పోటాపోటీగా శిక్షణ

ABN , First Publish Date - 2022-05-16T06:25:04+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం పోటీ పరీక్షలకు నోటిఫికేషన్‌లు ఇవ్వడంతో నిరుద్యోగులు పోటాపోటీగా శిక్షణ తీసుకుంటున్నారు. దీంతో జిల్లాలోని శిక్షణ సంస్థలు, గ్రంథలయాలు యువతతో కిక్కిరిసిపోతున్నాయి. నిరుద్యోగులు రేయింబవళ్లు కష్టపడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు.

పోటాపోటీగా శిక్షణ

జిల్లాలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత  

ఉచిత శిక్షణ  సంస్థలతో పాటు గ్రంథాలయాలు ఫుల్‌ 

పోటీపరీక్షల కోసం గ్రంథాలయాల్లో కొత్త పుస్తకాలు 

జిల్లా వ్యాప్తంగా 50వేలకు పైగా నిరుద్యోగుల శిక్షణఙ

నిజామాబాద్‌, మే 15(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం పోటీ పరీక్షలకు నోటిఫికేషన్‌లు ఇవ్వడంతో నిరుద్యోగులు పోటాపోటీగా శిక్షణ తీసుకుంటున్నారు. దీంతో జిల్లాలోని శిక్షణ సంస్థలు, గ్రంథలయాలు యువతతో కిక్కిరిసిపోతున్నాయి. నిరుద్యోగులు రేయింబవళ్లు కష్టపడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఎలాగైనా ఉద్యోగం సాధించాలని పట్టుదలతో ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో పోలీసు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంస్థలు అందిస్తున్న శిక్షణతో పాటు గ్రంథాలయాలను వినియోగించుకుంటున్నారు.

శిక్షణపై నిరుద్యోగుల దృష్టి..

రాష్ట్ర ప్రభుత్వం పోలీసు, గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌లు ఇవ్వడంతో జిల్లా నిరుద్యోగులు అదే రీతిలో శిక్షణపై దృష్టిపెడుతున్నారు. పోలీసు, జైలు, ఫైర్‌, ఎక్సైజ్‌ విభాగాల కానిస్టేబుల్‌తో పాటు సివిల్‌ ఎస్సై పోస్టులకు సిద్ధమవుతున్నారు. జిల్లా నుంచి సుమారు 50వేలకు పైగా నిరుద్యోగులు ఈ పోటీ పరీక్షల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారితో పాటు పోటీ పరీక్షలు కోసం ఎదురుచూస్తూ ప్రిపేర్‌ అవుతున్నవారు కూడా దరఖాస్తు చేస్తున్నారు.

ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో శిక్షణ..

జిల్లాలోని నిరుద్యోగుల కోసం ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో శిక్షణను నిర్వహిస్తున్నారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఎక్కువ మందికి ఈ శిక్షణను అందిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఉదయం ఒక బ్యాచ్‌, సాయంత్రం ఒక బ్యాచ్‌కు శిక్షణ అందిస్తున్నారు. ఇదేకాకుండా జాన్కంపేటలోని పోలీసు శిక్షణ కేంద్రంలో కూడా ఈ పోటీ పరీక్షలకు శిక్షణను కొనసాగిస్తున్నారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి నియోజకవర్గంలోని వేల్పూర్‌లో కూడా విద్యార్థులకు శిక్షణను అందిస్తునారు. బాన్సువాడ నియోకవర్గంలో కూడా శిక్షణను అందిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిల్‌ ద్వారా కూడా కొంతమందికి ఉచితంగా శిక్షణతోపాటు మధ్యాహ్న భోజనాన్ని కూడా వారికి కల్పిస్తున్నారు.

ప్రతిరోజూ 500 మంది..

జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సుమారు 500 మంది వరకు ప్రతిరోజూ ప్రిపేర్‌ అవుతున్నారు. వీరికోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. కొత్త పుస్తకాలను కూడా రూ.3లక్షల వరకు వెచ్చించి తీసుకువచ్చారు. గ్రంథాలయల పనివేళలను కూడా మార్చారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు తెరచి ఉంచుతున్నారు. ఎక్కువమంది విద్యార్థులకు మెటీరియల్‌ అందుబాటులో ఉండేవిధంగా చర్యలు చేపట్టారు. ఇవేకాకుండా బోధన్‌, ఆర్మూర్‌ గ్రంథాలయాల్లో వందమంది చొప్పున చదువుకునే ఏర్పాట్లను చేశారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంతో పాటు ఆర్మూర్‌, బోధన్‌ గ్రంథాలయాల్లో చదువుకునేవారికి భోజన వసతి కూడా కల్పిస్తున్నారు. గ్రంథాలయాల్లో స్టాఫ్‌ తక్కువగా ఉండడంతో కలెక్టర్‌ నారాయణరెడ్డి కల్పించుకుని నలుగురిని డిప్యూటేషన్‌పై పంపించారు. కొన్ని పుస్తకాలను కూడా జిల్లా కేంద్ర గ్రంథాలయానికి ఉపయోగపడే విధంగా కొనుగోలు చేసి అందించారు. జిల్లాకు చెందిన కొంతమంది నిరుద్యోగులు నోటిఫికేషన్‌లు రావడంతో మరింత ప్రిపేర్‌ అయ్యేందుకు హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ కోచింగ్‌ సెంటర్‌లో చేరి శిక్షణ పొందుతున్నారు. ఉచిత శిక్షణ కోసం మంత్రితో పాటు ఇతరులు నిధులు అందించడంతో 3 నెలల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శిక్షణను కొనసాగించేవిధంగా పోలీసుతో పాటు ఇతర సంస్థలు ఏర్పాట్లను కొనసాగించాయి. 

గ్రంథాలయంలో పుస్తకాలు సరిపడా ఉన్నాయి..

ఫ రాకేష్‌, నందిపేట్‌

గ్రంథాలయంలో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పోలీసుఉద్యోగల కోసం దరఖాస్తు చేసుకున్న తాను నందిపేట్‌ నుంచి వస్తున్నాను. ఇతర పరీక్షల పుస్తకాలు కూడా ఉండడం వల్ల ఎక్కువ మొత్తంలో మెటీరియల్‌ చదువుకునే అవకాశం ఉంది.

ముందుగా వస్తే తప్ప సీటు దొరకడంలేదు..

ఫ  నరేష్‌, కుర్నాపల్లి

గ్రంథాలయానికి ముందుగా వస్తే తప్ప సీటు దొరకడంలేదు. ఉదయం 6 గంటలకు వచ్చిన వారికే పుస్తకాలు దొరుకుతున్నాయి.  అన్ని పుస్తకాలు ఉండడం వల్ల రద్దీ ఎక్కువగా ఉంది. ఇతర ప్రాంతాల్లో కూడా ఏర్పాట్లను చేస్తే ఎక్కువ మందికి ఉపయోగపడనుంది.

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అందిస్తున్నాం..

ఫ సి.నారాయణరెడ్డి, కలెక్టర్‌

జిల్లాలోని నిరుద్యోగులకు ఉచిత శిక్షణను అందిస్తున్నాం. పోలీసుతో పాటు గ్రూప్‌-1కు శిక్షణను ఇస్తున్నాం. మంత్రితో పాటు ఇతరులు సహకారం అందించడం వల్ల ఎక్కువమందికి ఉచిత శిక్షణను అందిస్తున్నాం. జిల్లా యంత్రాంగం తరఫున కావాల్సిన ఏర్పాట్లను గ్రంథాలయంలో కూడా కల్పించి మెటీరియల్‌, పుస్తకాలను పోటీపరీక్షల కోసం సిద్ధంగా ఉంచాం.

Updated Date - 2022-05-16T06:25:04+05:30 IST