Abn logo
Sep 25 2021 @ 01:02AM

సచివాలయ భవన నిర్మాణాలు పూర్తిచేయండి

కొత్తూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం రుచి చూస్తున్న కలెక్టర్‌

జ్వరాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం

జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున


చోడవరం, సెప్టెంబరు 24: గ్రామ సచివాలయాల భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున ఆదేశించారు. మండలంలోని వెంకన్నపాలెం, గోవాడ, చోడవరం గ్రామాల్లో శుక్రవారం పర్యటించి గ్రామ సచివాలయాలు, అభివృద్ధి పనులను పరిశీలించారు. వెంకన్నపాలెంలో భవన నిర్మాణాలు నిలిచిపోవడానికి కారణాలపై ఆరా తీశారు. ఒకరికే ఎక్కువ పనులు కేటాయించకుండా, వీలైనంత ఎక్కువ మందిని భాగస్వామ్యులను చేసి నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయాలని పీఆర్‌ డీఈఈ ప్రసాద్‌కు సూచించారు. అనంతరం కమ్యూనిటీ ఆసుపత్రిని సందర్శించి వైద్య సేవలపై డాక్టర్లను ఆరా తీశారు. జ్వరాలపై ప్రత్యేక దృష్టిసారించాలని, అనుమానితులకు రక్త పరీక్షలు చేయాలని ఆయన సూచించారు. కాగా, వెంకన్నపాలెం వీఆర్వో తీరుపై స్థానికులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇళ్ల పట్టాల పేరుతో పేదల స్థలాలను బలవంతంగా లాక్కునేందుకు వీఆర్వో ప్రయత్నాలు చేస్తున్నారని, పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరుకు ఆటంకాలు పెడుతున్నారని సియ్యాద్రి జగదీశ్‌ కలెక్టర్‌కు తెలిపారు. దీనిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని తహసీల్దార్‌ తిరుమలబాబుకు కలెక్టర్‌ ఆదేశించారు.


విద్యార్థులతో భోజనం చేసిన కలెక్టర్‌

కొత్తూరు ప్రభుత్వపాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్‌ మల్లికార్జున తనిఖీ చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం రుచి చూశారు. మధ్యాహ్న భోజనం వంటకాల తయారీలో జాగ్రత్తలు పాటించాలని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. కార్యక్రమంలో అనకాపల్లి ఆర్డీవో జె.సీతారామారావు, ఈవోపీఆర్డీ బి.చైతన్య, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్‌ జ్యోతుల రమేశ్‌, డాక్టర్‌ మహేశ్‌ పాల్గొన్నారు.