Jun 14 2021 @ 15:12PM

జబర్దస్త్ కమెడియన్‌ హైపర్ ఆదిపై ఫిర్యాదు

హైదరాబాద్‌: జబర్దస్త్ కమెడియన్‌ హైపర్ ఆదిపై ఫిర్యాదు చేశారు. ఆదిపై ఎల్బీనగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డికి తెలంగాణ జాగృతి స్టూడెంట్‌ ఫెడరేషన్‌ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ నెల 13న (ఆదివారం) ఈ టీవీలో ప్రసారం అయిన ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ అనే కార్యక్రమంలో బతుకమ్మ, గౌరమ్మ, తెలంగాణ భాషను కించపరిచేలా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆది, స్క్రిప్ట్‌ రైటర్‌, మల్లెమాల ప్రొడక్షన్‌పై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్, సమాచార హక్కు సాధన స్రవంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్తీక్, టీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి చింత మహేశ్, హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్ తదితరులు ఉన్నారు. గతంలోనూ ఆదిపై మానవహక్కుల సంఘానికి (హెచ్‌ఆర్సీ) ఫిర్యాదులు అందాయి. తమ మనోభావాలను దెబ్బతీసేలా స్కిట్ చేశారని ఆరోపిస్తూ పలువురు అనాథ పిల్లలు, సినీ విమర్శకుడు కత్తి మహేష్‌లు హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.