ఇంటి పట్టాకు లక్ష ఇవ్వాలా?

ABN , First Publish Date - 2021-09-29T06:29:40+05:30 IST

ఉచితంగా ఇవ్వాల్సిన ఇళ్ల స్థలాలకు రూ.30 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూళ్లకు పాల్పడిన వైసీపీ నేతపై గ్రామ సర్పంచ్‌ తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.

ఇంటి పట్టాకు లక్ష ఇవ్వాలా?

వైసీపీ నేత వసూళ్లపై తేతలి సర్పంచ్‌ ఫైర్‌

తహసీల్దార్‌కు ఫిర్యాదు.. సోషల్‌ మీడియాలో వైరల్‌

తణుకు, సెప్టెంబరు 28 : ఉచితంగా ఇవ్వాల్సిన ఇళ్ల స్థలాలకు రూ.30 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూళ్లకు పాల్పడిన వైసీపీ నేతపై గ్రామ సర్పంచ్‌ తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. తణుకు మండలం తేతలి గ్రామంలో ప్రభుత్వం సుమారు 16 ఎకరాల స్థలాన్ని సేకరించి, సెంటున్నర చొప్పున 600 మందికి పైగా పట్టాలు ఇచ్చింది. ఈ స్థలం సేకరణ నిమిత్తం అప్పట్లోనే లబ్ధిదారుల నుంచి పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఇచ్చిన పట్టాల్లో పేర్లు మార్పులు చేస్తున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మంగళవారం అధికార పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్‌ సరెళ్ళ క్రాంతిప్రియ గ్రామ వైసీపీ నేత మట్టా వెంకట్‌పై తహసీల్దార్‌ పీఎన్‌డీ ప్రసాద్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. ‘గ్రామంలో కొందరి వద్ద రూ.30 వేలు, రూ.50 వేలు, లక్ష తీసుకుని స్థలాలు ఇచ్చారు. గతంలో రూ.30 వేలు తీసుకున్న వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా వెంకట్‌ తన వద్దే ఉంచుకుని, ఇప్పుడు లక్ష ఇచ్చిన వారికి ఆ పట్టాలను  ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారట. నాలుగు రోజుల నుంచి బాధితులు వంద మందికి పైగా నా వద్దకు వచ్చి వాపోయారు. రెండు రోజులు ఆగండి.. పరిష్కారం చూపిస్తానని వారికి చెప్పాను. అందుకే ముందుగా ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నా. ఈ సమస్యను పరిష్కరించకపోతే బాధితులందరితో కలిసి తేతలి సెంటర్‌లో నేనే దీక్ష చేస్తా’ అంటూ తహసీల్దార్‌కు స్పష్టం చేశారు. వీరి ఫోన్‌ సంభాషణ ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై తణుకు తహసీల్దార్‌ పీఎన్‌డీ ప్రసాద్‌ ఆంధ్రజ్యోతికి వివరణ ఇచ్చారు. సర్పంచ్‌ క్రాంతిప్రియ తనకు ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని తెలిపారు. గతంలోనే నిబంధనల మేరకు పట్టాల పంపిణీ జరిగిందని, ఇప్పుడు వీటి పేర్లు మార్పు చేయడం కుదరదని తెలిపారు. ఈ పట్టాలు ఎక్కడ ఉన్నాయి ? అసలు ఏం జరిగింది ? అనే దానిపై విచారణ చేయనున్నట్టు తెలిపారు.

Updated Date - 2021-09-29T06:29:40+05:30 IST