పూర్తైన ప్రాణహిత వారధి

ABN , First Publish Date - 2020-10-24T09:25:46+05:30 IST

70 ఏళ్లుగా కేవలం హామీలకే పరిమితమైన ప్రాణహిత నది బ్రిడ్జి నిర్మాణం ఎట్టకేలకు పూర్తైంది. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని చింతలమానేపల్లి

పూర్తైన ప్రాణహిత వారధి

త్వరలోనే ప్రారంభం.. తెలంగాణ-మహారాష్ట్రల మధ్య భారీగా తగ్గనున్న దూరం


ఆసిఫాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): 70 ఏళ్లుగా కేవలం హామీలకే పరిమితమైన ప్రాణహిత నది బ్రిడ్జి నిర్మాణం ఎట్టకేలకు పూర్తైంది. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని చింతలమానేపల్లి మండలం గూడెం వద్ద ప్రాణహిత నదిపై రాష్ట్ర ప్రభుత్వం రూ.55కోట్లతో వ్యయంతో నిర్మించిన వారధి తయారైంది. నవంబరులో వంతెనను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2017, ఫిబ్రవరి 6న అప్పటి   రోడ్డు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రస్తుత మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డితో పాటు సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వంతెన నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. మధ్యలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల పనులు మందకొడిగా సాగినా ఎట్టకేలకు ఇటీవల నిర్మాణం పూర్తైంది. 26 స్తంభాలతో సెగ్మెంట్లను కలిపి ఆధునిక సాంకేతికతను జోడించి నిర్మించడం గమనార్హం. ఈ బ్రిడ్జి నిర్మాణంతో కుమరం భీం ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల జిల్లాలకు చెందిన ప్రజలకు మహారాష్ట్రలోని అహేరి, గడ్చిరోలి ప్రాంతాలకు మధ్య రాకపోకలు పెరగనున్నాయి. వ్యాపార, వాణిజ్యపరంగా రవాణా ఇబ్బందులు తొలగనున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ప్రస్తుత దూరం చూస్తే.. చింతలమానేపల్లి నుంచి మహారాష్ట్రలోని అహేరికి 125 కిలోమీటర్ల దూరం ఉండగా.. వంతెన మొదలైతే కేవలం 22 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే సరిపోతుంది. చింతలమానేపల్లి నుంచి గడ్చిరోలి వెళ్లేందుకు 168 కిలోమీటర్ల దూరం ఉండగా ఈ వంతెన మీదుగా వెళ్తే కేవలం 50కిలోమీటర్లు మాత్రమే ప్రయాణ సమయం. అదే విధంగా చత్తీ్‌సగఢ్‌ దూరం 250 కిలోమీటర్ల నుంచి 130 కిలోమీటర్లకు, మధ్యప్రదేశ్‌కు 340 కిలోమీటర్ల నుంచి 215 కిలోమీటర్లకు దూరం తగ్గింది. ఇక చింతలమానేపల్లి నుంచి గోదావరిఖని మీదుగా కాళేశ్వరం వెళ్లేందుకు 245 కిలోమీటర్ల దూరం.. అహేరి, సిరికొండ మీదుగా ప్రయాణిస్తే 140 కిలోమీటర్లు తగ్గనుంది.




అభివృద్ధికి బాటలు

ప్రాణహిత వద్ద వంతెన నిర్మాణంతో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని సరిహద్దు మండలాలైన కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూరు ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందే ఆస్కారం ఉంది. 

కోనేరు కోనప్ప, సిర్పూర్‌ ఎమ్మెల్యే

Updated Date - 2020-10-24T09:25:46+05:30 IST