అక్రమాలపై నిఘా!

ABN , First Publish Date - 2021-07-25T04:51:24+05:30 IST

ఆమదాలవలస మండలం తోటాడ భూ ఆక్రమణల డొంక కదిలింది. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఇప్పటికే విశాఖకు చెందిన ప్రాంతీయ నిఘా విభాగం అధికారి ప్రాథమిక స్థాయిలో సర్వే చేశారు. తప్పిదాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక అందించాలని జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆక్రమణల వెనుక బడా నాయకులు ఎవరెవరు ఉన్నారు? అన్నది నిఘా విభాగం నిగ్గు తేల్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో జాయింట్‌ కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ బావాజీ మఠానికి చెందిన భూములను శనివారం పరిశీలించారు. దీంతో ఈ వ్యవహారంపై ఎలా ముందుకెళ్లాలో తెలియక జిల్లా అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

అక్రమాలపై నిఘా!
తోటాడలో భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్న జేసీ సుమిత్‌ కుమార్‌

- తోటాడ భూముల అక్రమాలపై రాష్ట్ర సచివాలయానికి ఫిర్యాదు

- సమగ్ర సర్వేకు ప్రభుత్వ ఆదేశం

- ముఖ్య అంశాలపై నిఘా విభాగం నివేదిక

- కీలక నేతల ప్రమేయాన్ని గుర్తించిన వైనం

- ఆందోళనలో కొనుగోలుదారులు

- ‘ఆంధ్రజ్యోతి’ కథనాలకు స్పందన

(కలెక్టరేట్‌)

ఆమదాలవలస మండలం తోటాడ భూ ఆక్రమణల డొంక కదిలింది. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఇప్పటికే విశాఖకు చెందిన ప్రాంతీయ నిఘా విభాగం అధికారి ప్రాథమిక స్థాయిలో సర్వే చేశారు. తప్పిదాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక అందించాలని జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆక్రమణల వెనుక  బడా నాయకులు ఎవరెవరు ఉన్నారు? అన్నది నిఘా విభాగం నిగ్గు తేల్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో జాయింట్‌ కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ బావాజీ మఠానికి చెందిన భూములను శనివారం పరిశీలించారు. దీంతో ఈ వ్యవహారంపై ఎలా ముందుకెళ్లాలో తెలియక జిల్లా అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.  వివరాల్లోకి వెళితే.. తోటాడ రెవెన్యూలోని సర్వే నెంబర్‌ 121లో బావాజీ మఠానికి చెందిన సుమారు 199.48 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. ఈ భూముల్లో భారీ భవనాలు వెలిశాయి. తప్పుడు సర్వే నెంబర్లతో అడ్డగోలుగా రిజిస్ర్టేషన్లు సాగాయి. దీనిపై గతంలో ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు వెలువడ్డాయి. దీంతో జిల్లా ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఈ భూముల రిజిస్ట్రేషన్లు, క్రయవిక్రయాలను నిలుపుదల చేశారు. సర్వే నెంబర్‌ 121లో సుమారు 340 అక్రమ భవన నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు. మరికొంత భూమి కబ్జాదారుల సాగులో ఉన్నట్లు తేలింది. ఇందుకు సంబంధించి అప్పటి జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. దీంతో రాష్ట్రస్థాయిలో కదలిక వచ్చింది. దీంతో ఈ వ్యవహారం నుంచి బయపడేందుకు కొందరు కబ్జారాయుళ్లు అధికార పార్టీ నేతలను ఆశ్రయించారు. ఆమదాలవలసకు చెందిన వైసీపీ కీలకనేత సతీమణి కబ్జాదారుల నుంచి రూ.10కోట్లు డిమాండ్‌ చేసినట్లు సమాచారం. రూ.3 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయించగా.. ఇందుకు ఆమె నిరాకరించినట్లు తెలిసింది. దీంతో కొందరు నేరుగా రాష్ట్ర సచివాలయ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అధికార పార్టీకి చెందిన ఓ కీలకనేత సతీమణి ఈ వ్యవహారంలో తలదూర్చడంతో ఇంతవరకు జిల్లా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. మరోపక్క ఆన్‌లైన్‌ ఖాతాలో ఈ భూములు ఉండడంతో చర్యలు తీసుకొనేందుకు వెనుకాడారు. దీంతో విశాఖపట్నం ప్రాంతీయ నిఘా విభాగం రంగంలోకి దిగింది. అక్రమాలపై ప్రభుత్వానికి ప్రత్యేక నివేదిక అందించింది. దీంతో ఈ వ్యవహారంపై సమగ్ర సర్వే చేసి.. నివేదిక అందించాలని జిల్లా ఉన్నతాధికారులకు ప్రభుత్వ ఆదేశాలు వచ్చినట్లు ఆమదాలవలసకు చెందిన కొందరు రెవెన్యూ ఉద్యోగులు చెబుతున్నారు. ఇంత పెద్దఎత్తున భూ కుంభకోణం జరిగినా అధికార పార్టీ నేతలు మౌనం వహించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. 


నిగ్గు తేల్చిన నిఘా!

తోటాడ భూ దందా వ్యవహారంలో బడా నాయకులు ఉన్నట్టు విశాఖపట్నం ప్రాంతీయ నిఘా విభాగం నిగ్గు తేల్చింది. ఇందులో ప్రైవేటు వ్యక్తులు ఉన్నా, హక్కుదారులు లేకపోవడంతో సర్వే నెంబర్‌ 28లో గతంలో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో చేర్చారని నివేదిక అందజేసింది. 25 ఎకరాలు ల్యాండ్‌ సీలింగ్‌లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ భూములు కొందరు ఆక్రమించి.. అడ్డగోలు అనుమతులతో అక్రమ నిర్మాణాలు చేపట్టి.. క్రయవిక్రయాలు చేస్తున్నట్టు గుర్తించారు. తోటాడ, అక్కివరం, గోపినగర్‌ గ్రామాలకు చెందిన ఏడుగురు ఈ దందాలో భాగస్వాములుగా ఉన్నట్లు నిగ్గుతేల్చారు. ప్రభుత్వ భూములను వీరే కొనుగోలు చేసి, అక్రమ అలేవుట్‌లు వేసి వ్యాపారాలు సాగించారని నిఘా విభాగం నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికే నివేదిక అందించినట్లు సమాచారం. బేరసారాల విషయంపైనా ప్రత్యేక పోలీసు నిఘా విభాగం ఆమదాలవలస, తోటాడ ప్రాంతాల్లో రెండు రోజులుగా ఆరా తీసింది. దీనిపైనా ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్టు సమాచారం. 


కొనుగోలుదారులు గగ్గోలు..

కబ్జా భూములు అని తెలిసి కూడా కారుచౌకగా వస్తున్నాయనే ఉద్దేశంతో కొందరు వీటిని కొనుగోలు చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం బయటపడడంతో కొనుగోలుదారులు గగ్గోలు పెడుతున్నారు. ఆక్రమణదారులు ఈ భూములను తమకు విక్రయించి సొమ్ములు చేసుకున్నారని, ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ కబ్జా వ్యవహారం ప్రభుత్వం దృష్టికి చేరడంతో ఏం జరుగుతుందోనన్నది చర్చనీయాంశమవుతోంది.  


- అక్రమ నిర్మాణాలను అడ్డుకోండి 

- జాయింట్‌ కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

కొత్తరోడ్డుకు ఆనుకొని ఉన్న సర్వేనెంబర్‌ 121లోని భూముల్లో అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని  జాయింట్‌ కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఆక్రమిత స్థలాల్లో నిర్మాణ పనులను జేసీ సుమిత్‌కుమార్‌ శనివారం పరిశీలించారు. పూర్తిస్థాయి సర్వే జరిగే వరకూ ఈ భూముల్లో ఎటువంటి నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయరాదని అధికారులను ఆదేశించారు. అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్న వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాల్లో లేఅవుట్లు వేసేందుకు ఎలా ఒప్పుకుంటున్నారని వారిని ప్రశ్నించారు. ఇక నుంచి ఎటువంటి అనుమతులు మంజూరు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. దీనిపై ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో నివేదిక అందిస్తామని జేసీ తెలిపారు. కార్యక్రమంలో ఆమదాలవలస తహసీల్దార్‌ పద్మావతి, సర్వేయర్‌ బి.గోపి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-25T04:51:24+05:30 IST