రేషన్‌ డీలర్ల ఆందోళన

ABN , First Publish Date - 2021-10-27T07:01:59+05:30 IST

రేషన్‌ డీలర్లు రోడ్డెక్కారు. ఖాళీ గోతాలను తిరిగి అప్పగించాలన్న ప్రభుత్వ ఆదేశాలపై చౌకదుకాణ డీలర్లు ఆందోళనకు దిగారు.

రేషన్‌ డీలర్ల ఆందోళన

గోతాలూ లాక్కుంటారా ?

పౌరసరఫరాల శాఖలో పొదుపు చర్యలపై నిరసన

 

మదనపల్లె, అక్టోబరు 26: రేషన్‌ డీలర్లు రోడ్డెక్కారు.పౌర సరఫరాల శాఖ గోదాము నుంచి రేషన్‌షాపులకు బియ్యం సరఫరా చేసిన తర్వాత ఖాళీ గోతాలను తిరిగి అప్పగించాలన్న ప్రభుత్వ ఆదేశాలపై చౌకదుకాణ డీలర్లు ఆందోళనకు దిగారు.ఇప్పటికే రేషన్‌ డోర్‌ డెలివరీ పేరుతో మొబైల్‌ వాహనాలను తెరమీదకు తెచ్చి తమ ఆదాయానికి గండికొట్టిన ప్రభుత్వం... తాజాగా ఖాళీ గోతాలనూ  వెనక్కివ్వాలని ఆదేశించడంపై  ప్రశ్నిస్తున్నారు.అయితే రైతుల నుంచి ధాన్యం సేకరణకు గోతాలు అవసరమని, వీటి తయారీ, సరఫరా నిలిచిపోవడంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. గోతాలు వెనక్కివ్వని డీలర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలం టూపౌరసరఫరాల శాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.ఆదాయాన్ని పక్కన పెడితే, రేషన్‌ దుకాణ అద్దెల కు ఆదుకుంటున్న గోతాలను ఇచ్చేస్తే  నిర్వహణ ఎలా...అంటూ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రేషన్‌డీలర్లు, అంగన్‌వాడీ,మఽధ్యాహ్న భోజన పథకం తదితర పథకాలకు బియ్యం సరఫరా చేసే సంచులన్నీ వెనక్కి వ్వాలన్నది నిబంధన.జిల్లాలో మొత్తం 10.70లక్షల రేషన్‌కార్డులుండగా నెలకు1,67,939 క్వింటాళ్ల బియ్యం కేటాయుస్తున్నారు.ఇందుకోసం 3,36,000 సంచులు అవసరమవుతాయి. ఒక్కో సంచి సగటున రూ.50కి కొనుగోలు చేస్తున్నారు. ఇలా గోతాలకే రాష్ట్రప్రభుత్వం నెలకు రూ.1.68కోట్లు వెచ్చిం చాల్సి వస్తోంది.ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వం సంచుల సొమ్ములను మిగుల్చుకునే క్రమంలో ఆ భారాన్ని డీలర్లపై వేస్తోంది.బియ్యం పంపిణీ పూర్తయ్యాక గోతాలను గోదాముకు అప్పగించాలని గతేడాది జీవో నెం.10 జారీ చేసింది. రేషన్‌ డీలర్ల సంఘం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇందులోభాగంగా ఒకరోజు రేషన్‌ పంపిణీ కూడా ఆపేసింది. ఈ క్రమంలో జీవో అమలును తాత్కాలికంగా పక్కన పెట్టిన ప్రభుత్వం తాజాగా కరోనా పరిస్థితులు కారణంగా చెబుతూ జీవోకు పదును పెడుతోంది. కోల్‌కాతా నుంచి దిగుమతి చేసుకునే గోతాల ఉత్పత్తి ఆగిపోవడంతో లెవీ సేకరణకు ఇబ్బందిగా ఉందని చెబుతోంది. ఖాళీ  గోతానికి  రూ.16 ఇస్తామని అప్పట్లో చెప్పింది. అయితే బహిరంగ మార్కెట్‌లో ఒక్కో సంచి రూ.25 పలుకుతోందని, ధర పెంచాలన్న డీలర్ల వినతి మేరకు రూ.20 ఇస్తామన్నది. కానీ ఇప్పటిదాకా పైసా కూడా చెల్లించలేదు. దీంతో ఆందోళనలో ఉన్న డీలర్లను మరింత ఇబ్బందుల్లోకి నెడుతూ, ఇప్పటికే జారీ చేసిన జీవో నెం.10కు పదును పెట్టింది.బహిరంగ మార్కెట్‌లో గోతాలు విక్రయించ రాదంటూ ఆంక్షలు విధించింది. వీటిని  కొనుగోలు చేసిన వ్యాపారులపై, విక్రయించిన తమపై కేసులు నమోదు చేయాలనే ఆదేశాలు డీర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దుకాణం అద్దె, విద్యుత్తు బిల్లు, దిగుమతి ఛార్జీలు ఎలా చెల్లించాలంటూ ఆందోళన చెందుతున్నారు.


ప్రభుత్వం మోసం చేసింది: రేషన్‌ డీలర్లు

చిత్తూరు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం తమను అన్ని విధాలుగా మోసం చేస్తోందని రేషన్‌ డీలర్లు ఆరోపించారు. ఈ మేరకు ప్రభుత్వం చేసిన మోసాలను, జరిగిన అన్యాయాలను, చెల్లించాల్సిన బకాయిల గురించి తెలుపుతూ రాష్ట్ర రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం పిలుపుతో నిరసన తెలిపారు. అన్ని మండలాలరేషన్‌ డీలర్లు మంగళవారం మధ్యాహ్నం వరకు రేషన్‌ దుకాణాలను మూతేసి, జిల్లాలోని 28 స్టాక్‌ పాయింట్ల వద్ద ధర్నా చేశారు. ఖాళీ గోతాలను వెనక్కి తీసుకుని డబ్బులు ఇస్తామని చెప్పి,మోసం చేసింద న్నారు. వెంటనే జీవో 10ని  రద్దు చేసి ఖాళీ గోతాలను డీలర్లకే ఇవ్వాలని కోరారు. పీఎం గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన కింద 2020 మార్చి నుంచి కార్డుదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసిన దానికి కమీషన్‌ రూ.3లక్షలు, ఖాళీ గోతాలకు సంబంధించిన బకాయిలు రూ.4లక్షలు రావాల్సి ఉందని వివరించారు. అలాగే ఐసీడీఎస్‌కు మళ్లించిన కంది పప్పు బకాయిలు రూ.2లక్షలను కూడా విడుదల చేయాలని డి మాండ్‌ చేశారు. చిత్తూరు స్టాక్‌ పాయింట్‌ వద్ద డీలర్ల సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యదర్శి జ్యోతిశ్వర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌ పాల్గొన్నారు. ఆయా స్టాక్‌ పాయింట్ల వద్ద స్థానిక డీలర్ల సంఘ నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-27T07:01:59+05:30 IST