చిత్రం చూపిస్తే.. విషయం చెప్పేస్తుంది ఈ కంప్యూటర్‌

ABN , First Publish Date - 2021-04-10T06:39:33+05:30 IST

ఒక చిత్రం... డాక్యుమెంట్‌ కంప్యూటర్‌కు ఇస్తే అందులో ఏముంది? వ్యక్తులుంటే వారెవరు? ఇలాంటి ప్రశ్నలకు కంప్యూటర్‌ సమాధానం చెప్పేలా

చిత్రం చూపిస్తే.. విషయం చెప్పేస్తుంది ఈ కంప్యూటర్‌
ట్రిపుల్‌ఐటీలో పరిశోధన నమునా

రాయదుర్గం, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): ఒక చిత్రం... డాక్యుమెంట్‌ కంప్యూటర్‌కు ఇస్తే అందులో ఏముంది? వ్యక్తులుంటే వారెవరు? ఇలాంటి ప్రశ్నలకు కంప్యూటర్‌ సమాధానం చెప్పేలా సరికొత్త సాంకేతికతను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ పరిశోధకులు. కృత్రిమ మేధ, మెషిన్‌ టెర్నింగ్‌ సాయంతో చిత్రాలను చూసి సమాధానం చెప్పే ప్రత్యేక డొమైన్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రతువులో తొలి విజయం సాధించారు. త్వరలో పూర్తిస్థాయి సాంకేతికతను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. 

అమెజాన్‌, బార్సిలోన వర్సిటీ సహకారం

ఇప్పటి వరకు ఏదైనా చిత్రం... స్కాన్‌ చేసిన పత్రాలు వీధుల గుర్తులు వంటివి చూసి అందులోని విషయాలను గుర్తుపట్టే సాంకేతికత పూర్తిస్థాయిలో అందుబాటులో లేదు. ఈ తరహా దృశ్య సహిత (విజువల్‌) గుర్తింపు సాంకేతికత ప్రత్యేక డొమైన్‌ అవసరం ఉంది. దీనికి ట్రిపుల్‌ఐటీలోని సెంటర్‌ ఫర్‌ విజువల్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (సీవీఐటీ) రూపకల్పన చేపట్టింది. ఈ పరిశోధనకు అమెజాన్‌ ఏడబ్ల్యూఎస్‌ మెషిన్‌ లెర్నింగ్‌ అవార్డు ఆర్థిక చేయూతనిస్తుండగా బార్సిలోన విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్‌ విజర్‌ సెంటర్‌ (సీవీసీ) సహకారం అందిస్తున్నాయి. ట్రిపుల్‌ఐటీ సీవీఐటీలోని ప్రొఫెసర్‌ సీవీ జవహర్‌ నేతృత్వంలోని మినేశ్‌ మాథ్యూ, బార్సిలోన వర్సిటీకి చెందిన అసోసియేట్‌ డైరెక్టర్‌ డిమోస్టినిస్‌ కరట్టాస్‌ పరిశోధనలో నిమగ్నమయ్యారు. డాక్యుమెంట్‌ విజువల్‌ క్వశ్చన్‌ ఆన్సరింగ్‌ (డీఏక్యూఏ) పేరిట డాక్యుమెంట్‌, పుస్తకం, వార్షిక నివేదిక, హాస్య సంబంధిత వాక్యాలను చూసి కంప్యూటర్‌ స్పందించే వీలుగా సాంకేతికతను సిద్ధం చేస్తున్నారు. 

రెండు దశల్లో వృద్ధి..

మనిషి ఇచ్చే సందేశాలను పసిగట్టి కచ్చిత్వంతో వేగంగా కంప్యూటర్‌ స్పందించి సమాధానాలు చెప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు. తొలిదశలో ఒక చిత్రం కంప్యూటర్‌కు అందిస్తే అందులో మనుషులు ఉన్నారా? జంతువు లేదా ఏదైనా ఆహార పదార్థం ఉందా? అని అడిగితే చెప్పేలా డీవీక్యూఏను డిజైన్‌ చేస్తున్నారు. తర్వాత దశలో చిత్రంలో ప్రముఖులు ఉంటే గుర్తించి చెప్పడం, వారు ఏం చేస్తున్నారో తెలియజేస్తుంది. గత ఏడాది కాలంలో 12వేల పత్రాలను చిత్రాలుగా తీసి 50వేల ప్రశ్నలు, జవాబులు వచ్చేలా తీర్చిదిద్దారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో స్విట్జర్లాండ్‌లో జరిగే పత్రవిశ్లేషణ, గుర్తింపు అంతర్జాతీయ సదస్సులో పరిశోధకులు పాల్గొని తాము రూపొందించిన సాంకేతికతపై ప్రదర్శన ఇవ్వనున్నారు. మన ఎదురుగా ఉన్న ఆహారంలో పోషకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అడిగి తెలుసుకునే విధంగా మా సంకేతికత ఉండబోతోంది. అని ట్రిపుల్‌ఐటీ ఆచార్యుడు ప్రొఫెసర్‌ జవహర్‌ వివరించారు.  





Updated Date - 2021-04-10T06:39:33+05:30 IST