సిరి ధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం

ABN , First Publish Date - 2022-08-08T05:02:52+05:30 IST

రైతులు సాగుచేస్తున్న పలురకాల పంటలతో పాటుగా సిరి ధాన్యాలను సాగుచేసి ఆహారంగా తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ప్రకృతి ప్రేమికులు, ప్రఖ్యాత స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్‌ ఖాదర్‌ వలీ అన్నారు.

సిరి ధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం
అవగాహనా సదస్సులో మాట్లాడుతున్న ఖాదర్‌ వలీ

సూర్య కిరణాలతో సగం వ్యాధులు దూరం

ఇబ్రహీంపూర్‌ ప్రజలకు సిరి ధాన్యాలపై అవగాహనా సదస్సు

శాస్త్రవేత్త డాక్టర్‌ ఖాదర్‌వలీ

నారాయణరావుపేట, ఆగస్టు 7: రైతులు సాగుచేస్తున్న పలురకాల పంటలతో పాటుగా సిరి ధాన్యాలను సాగుచేసి ఆహారంగా తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ప్రకృతి ప్రేమికులు, ప్రఖ్యాత స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్‌ ఖాదర్‌ వలీ అన్నారు. ఆదివారం నారాయణరావుపేట మండలం మంత్రి హరీశ్‌రావు దత్తత గ్రామమైన ఇబ్రహీంపూర్‌లో తెలంగాణ రిటైర్డ్‌ ఇంజనీర్ల సంఘం, వ్యవసాయశాఖ, ఆత్మకమిటీ ఆధ్వర్యంలో సిరి ధాన్యాల సాగుపై అవగాహనా సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖాదర్‌ వలీ హాజరై మాట్లాడారు. జీవనశైలిలో ఎవరు ఎంత ముందుకు వెళ్తున్నామననే ఆలోచనలు ఉన్నప్పటికీ, ఏదో ఒక వ్యాధి మాత్రం వెంటాడుతూ ఉంటుందన్నారు. మంచి సిరి ధాన్యాలను తినడం ద్వారా ఎలాంటి అనారోగ్య ఇబ్బందులు లేకుండా జీవించవచ్చన్నారు. ప్రతిరోజు ఉదయించే సూర్యుడి ఎర్రటి కిరణాలతో మనిషికి రోగనిరోధక శక్తి పెరుగుతుందని, ప్రతిరోజు సూర్య నమస్కారం అలవర్చుకోవాలని సూచించారు. ఔషధ శాల ఎక్కడో లేదని, మన వంటింటి సామగ్రినే ప్రత్యేక ఔషధ శాల అన్నారు. సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల 20 శాతం మంది శిశువులు మంద బుద్ధితో జన్మిస్తున్నారని తెలిపారు. గరిక, తులసి, వేప, కానుగ, నేరేడు వంటి వాటితో కషాయాలను తయారు చేసుకుని వారానికి రెండుసార్లు తీసుకోవడం ఎంతో మేలన్నారు. రైతులు సిరి ధాన్యాల పంటలు పండించేందుకు ప్రత్యేక దృష్టిసారించాలని, అందుకు కావాల్సిన విత్తనాలను సరఫరా చేస్తామని హామీఇచ్చారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్‌ ఇంజనీర్ల సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్యాం ప్రసాద్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్‌, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, ఆత్మకమిటీ చెర్మన్‌ ప్రభాకర్‌వర్మ, ఏడీఏలు అనిల్‌కుమార్‌, పద్మ, ఎంపీపీ ఒగ్గు బాలకృష్ణ, సర్పంచ్‌ దేవయ్య, ఎంపీడీవో మురళీధర్‌శర్మ, ఏవోలు ప్రకా్‌షగౌడ్‌, గీత, ఏఈవో నాగార్జున్‌, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు తదతరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-08T05:02:52+05:30 IST