రాజకీయాలకు పూర్తి దూరం

ABN , First Publish Date - 2022-01-15T08:20:21+05:30 IST

రాజకీయాలకు తాను పూర్తిగా దూరమని, రాజ్యసభ టికెట్‌ ఇవ్వజూపారన్నది ఊహాగానం

రాజకీయాలకు  పూర్తి దూరం

  • రాజ్యసభ.. ఊహాగానమే
  • మెగాస్టార్‌ చిరంజీవి వివరణ


గన్నవరం, జనవరి 14: రాజకీయాలకు తాను పూర్తిగా దూరమని, రాజ్యసభ టికెట్‌ ఇవ్వజూపారన్నది ఊహాగానం మాత్రమేనని మెగా స్టార్‌ చిరంజీవి అన్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో తన సతీమణి సురేఖతో కలిసి శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు గన్నవరం విమానాశ్రయంలో దిగారు. ఆయన బయటకు రాగానే.. రాజ్యసభ వస్తుందా అని విలేకరులు ప్రశ్నించారు. ఆ మాటను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయనీ సందర్భంగా  స్పష్టంచేశారు. రాజకీయాలకు దూరంగా ఉన్న నాకు (రాజ్యసభ లాంటివి పదవులు) ఆఫర్లు ఇవ్వరు. అలాంటి వాటి కోసం లోబడేవాడిని కాదు. అలాంటి వాటిని కోరుకోవడం నా అభిమతం కాదు’ అని పేర్కొన్నారు. కాగా.. రాజకీయాలకు దూరంగా ఉంటున్న తాను తిరిగి రాజకీయాల్లోకి, చట్టసభలకు రావడం జరగదని సోషల్‌ మీడియా వేదికగా కూడా చిరంజీవి స్పష్టం చేశారు.


‘తెలుగు చిత్ర పరిశ్రమ మేలు కోసం, థియేటర్ల మనుగడ కోసం ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి చర్చించిన విషయాలను పక్కదోవ పట్టించే విధంగా, ఆ మీటింగ్‌కు రాజకీయ రంగు పులిమి నన్ను రాజ్యసభకు పంపుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అవన్నీ నిరాధారం’ అని పేర్కొన్నారు. ఊహాగానాలను వార్తలుగా ప్రసారం చేయొద్దని.. అటువంటి వార్తలకు, చర్చలకు పుల్‌స్టాప్‌ పెట్టాలని విజ్ఞప్తి చేశారు.


Updated Date - 2022-01-15T08:20:21+05:30 IST