పూర్తయిన నూక పరీక్షలు

ABN , First Publish Date - 2022-06-28T06:46:41+05:30 IST

యాసంగిలో ధాన్యానికి సంబంధించి నూకశాతం లెక్కించేందుకు గాను మైసూర్‌లోని శాస్త్రవేత్తల బృందం నిర్మల్‌లో సత్యనారాయణ ఆగ్రో ఽఇండస్ర్టీస్‌లో ధాన్యం టెస్ట్‌ మిల్లింగ్‌ ప్రక్రియ పూర్తి చేశారు.

పూర్తయిన నూక పరీక్షలు
సోన్‌ మండలం గంజాల్‌ గ్రామంలోని సత్యనారాయణ ఆగ్రో ఇండ్రస్టీస్‌ను సందర్శించిన శాస్త్రవేత్తలు

ధాన్యం మిల్లింగ్‌ పరీక్షలు సంపూర్ణం

రెండు రోజుల పాటు నిర్మల్‌లో మైసూర్‌ శాస్త్రవేత్తల తిష్ట 

శాస్త్రీయంగా నూకశాతం లెక్కింపు 

సీఎఫ్‌టీఆర్‌ఐ ఆధ్వర్యంలో ముగిసిన ప్రక్రియ 

నిర్మల్‌, జూన్‌ 27 (ఆంఽధ్రజ్యోతి) : యాసంగిలో ధాన్యానికి సంబంధించి నూకశాతం లెక్కించేందుకు గాను మైసూర్‌లోని శాస్త్రవేత్తల బృందం నిర్మల్‌లో సత్యనారాయణ ఆగ్రో ఽఇండస్ర్టీస్‌లో ధాన్యం టెస్ట్‌ మిల్లింగ్‌ ప్రక్రియ పూర్తి చేశారు. యాసంగిలో ధాన్యంలో నూకశాతం ఎంత మేరకు ఉంటుందనే అంశాన్ని నిర్ధారించేందు కోసం మైసూర్‌కు చెందిన సెంట్రల్‌ఫుడ్‌ టెక్నాలజీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలు ఆది, సోమవారాలు రెండు రోజుల పాటు ఇక్కడి రైస్‌మిల్లులో మిల్లింగ్‌ అవుతున్న ధాన్యాన్ని స్వయంగా పరిశీలించారు. దీని కోసం గాను పౌర సరఫరాల శాఖ అన్నిరకాల ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే పౌర సరఫరాల శాఖ అధికారులు సీఎఫ్‌టీఆర్‌ఐ శాస్త్రవేత్తలు ధాన్యం శాంపిళ్లను సేకరించారు. ఈ శాంపిళ్లను బెంగుళూర్‌లోని ఇన్‌స్టిట్యూట్‌లో టెస్ట్‌ చేసి ప్రాథమిక నివేదిక తయారు చేశారు. ఈ నివేదిక ఆధారంగా మరోసారి ముగ్గురు మైసూర్‌కు చెందిన శాస్త్రవేత్తలు, అలాగే హైదరాబాద్‌కు చెందిన మరో ముగ్గురు శాస్త్రవేత్తలు, పౌర సరఫరాలశాఖ అధికారులు రైస్‌మిల్లులోనే తిష్టవేసి రెండు రోజుల పాటు టెస్ట్‌ మిల్లింగ్‌ పేరిట నూకశాతాన్ని నిర్ధారించారు. దీని తర్వాత తుది నివేదికను రూపొందించి సర్కారుకు అందించనున్నారు. ఈ నివేదికల ఆఽధారంగా నూకశాతాన్ని ఖరారు చేసి నష్ట పరిహారాన్ని నిర్ధారించనున్నారు. ఇదిలా ఉండగా టెస్ట్‌మిల్లింగ్‌ కోసం రాష్ట్రంలోని 11 జిల్లాల్లో గల ఒక్కో రైస్‌మిల్‌ను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో భాగంగానే నిర్మల్‌లోని సత్యనారాయణ ఆగ్రో ఇండస్ర్టీస్‌ మిల్లును ఎంపిక చేశారు. 

రెండు రోజుల పాటు టెస్ట్‌ మిల్లింగ్‌..

మైసూర్‌కు చెందిన సీఎఫ్‌టీఆర్‌ఐ శాస్త్రవేత్తల బృందంకు పౌర సరఫరాలశాఖ అధికారులు ఇక్కడి సత్యనారాయణ ఆగ్రో ఇండస్ర్టీస్‌ మిలు ్లను సిద్ధం చేశారు. మిల్లుసామర్థ్యం కన్నా ఐదురెట్ల ధాన్యాన్ని అందుబాటులో ఉంచారు. మైసూర్‌కు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలతో పాటు హైదరాబాద్‌కు చెందిన మరో ముగ్గురు శాస్త్రవేత్తలు, సివిల్‌ సప్లయ్‌ క్వాలిటీ కంట్రోల్‌ అధికారులైన ఎం.శ్రీనివాసులు, యం.ఏ రషీద్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ భూషణంతో పాటు మరో ముగ్గురు టెక్నికల్‌ అసిస్టెంట్‌ లు ఈ పరిశీలన ప్రక్రియ బృందంలో ఉన్నారు. ఆది, సోమవారాల్లో ఈ బృందం మిల్లులోనే ఉండి ఉదయం నుంచి రాత్రి వరకు ధాన్యం మిల్లింగ్‌ను అలాగే ధాన్యం క్వాలిటీని పరిశీలించారు. అలాగే టెస్ట్‌ మిల్లింగ్‌ జరిగిన రెండురోజుల పాటు కరెంటు సరఫరాకు అంతరాయం లేకుండా సీఎఫ్‌టీఆర్‌ఐ  అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు వ్యవసాయశాఖ, సహకార శాఖలు కూడా పౌర సరఫరా శాఖతో  కలిసి ఈ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేసింది. 


రెండు రకాల వడ్ల ఎంపిక

కాగా టెస్ట్‌ మిల్లింగ్‌ కోసం ఇక్కడి రైతులు ఎక్కువగా సాగుచేసే రెండు రకాల వడ్లను ఎంపిక చేశారు. స్థానికంగా హజార్‌దస్‌ అని పిలుచుకునే యంటీఏయూ 1010 అలాగే మరోరకం వడ్లను ఈ టెస్ట్‌ మిల్లింగ్‌లో ఉపయోగించారు. తెలంగాణ ప్రాంతంలో ఈ రకం వడ్లను ఎక్కువగా సాగు చేస్తున్నందున టెస్ట్‌మిల్లింగ్‌ కోసం వీటికి ప్రాధాన్యత కల్పించారు. 

శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో టెస్ట్‌మిల్లింగ్‌..

 మైసూర్‌కు చెందిన శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ధాన్యం మిల్లింగ్‌ ప్రక్రియ పూర్తయింది. రెండు రోజుల పాటు శాస్త్రవేత్తలు స్వయంగా మిల్లింగ్‌ ప్రక్రియను పరిశీలించారు. శాస్ర్తీయపద్దతిలో టెస్ట్‌మిల్లింగ్‌కు సంబంధించిన ప్రక్రియ ముగిసింది. శాస్త్రవేత్తలు తమ నివేదికలను ప్రభుత్వానికి నివేదిస్తారు. టెస్ట్‌మిల్లింగ్‌కు సంబంధించిన వివరాలతో తమకు సంబంధం ఉండదు. ప్రభుత్వమే వివరాలు వెల్లడిస్తోంది. 

- రాంబాబు, అడిషనల్‌ కలెక్టర్‌, నిర్మల్‌

Updated Date - 2022-06-28T06:46:41+05:30 IST