గడువులోగా పూర్తయ్యేనా?

ABN , First Publish Date - 2022-05-23T07:07:20+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మన ఊరు-మన బడి కార్యక్రమం జిల్లాలో ఆశించిన మేర పనులు జరగడంలేదు. జూన్‌ 13 నుంచి విద్యాసంవత్సరం ప్రారంభంకానుండగా మరో 20 రోజుల గడువులో పనుల పూర్తిపై స్పష్టతలేదు.

గడువులోగా పూర్తయ్యేనా?
ఇంకా పనులు ప్రారంభంకాని కోటగల్లి బాలికల పాఠశాల

జిల్లాలో నత్తనడకన ‘మన ఊరు-మన బడి’ పనులు

జూన్‌ 10లోగా పనులు పూర్తిచేయాలని కలెక్టర్‌ ఆదేశాలు

నిజామాబాద్‌ అర్బన్‌, మే 22: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మన ఊరు-మన బడి కార్యక్రమం జిల్లాలో ఆశించిన మేర పనులు జరగడంలేదు. జూన్‌ 13 నుంచి విద్యాసంవత్సరం ప్రారంభంకానుండగా మరో 20 రోజుల గడువులో పనుల పూర్తిపై స్పష్టతలేదు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంనాటికి ఈ కార్యక్రమం కిం ద ఎంపికైన పాఠశాలల్లో కనీస వసతులు కల్పిస్తే విద్యార్థులకు మేలు జరిగే అవకాశాలు ఉన్నా.. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడంలేదు. ఇంజనీరింగ్‌ అధికారుల కొరత, శాఖల మధ్యసమన్వయ లోపంతో ఆశించిన మేర జరగడంలేదు. కొన్ని పాఠశాలల్లో పను ల గుర్తింపు ఇంకా అంచనాల దశలోనే ఉండగా ఇటీవల కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులతో నిర్వహించిన సమీక్షలో పనులు జూన్‌ 10లోగా పూర్తికావాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సోమవారం నుంచి జిల్లాలో పదవతరగతి వార్షీక పరిక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో వారం రోజుల పాటు పరిక్షలు జరిగే పాఠశాలల్లో పనులకు బ్రేక్‌ పడే అవకా శం ఉంది. జూన్‌ 13 నుంచి విద్యాసంవత్సరం ప్రారంభంకానున్న నేపథ్యంలో పనులు ఏ స్థాయిలో పూర్తవుతాయో తెలియని అయోమయ పరిస్థితి జిల్లాలో నెలకొంది.

జిల్లాలో 407 పాఠశాలలు ఎంపిక

మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు నిర్ణయం తీసుకుంది. జిల్లాలో మొత్తం 1100 పైగా పాఠశాలలు ఉండగా మొదటి విడతగా జిల్లావ్యాప్తంగా 407 పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిల్లో ప్రధానంగా తాగునీటి సౌకర్యం, ప్రహరిగోడ, వంటగది, మరుగుదొడ్లు, ఫర్నిచర్‌, గ్రీన్‌బోర్డులు, డిజిటల్‌ తరగతులు, విద్యుత్‌ సౌకర్యం, అవసరంమేర అదనపు తరగతి గదుల నిర్మాణం తదితర పనులు చేపట్టనున్నారు. కని ప్రస్తుతం అత్యవసరంగా 115 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా జూన్‌ 10లోగా పను లు పూర్తిచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. 115 పాఠశాలల అంచనా నివేదికలు సమర్పించి న నేపథ్యంలో నిధులు విడుదల కాగా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. 

శాఖల మధ్య సమన్వయ లోపం

రాబోయే విద్యాసంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలను అందంగా తీర్చిదిద్దడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యపెంచే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్ర మం అధికారులు, శాఖల మధ్య సమన్వయ లోపంతో జిల్లాలో పనులు నత్తనడకన జరుగుతున్నాయి. ఇప్పటికీ కొన్ని పాఠశాలలకు సంబంధించి ఇంకా అంచనా నివేదికలు సైతం సిద్ధంకాకపోవడం పనుల విషయంలో అధికారులకు ఏవిధమైన ఆసక్తి ఉందో తెలుస్తుంది.  

అదనపు గదుల ఊసేలేదు

జిల్లాలో ఈ కార్యక్రమం ద్వారా ఎంపికైన పాఠశాలల్లో కొన్ని పాఠశాలలు పూర్తిగా శిఽథి లావస్థలో ఉన్నాయి. ఆ పాఠశాలలకు పూర్తిస్థాయిలో నూతన భవనాలు నిర్మించాల్సి ఉంది.  విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణానికి ప్రభుత్వం అ నుమతి ఇచ్చిన ఆ పనులు సైతం ఇంకా అంచనాల దశలోనే ఉన్నాయి. నగరంలో పూర్తిగా కూలిపోయే దశలో ఉన్న కోటగల్లి బాలికల పాఠశాల ఈ పథకం కింద ఎంపికైన ఇటీవల ఎమ్మెల్యే బిగాల పనులు ప్రారంభించిన పనులు మాత్రం ప్రారంభంకాలేదు. 

సెలవుల్లోనే పూర్తికావాల్సిన పనులు

మన ఊరు-మన బడి కింద ఎంిపికైన పాఠశాలల్లో వేసవి సెలవుల్లోనే మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పనులు పూర్తికావాల్సి ఉండగా.. దాదాపుగా వేసవి సెలవులు ముగిసిపోతున్నా పనులు మాత్రం ఇంకా ప్రారంభంకాలేదు. మరో 20 రోజుల్లో పాఠశాలలు ప్రారంభంకానుండడం, వర్షాకాలం నేపథ్యంలో ఈ సంవత్సరం పనులు అంతంతమాత్రంగా నే జరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని పాఠశాలల్లో కనీస వసతులు కల్పిస్తే చాలు అనే పరిస్థితి ఉన్నా ఇంకా పనులు మాత్రం ప్రారంభంకాలేదు. 

Updated Date - 2022-05-23T07:07:20+05:30 IST