‘కోర్‌’లో కంప్యూటర్‌

ABN , First Publish Date - 2021-06-24T09:00:26+05:30 IST

కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ (సీఎ్‌సఈ) మోజులోపడి ఇంజినీరింగ్‌ కాలేజీలు కోర్‌ ఇంజినీరింగ్‌గా పేరుగాంచిన సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లాంటి సంప్రదాయ కోర్సులను వద్దనుకుంటున్నాయి..

‘కోర్‌’లో కంప్యూటర్‌

  • తృతీయ, చివరి సంవత్సరం సివిల్‌, ఎలక్ట్రికల్‌, 
  • మెకానికల్‌, ఎలకా్ట్రనిక్స్‌లోనూ ‘సీఎస్‌ఈ’
  • బీటెక్‌ అన్ని బ్రాంచుల్లోనూ మైనర్‌ డిగ్రీ 
  • ఈ విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి
  • పాఠ్యాంశాల మార్పునకు జేఎన్‌టీయూ సిద్ధం
  • ఇంజినీరింగ్‌ విద్యలో విప్లవాత్మక మార్పులు
  • కోర్‌ కోర్సులకూ పెరగనున్న ప్రాధాన్యం 

హైదరాబాద్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ (సీఎ్‌సఈ) మోజులోపడి ఇంజినీరింగ్‌ కాలేజీలు కోర్‌ ఇంజినీరింగ్‌గా పేరుగాంచిన సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లాంటి సంప్రదాయ కోర్సులను వద్దనుకుంటున్నాయి.. విద్యార్థుల్లోనూ ఇంజినీరింగ్‌లో సీఎ్‌సఈ ఉంటేనే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న భావన నెలకొంది.. గత రెండేళ్లులో రాష్ట్రవ్యాప్తంగా కోర్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో 40వేల సీట్లు రద్దయ్యాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. మరో రెండేళ్లలో అన్ని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో సీఎ్‌సఈ తప్ప మరో బ్రాంచ్‌ మిగిలే పరిస్థితి కనిపించడం లేదు. సంప్రదాయ కోర్సులను కొనసాగిస్తూనే విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాల దృక్పథాన్ని మార్చే ప్రత్యామ్నాయ మార్గాన్ని జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ) సిద్ధం చేసింది. అలాగే అన్ని బ్రాంచీల విద్యార్థుల ఉపాధి అవకాశాలను పెంచేందుకు.. బీటెక్‌లో మైనర్‌ డిగ్రీ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఇంజినీరింగ్‌ విద్యలో విప్లవాత్మకంగా భావించబడే ఈ నూతన మార్పులు ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు చేయాలని నిర్ణయించింది. 


తృతీయ, చివరి సంవత్సరం విద్యార్థులకు.. 

రాష్ట్రంలో ఏటా దాదాపు 70వేల మంది ఇంజినీరింగ్‌ పట్టభద్రులు తమ చదువులను పూర్తిచేసుకుంటున్నారు. వీరిలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల ద్వారా ఎంపిక అవుతున్నవారి సంఖ్య 10శాతం లోపే ఉంది. మరో 15-20 శాతం మంది ఏదో ఒక ఉపాధి అవకాశాన్ని దక్కించుకుంటుండగా.. దాదాపు 70 శాతం పట్టభద్రులు నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. మరోవైపు బీఎస్సీ, బీసీఏ, ఎంసీఏ లాంటి కోర్సులు చదివినవారు సైతం ఐటీ కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా ఎమర్జింగ్‌ టెక్నాలజీలో కొన్ని నెలలపాటు శిక్షణ తీసుకుని మంచి ఉద్యోగాలను దక్కించుకుంటున్నారు. ప్రస్తుతం కంప్యూటర్‌ సైన్స్‌లో ఎమర్జింగ్‌ టెక్నాలజీ కోర్సులకు మంచి డిమాండ్‌ ఉండటం, కోర్సు పూర్తయిన తర్వాత ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండటంతో కోర్‌ ఇంజినీరింగ్‌  బ్రాంచిలుగా పేర్కొనబడే సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలకా్ట్రనిక్స్‌లోనూ ఎమర్జింగ్‌ టెక్నాలజీ కోర్సుల సిలబ్‌సను ప్రవేశపెట్టాలని జేఎన్‌టీయూ నిర్ణయించింది. ఇంజినీరింగ్‌లో ఎంచుకున్న స్పెషలైజేషన్‌ సబ్జెక్ట్‌ పూర్తిస్థాయిలో తృతీయ, చివరి సంవత్సరంలోనే ఉంటుంది. దీంతో సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ తృతీయ, చివరి సంవత్సరం పాఠ్యాంశాల్లో సీఎ్‌సఈ ఎమర్జింగ్‌ టెక్నాలజీలో అందించే పాఠ్యాంశాలను జోడించనున్నారు. ఈ ఏడాది తృతీయ, చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులే ఈ మార్పుతో కూడిన పాఠ్యాంశాలను పొందే తొలి బ్యాచ్‌ అవుతారు. 


బీటెక్‌లో డబుల్‌ డిగ్రీ.. 

ఇంజినీరింగ్‌ విద్యలో మరో విప్లవాత్మక మార్పునకు సైతం జేఎన్‌టీయూ సిద్ధమవుతోంది. బీటెక్‌లో అన్ని బ్రాంచిల విద్యార్థులు అదనంగా మరో డిగ్రీని ఏకకాలంలో పూర్తిచేసేందుకు అవకాశం కల్పించనుంది. దీనిని మైనర్‌ డిగ్రీగా పేర్కొంటారు. ఉదాహరణకు.. సివిల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి తనకు ఆసక్తి ఉన్న కంప్యూటర్‌ సైన్స్‌లో, సీఎ్‌సఈ చదువుతున్న విద్యార్థి తనకు ఆసక్తి ఉన్న మెకానికల్‌ బ్రాంచిలో మైనర్‌ డిగ్రీని పొందొచ్చు. ప్రస్తుతం బీటెక్‌ డిగ్రీ పొందాలంటే కనీసం 160 క్రెడిట్స్‌ సాధించాల్సి ఉంది. మైనర్‌ డిగ్రీకోసం అదనంగా మరో 20 క్రెడిట్స్‌ పొందాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి విధానం దేశంలో ప్రముఖ ఐఐటీలుగా పేరుగాంచిన ఐఐటీ మద్రాస్‌, ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఐఐటీ బాంబేల్లో అమల్లో ఉంది. ఐఐటీల్లో చదువులు పూర్తిచేసిన పట్టభద్రులకు భారీ వేతనాలతో కూడిన ఉపాధి అవకాశాలు రావడానికి ‘డ్యూయల్‌ డిగ్రీ’ విధానం కూడా ఓ ప్రధాన కారణంగా నిలుస్తోంది. అన్ని విషయాలపై ఇప్పటికే అధ్యయనం చేసిన జేఎన్‌టీయూ మైనర్‌ డిగ్రీ విధానాన్ని ఈ విద్యాసంవత్సరంలోనే అమలు చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. 


ఇదీ మారనున్న సిలబస్‌.. 

ప్రస్తుతం జేఎన్‌టీయూ పరిధిలోని కాలేజీల్లో సీఎ్‌సఈ తృతీయ సంవత్సరంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌, వెబ్‌ టెక్నాలజీస్‌, మెషీన్‌ లెర్నింగ్‌, డిజైన్‌ అండ్‌ అనాలిసిస్‌ ఆఫ్‌ అల్గారిథమ్స్‌ కీలక అధ్యాయాలుగా ఉన్నాయి. అలాగే చివరి సంవత్సరంలో క్రిప్టోథెరపీ, నెట్‌వర్క్‌ సెక్యూరిటీ, డాటా మైనింగ్‌, పరిశ్రమల్లో ప్రాజెక్టు వర్క్‌, సెమినార్‌ ప్రధాన అధ్యాయాలుగా ఉంది. దీంతోపాటు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఐవోటీ, సెన్సర్‌ నెట్‌వర్క్స్‌, హ్యూమన్‌ కంప్యూటర్‌ ఇంటెరాక్షన్‌, సైబర్‌ ఫోరెన్సిక్స్‌ తదితర అంశాల్లో నుంచి ఎలక్టివ్‌ సబ్జెక్టులను ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఐటీ కంపెనీలు ఈ కోర్సుల్లో నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగాల్లో విశేష ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో ఈసారి కోర్‌ బ్రాంచిల్లో ఈ అధ్యాయాలను జతచేయనున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలుచేయాలని జేఎన్‌టీయూ భావిస్తోంది. 


ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యం

టెక్నాలజీ చాలా వేగవంతంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో ఉపాధి అవకాశాలను పొందాలంటే దానికి తగ్గట్టుగా నైపుణ్యాలను సాధించడం అనివార్యంగా మారింది. మారుతున్న పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులు నైపుణ్యాలను నేర్చుకోవాల్సి ఉంది. ఈ విషయంపై అధ్యయనం చేసి, నిపుణులతో చర్చించి కోర్‌ బ్రాంచిల సిలబ్‌సలో ఎమర్జింగ్‌ టెక్నాలజీ కోర్సుల సిలబ్‌సలోని కొంత భాగాన్ని కలపాలని నిర్ణయించాం. అలాగే ఆసక్తిఉన్న ఇతర బ్రాంచి సబ్జెక్టులపై మైనర్‌ డిగ్రీ కూడా ప్రవేశపెట్టనున్నాం. దీనిపై త్వరలో ఉపకులపతి అధ్యక్షతన జరగనున్న సమావేశంలో నిర్ణయాన్ని ప్రకటిస్తాం.  

- ప్రొఫెసర్‌ మన్జూర్‌ హుసేన్‌, రిజిస్ట్రార్‌, జేఎన్‌టీయూ 

Updated Date - 2021-06-24T09:00:26+05:30 IST