరోపణలను వ్యతిరేకిస్తూ ‘కన్సర్న్‌డ్ సిటిజన్స్’ పేరుతో ఎనిమిది మంది విశ్రాంత న్యాయమూర్తులు, 97 మంది మాజీ బ్యూరోక్రాట్లు, 92 మంది సైనిక దళాల మాజీ అధికారులు ఓ బహిరంగ లేఖను ప్రధాని మోదీకి రాశారు. 


ప్రజా మద్దతు మోదీకే

ఇటీవల ఐదు రాష్ట్రాల శాసన సభలకు జరిగిన ఎన్నికల ఫలితాలను ‘కన్సర్న్‌డ్ సిటిజన్స్’ గ్రూపు తమ లేఖలో ప్రస్తావించింది. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిన నేపథ్యంలో కాన్‌స్టిట్యూషనల్ కండక్ట్ గ్రూపు (CCG) సభ్యులు తమ అక్కసును వెళ్ళగక్కుతున్నారని ఆరోపించారు. ప్రజాభిప్రాయం మోదీకి గట్టి మద్దతుగా నిలవడంతో, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా తమ నైరాశ్యాన్ని వీరు బయటపెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. 


CCG రెచ్చగొడుతోంది

వారి (CCG) ఆగ్రహం, ఆవేదన ఉత్తుత్తి నైతిక ప్రమాణాల ప్రదర్శన మాత్రమే కాకుండా, వారు వాస్తవానికి తాము పోరాడాలని కోరుకుంటున్న విద్వేష రాజకీయాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. వారికి పేటెంట్ అయిన నిరాధార ప్రతికూల అభిప్రాయాలు, తప్పుడు చిత్రీకరణలతో ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్వేషాన్ని నిర్మించేందుకు ప్రయత్నించడం ద్వారా విద్వేష రాజకీయాలను రెచ్చగొడుతున్నారన్నారు. 


పాశ్చాత్య మీడియా తరహాలోనే...

CCG లేఖ స్పష్టంగా సైద్ధాంతిక భావజాలం, ఆలోచనలు, విశ్వాసాల పక్షపాతంతో కూడినదని  ‘కన్సర్న్‌డ్ సిటిజన్స్’ గ్రూపు ఆరోపించింది. పాశ్చాత్య మీడియా, పాశ్చాత్య సంస్థలు వాడుతున్న పదజాలాలకు, CCG లేఖలో ఉపయోగించిన మాటలకు సారూప్యత ఉందని గుర్తు చేసింది. పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనలపై CCG మౌనంగా ఉందని పేర్కొంది. దీనినిబట్టి CCG సభ్యుల అనైతిక, స్వార్థపూరిత వైఖరి తేటతెల్లమవుతోందన్నారు. వేర్వేరు రాజకీయ పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో జరుగుతున్న అనేక హింసాత్మక సంఘటనలపై వీరు స్పందించే తీరును ఈ వైఖరే రూపకల్పన చేస్తోందని పేర్కొన్నారు. ఎంపిక చేసుకుని పాల్పడుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై కూడా వీరి స్పందనను ఈ వైఖరే నిర్ణయిస్తోందన్నారు. ఇటువంటి హింసాత్మక సంఘటనల వల్ల మతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు చెందిన పేదల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాధికార అతిక్రమణ గురించి తప్పుడు కథనాలను సృష్టించవద్దని CCG సభ్యులను కోరారు. 


హిందువుల పండుగల సందర్భంగా శాంతియుతంగా జరిగిన శోభాయాత్రలపై ముందుగా ప్రణాళిక రచించుకుని నిర్వహించిన దాడులకు వ్యతిరేకంగా ఎదురు దాడి చేసే కథనాలను ప్రోత్సహించడమే CCG సభ్యుల అసలు ఉద్దేశమని ఆరోపించారు. ఇటువంటి ముందస్తు ప్రణాళికతో కూడిన దాడులు రాజస్థాన్, మధ్య ప్రదేశ్, గుజరాత్ లేదా న్యూఢిల్లీలో జరిగినప్పటికీ, Counter Narrativeను ప్రోత్సహించాలన్నదే వారి లక్ష్యమన్నారు. 



Updated Date - 2022-05-01T00:21:19+05:30 IST