ఇళ్ల నిర్మాణంపైనే దృష్టి

ABN , First Publish Date - 2022-05-25T06:18:00+05:30 IST

ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పర సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిద్దామంటూ ఇంఛార్జి మంత్రి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పిలుపునిచ్చారు

ఇళ్ల నిర్మాణంపైనే దృష్టి
డీఆర్సీ సమావేశంలో రోజా ప్రసంగం

డీఆర్సీ సమావేశంలో నేతల సూచనలు


తిరుపతి, మే 24 (ఆంధ్రజ్యోతి): ప్రజాప్రతినిధులు, అధికారులు పరస్పర సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిద్దామంటూ ఇంఛార్జి మంత్రి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా సమీక్షా కమిటీ (డీఆర్సీ) సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న లే అవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.అవసరమైన లబ్ధిదారులకు ఇళ్ళ నిర్మాణం కోసం బ్యాంకు రుణాలు ఇప్పించాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా సప్లై ఛానెళ్ళను పూర్తిగా సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని, ఉపాధి హామీ పథకం ద్వారా చెరువులను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ మంత్రి రోజా మాట్లాడుతూ ఇళ్ళ నిర్మాణం ఆలస్యమవుతున్న చోట్ల అధికారులు సమీక్షించుకుని వేగవంతం చేయాలన్నారు. లే అవుట్లలో ఏవైనా సమస్యలుంటే ఎమ్మెల్యేలు, మంత్రుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కలెక్టర్‌ వెంకట్రమణారెడ్డి మాట్లాడుతూ  పక్కా ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి ప్రతి లే అవుట్‌కూ నోడల్‌ అధికారిని నియమించామన్నారు. వారానికి మూడు సార్లు వీరితో ఆర్డీవోలు సమీక్షిస్తున్నారన్నారు. మూడో ఆప్షన్‌ కింద ఇళ్ళకు సరిపడా కాంట్రాక్టర్లు, మేస్త్రీలను గుర్తించడంతో పాటు కాంట్రాక్టర్లకు, లబ్ధిదారులకు నడుమ ఎంఓయూలు కుదుర్చుతున్నామని వివరించారు.ఐసీఐసీఐ బ్యాంకుల్లో ఖాతాలు ఓపెన్‌ చేయించి దశల వారీగా నిర్మాణం పూర్తికాగానే కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు మాట్లాడుతూ పక్కా ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి పురోగతి చాలా తక్కువగా వుందన్నారు. అధికారులు ప్రత్యేక డ్రైవ్‌ పెట్టి ఇళ్ళ నిర్మాణం వేగవంతం చేయాలి. జగనన్న లే అవుట్లలో ప్రత్యేక ప్రతిభావంతులకు సంబంధించిన ఇళ్ళకు ప్రత్యేక ర్యాంపులు నిర్మించాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి సూచించారు.మూడో ఆప్షన్‌ తీసుకున్న వారు ప్రభుత్వమే తమకు ఇళ్ళు కట్టించి ఇస్తుందనే అపోహతో వున్నారని, అలాంటి వారంతా కూడా ఇళ్ళు నిర్మించుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సూచించారు.కొవిడ్‌ సమయంలో బాధితులకు భోజనం, వసతి కల్పించిన దానికి సంబంధించిన బిల్లులను  వెంటనే మంజూరు చేయాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కోరారు.తిరుపతి-నాయుడుపేట ఆరు వరుసల రహదారి నిర్మాణం సకాలంలో పూర్తయ్యేలా అధికారులు చొరవ తీసుకోవాలని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం కోరారు.నెల్లూరు జడ్పీ ఛైర్మన్‌ ఆర్ముగం, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు  కరుణాకరరెడ్డి,ఆదిమూలం, వరప్రసాద్‌, సంజీవయ్య, జేసీ డీకే బాలాజీ, ఎస్పీ పరమేశ్వరరెడ్డి, డీఆర్వో శ్రీనివాసరావు, సీపీవో అశోక్‌కుమార్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఈ విజయ్‌కుమార్‌, డీఎం అండ్‌ హెచ్‌వో శ్రీహరి, ఆర్డీవోలు కనకనరసారెడ్డి, హరిత, రోస్‌మాండ్‌, మురళీకృష్ణ, జిల్లా పౌరసంబంధాల అధికారి బాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-25T06:18:00+05:30 IST