‘కంటైనర్‌ టెర్మినల్‌’పై కన్నెర్ర

ABN , First Publish Date - 2022-09-25T09:35:09+05:30 IST

విశాఖ కంటైనర్‌ టెర్మినల్‌ వల్ల నష్టపోయిన తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ మత్స్యకారులు..

‘కంటైనర్‌ టెర్మినల్‌’పై కన్నెర్ర

భూములు తీసుకుని 20 ఏళ్లయినా న్యాయం చేయలేదంటున్న మత్స్యకారులు

విశాఖలో సముద్రంలో బోట్లతో ఆందోళన


విశాఖపట్నం/మహారాణిపేట, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): విశాఖ కంటైనర్‌ టెర్మినల్‌ వల్ల నష్టపోయిన తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ మత్స్యకారులు శనివారం ఆందోళనకు దిగారు. తొలుత బోట్లలో సముద్రంలోకి వెళ్లి హార్బర్‌ నుంచి నౌకలేవీ లోపలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. పదుల సంఖ్యలో బోట్లు, వాటిలో మత్స్యకారులు.. టెర్మినల్‌కు దగ్గరగా రావడం గమనించిన సీఐఎ్‌సఎఫ్‌ సిబ్బంది.. వేరే బోటులో అక్కడికి వెళ్లి నిలువరించే ప్రయత్నం చేశారు. వారిలో కొందరు రాళ్లు విసరడంతో పలువురు మత్స్యకారులు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. ఒక దశలో తుపాకులు కూడా గురిపెట్టారు. అయితే పరిస్థితి చేయి దాటిపోతుందని గమనించిన అధికారులు వారిని వారించారు.


ఈ నేపథ్యంలో మత్స్యకారులు బోట్లపై ఆందోళన విడిచి పెట్టి, టెర్మినల్‌ గేటు వద్దకు చేరుకుని బైఠాయించారు. తమ డిమాండ్లు నెరవేర్చేంత వరకు లారీలను వెళ్లనివ్వబోమని అడ్డం పడ్డారు. టెర్మినల్‌ కోసం పోర్టు అధికారులు 2001లో తమ భూములు తీసుకున్నారని, 543 కుటుంబాలకు టెర్మినల్‌లో ఉద్యోగం, లక్ష రూపాయలు నగదు, వేరే ప్రాంతంతో ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారని ఆందోళనకు నాయకత్వం వహించిన మత్స్యకారుల పారిశ్రామిక సంక్షేమ సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. హామీఇచ్చి ఇప్పటికి ఇరవై ఏళ్లయిందన్నారు. తమ హామీలు నెరవేర్చాలని కోరగా ఈ నెల 12న పోర్టు, టెర్మినల్‌ అధికారులతో సమావేశం నిర్వహించి పది రోజుల్లో పరిష్కారం చూపుతామన్నారని, అయినా స్పందించక పోవడంతో ఆందోళనకు దిగామని తెలిపారు. కలెక్టర్‌ ఆదేశాలతో ఆర్‌డీఓ హుస్సేన్‌ అక్కడకు చేరుకుని ఇరువర్గాలతో మాట్లాడారు. 

Updated Date - 2022-09-25T09:35:09+05:30 IST