గాలి కేసులో డిశ్చార్జ్‌ పిటిషన్లపై 29లోగా విచారణ ముగించండి

ABN , First Publish Date - 2022-09-23T10:45:47+05:30 IST

గాలి కేసులో డిశ్చార్జ్‌ పిటిషన్లపై 29లోగా విచారణ ముగించండి

గాలి కేసులో డిశ్చార్జ్‌ పిటిషన్లపై  29లోగా విచారణ ముగించండి

సాధ్యమైతే తీర్పు ఇచ్చేయండి.. సుప్రీం ఉత్తర్వులు 

న్యూఢిల్లీ, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ఓబులాపురం మైనింగ్‌ కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులపై నమోదైన కేసుల విచారణపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 29లోగా డిశ్చార్జ్‌ పిటిషన్లపై విచారణ ముగించాలని హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టును ఆదేశించింది. సాధ్యమైతే వాటిపై తీర్పు కూడా ఇచ్చేయాలని సూచించింది. గాలి జనార్దన్‌రెడ్డి పిటిషన్లపై జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ కృష్ణమురారితో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. కేసు ట్రయల్‌ ఇంకా మొదలుకాకపోవడానికి గల కారణాలను వివరిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు సమర్పించిన సీల్డ్‌ కవర్‌ నివేదికను ధర్మాసనం పరిశీలించింది. ఐపీసీ సెక్షన్లు 120-బీ, 379, 420, 411, 427, 447తో పాటు అవినీతి నిరోధక చట్టం, 1988లోని సెక్షన్‌ 13(2) రెడ్‌ విత్‌ సెక్షన్‌ 13(1)(డీ) కింద 2009లో నమోదైన కేసు ట్రయల్‌ను జాప్యం చేయడానికి నిందితులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రాథమికంగా అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. కాబట్టి డిశ్చార్జ్‌ పిటిషన్ల విచారణలో ఎటువంటి వాయిదాలు ఇవ్వకూడదని సీబీఐ ప్రత్యేక కోర్టుకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాగా, విచారణ సందర్భంగా కేసులో ఎంతమంది నిందితులు ఉన్నారని ధర్మాసనం ప్రశ్నించగా... 9మంది నిందితులు ఉన్నారని జనార్దన్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది రంజిత్‌ కుమార్‌ బదులిచ్చారు. ‘‘నిందితులు ఒకరి తర్వాత ఒకరు డిశ్చార్జ్‌ పిటిషన్లు దాఖలు చేశారు. అందుకే 12ఏళ్లు గడిచినా ట్రయల్‌ పూర్తి కాలేదు. ట్రయల్‌ను వేగవంతం చేయాలని 2013లో ఒకసారి, గతేడాది మరోసారి సుప్రీంకోర్టు ఆదేశించినా ఇంకా మొదలే కాలేదు’’ అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కృపానందం, మహఫూజ్‌ అలీఖాన్‌, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జ్‌ పిటిషన్లు ట్రయల్‌ కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని రంజిత్‌ కుమార్‌ చెప్పారు. సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ మాధవి దివాన్‌ వాదనలు వినిపిసస్తూ వ్యూహాత్మకంగా ఒకరు దాఖలు చేసిన పిటిషన్‌లో వచ్చిన స్టే ముగింపు గడువు దగ్గరకు రాగానే మరో నిందితుడు డిశ్చార్జ్‌, క్వాష్‌ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని, అందువల్ల కొన్నేళ్లుగా ట్రయల్‌ జాప్యమవుతోందన్నారు. గాలి జనార్దన్‌రెడ్డి బళ్లారి వెళ్లడానికి అనుమతించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకించామన్నారు. బళ్లారిలో 47మంది సాక్షులు ఉన్నారని, వారిని బెదిరించే ప్రయత్నం జరిగే అవకాశం ఉందన్నారు. గతంలో సీబీఐ కోర్టు న్యాయమూర్తిని కూడా ప్రలోభపెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. కాగా,తనకు సమయం కావాలని, విచారణను వాయిదా వేయాలని రంజిత్‌ కుమార్‌ విజ్ఞప్తి చేయడంతో విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. 


Updated Date - 2022-09-23T10:45:47+05:30 IST