చినజీయర్‌స్వామిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-03-17T00:35:42+05:30 IST

ఆదివాసీల వనదేవత సమ్మక్క-సారలమ్మలను అవమానకరంగా మాట్లాడిన చినజీయర్‌స్వామిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ

చినజీయర్‌స్వామిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

దుమ్ముగూడెం: ఆదివాసీ వనదేవతలైన సమ్మక్క-సారలమ్మలను అవమానకరంగా మాట్లాడిన చినజీయర్‌స్వామిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ ఆధ్వర్యంలో బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆదివాసీల ఆడబిడ్డల చరిత్ర తెలియని జీయర్‌స్వామికి వారి గురించి మాట్లాడే హక్కు లేదని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ డివిజన్‌ అధ్యక్షుడు మల్లుదొర తెలిపారు. కులపిచ్చితో జనాల దగ్గర కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్న చరిత్ర చినజీయర్‌దని విమర్శించారు. అడవి బిడ్డలపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన జీయర్‌స్వామి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.


చినజీయర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సీతక్క కూడా మండిపడ్డారు. ‘‘మా తల్లులది వ్యాపారమా?... మీరు సమాతామూర్తి విగ్రహం ఏర్పాటుతో చేసింది వ్యాపారమా?... మా దేవతల దర్శనానికి ఒక్క రూపాయి కూడా టికెట్ లేదు, కానీ మీరు పెట్టిన 120 కిలోల బంగారం గల సమతామూర్తి విగ్రహం చూడ్డానికి  150 రూపాయలు టికెట్ ధర పెట్టారు. ఎవరిది వ్యాపారం?... మీది బిజినెస్, సమ్మక్క సారలమ్మ తల్లి దగ్గర ఇలాంటి వ్యాపారం జరగదు’’ అని సీతక్క తెలిపారు.

Updated Date - 2022-03-17T00:35:42+05:30 IST