హెల్మెట్‌లో ఇరుక్కున్న బంతి..అది క్యాచా?

ABN , First Publish Date - 2022-08-19T10:01:17+05:30 IST

బీసీసీఐ నిర్వహించిన అంపైర్స్‌ లెవల్‌-2 పరీక్షలో ఇలా మెదడుకు మేతపెట్టే 37 ప్రశ్నలతో అభ్యర్థుల తార్కిక నైపుణ్యాలను పరీక్షించింది.

హెల్మెట్‌లో ఇరుక్కున్న బంతి..అది క్యాచా?

 బీసీసీఐ అంపైర్ల పరీక్షలో సంక్లిష్ట ప్రశ్నలు 

140 మందిలో ముగ్గురే పాస్‌

పిచ్‌పై పెవిలియన్‌, చెట్టు లేదా ఫీల్డర్‌ నీడ పడుతుందని ఓ బ్యాటర్‌ ఫిర్యాదు చేస్తే నువ్వేం చేస్తావ్‌? 

బౌలర్‌ బౌలింగ్‌ చేసే చేతి చూపుడు వేలికి అయిన గాయం నిజమైందని నువ్వు విశ్వసించావు. ఆ వేలికి వేసిన బ్యాండేజ్‌ తీస్తే.. రక్తం కారుతుంది. ఈ పరిస్థితుల్లో సదరు ఆటగాడు బౌలింగ్‌ చేయడానికి వస్తే.. వేలికి వేసిన బ్యాండేజ్‌ను తీయాలని సూచిస్తావా?

బ్యాటర్‌ కొట్టిన బంతి.. షార్ట్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న ఫీల్డర్‌ హెల్మెట్‌లో ఇరుక్కొంది. అయితే, ఆ అదురుడుకు హెల్మెట్‌ జారిపడగా.. ఫీల్డర్‌ ఆ హెల్మెట్‌ను క్యాచ్‌ అందుకొన్నాడు. అప్పీలు చేస్తే.. నీ నిర్ణయం?


న్యూఢిల్లీ: బీసీసీఐ నిర్వహించిన అంపైర్స్‌ లెవల్‌-2 పరీక్షలో ఇలా మెదడుకు మేతపెట్టే 37 ప్రశ్నలతో అభ్యర్థుల తార్కిక నైపుణ్యాలను పరీక్షించింది. గత నెలలో అహ్మదాబాద్‌లో నిర్వహించిన ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు గ్రూప్‌-డి కేటగిరీగా భావించే మహిళలు, జూనియర్ల మ్యాచ్‌లకు అంపైరింగ్‌ చేసే అర్హత సాధిస్తారు. బీసీసీఐ ఎలిట్‌ అంపైర్లుగా ఎదగడానికి కూడా ఇది ప్రాథమిక పరీక్ష. అయితే, 140 మంది అభ్యర్థులు ఈ ఎగ్జామ్‌ రాస్తే.. ముగ్గురు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 200 మార్కులకుగాను (రాత పరీక్షకు 100, వైవా, వీడియోకు 35, ఫిజికల్‌ టెస్ట్‌కు 30) 90 మార్కులను కటా్‌ఫగా నిర్ణయించారు. కాగా, కరోనా తర్వాత తొలిసారి శారీరక సామర్థ్య పరీక్ష నిర్వహించగా.. మ్యాచ్‌ల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల వీడియోలను చూపిస్తూ ప్రశ్నలు అడిగారు. ప్రాక్టికల్స్‌లో ఎక్కువ శాతం మంది రాణించినా.. రాత పరీక్షకు వచ్చేసరికి తడబడ్డారు. కానీ, అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన వారిని ఎంపిక చేయాలనే ఉద్దేశంతోనే కఠిన పరీక్ష నిర్వహించినట్టు బోర్డు అధికారి ఒకరు తెలిపారు.


‘అంపైరింగ్‌ అనేది ఎంతో సంక్లిష్టమైన వృత్తి. రాష్ట్ర సంఘాలు పంపిన అభ్యర్థుల్లో అంతటి స్థాయి లేదు. బోర్డు ప్రమాణాలను అందుకోవాలంటే వారు విషయ పరిజ్ఞానాన్ని మరింతగా మెరుగుపరచుకోవాలి’ అని చెప్పారు. గత ఐపీఎల్‌లో కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారిన విషయాన్ని గుర్తు చేశారు. వీటికి సరైన పరిష్కారం మ్యాచ్‌ సమయంలోనే లభించాలంటే.. అంపైర్లకు ఎంతో పరిజ్ఞానం అవసరమని చెప్పారు. 


పై ప్రశ్నలకు సమాధానాలు..

నీడలను విస్మరించాలి. కదలకుండా ఉండాలని ఫీల్డర్లను కోరవచ్చు లేదా బంతిని డెడ్‌ బాల్‌గా ప్రకటించవచ్చు.

బౌలింగ్‌ చేయాలంటే వేలికి ఉన్నబ్యాండేజ్‌ను తొలగించాల్సిందే.

అలా క్యాచ్‌ పడితే.. నాటౌట్‌గా పరిగణించాలి.

Updated Date - 2022-08-19T10:01:17+05:30 IST