పనులు పూర్తిచేయండి

ABN , First Publish Date - 2022-06-30T04:58:01+05:30 IST

జిల్లాలో ఖనిజ నిధి(మినరల్‌ ఫండ్‌) నుంచి 582 పనులు మంజూరు చేయగా.. ఇప్పటివరకు 226 పనులు మాత్రమే పూర్తయ్యాయని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ తెలిపారు. మిగిలిన పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు.

పనులు పూర్తిచేయండి
మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

- కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌
కలెక్టరేట్‌, జూన్‌ 29:
జిల్లాలో ఖనిజ నిధి(మినరల్‌ ఫండ్‌) నుంచి 582 పనులు మంజూరు చేయగా.. ఇప్పటివరకు 226 పనులు మాత్రమే పూర్తయ్యాయని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ తెలిపారు. మిగిలిన పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయం సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మినరల్‌ ఫండ్స్‌ అందుబాటులో ఉన్నాయన్నారు. మిగిలిన పనులు ప్రారంభించకపోతే.. వాటిని రద్దు చేసి కొత్త వాటికి ప్రతిపాదనలు పంపాలని కోరారు. గ్రామీణ నీటిపారుదల శాఖ విభాగంలో ఎక్కువ పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. బోర్ల పనులు ప్రారంభించాలని ఆదేశించారు. అప్రోచ్‌ రోడ్డు వేయాలని, వసతిగృహాల్లో వంట గదులు నిర్మించాలని సూచించారు. నీటిపారుదల శాఖ ఈఈ సుధాకర్‌ మాట్లాడుతూ.. కొన్ని పనులు పురోగతిలో ఉన్నాయని, కొన్ని టెండర్‌ దశలో ఉన్నాయని వివరించారు. అవసరంలేని చోట పనుల రద్దుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.

అన్ని శాఖల్లో కనీస వేతనాలు
అన్ని శాఖల్లో కనీస వేతనాలు అమలు చేయాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఇంజనీరింగ్‌ శాఖలతో పాటు డ్వామా, వ్యవసాయం, పట్టు పరిశ్రమ, కార్మిక, వైద్య ఆరోగ్యశాఖ, ఉద్యానవన, మున్పిపల్‌ కార్పోరేషన్‌ తదితర శాఖల అధికారులతో కనీస వేతనాలపై చర్చించారు. ప్రస్తుతం అన్ని శాఖల్లోను కనీస వేతనాలు అమలు చేస్తున్నట్టు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.రాజేశ్వరి, సీపీవో లక్ష్మీప్రసన్న, డ్వామా పీడీ ఎం.రోజారాణి, వ్యవసాయ శాఖ జేడీ కె.శ్రీధర్‌, పట్టు పరిశ్రమల శాఖ ఏడీ ఎ.విక్టర్‌ సాల్మన్‌రాజు, పరిశ్రమల శాఖ డి.డి. ఉమమాహేశ్వరరావు, వైద్య ఆరోగ్యశాఖ నుంచి డాక్టర్‌ కృష్ణ మోహన్‌, ఉద్యానవన శాఖ ఎడీ ప్రసాదరావు, కార్మిక శాఖ నుంచి శైలేష్‌ కుమార్‌, పంచాయతీరాజ్‌, ఏపీఐడీసీ, మైన్స్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-06-30T04:58:01+05:30 IST