ప్రాణాలు తీసిన ‘పోటీ వేగం’

ABN , First Publish Date - 2022-01-29T07:58:07+05:30 IST

బొగ్గు లోడుతో వస్తున్న రెండు టిప్పర్ల మధ్య పోటీ నలుగురు వ్యవసాయ కూలీల ప్రాణాలను బలిగొంది.

ప్రాణాలు తీసిన ‘పోటీ వేగం’

  • ఆటో ట్రాలీని ఢీకొన్న బొగ్గు టిప్పర్‌.. 
  • నలుగురు మహిళా కూలీల దుర్మరణం..
  • భద్రాద్రి జిల్లాలో ఘటన


చండ్రుగొండ/సుజాతనగర్‌/కొత్తగూడెం కలెక్టరేట్‌/చుంచుపల్లి, జనవరి 28: బొగ్గు లోడుతో వస్తున్న రెండు టిప్పర్ల మధ్య పోటీ నలుగురు వ్యవసాయ కూలీల ప్రాణాలను బలిగొంది. నడి రోడ్డుపై మితిమీరిన వేగంతో వాహనాలు తోలిన ఇద్దరు డ్రైవర్ల నిర్లక్ష్యం రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. శుక్రవారం ఉదయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి వద్ద జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు మహిళలు చికిత్స పొందుతూ చనిపోయారు. భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం తుంగారం గ్రామానికి చెందిన రైతు ఆళ్ల వీరయ్య, ఆయన భార్య, మనవడు ఈశ్వర్‌, బంధువు సందీప్‌.. అంతా కలిసి పక్క గ్రామమైన సుజాతనగర్‌కు చెందిన 13మంది కూలీలను తీసుకొని వరి నారు తెచ్చేందుకు 30కి.మీ దూరంలో ఉన్న అన్నపురెడ్డిపల్లికి ట్రాలీలో బయలుదేరారు. 


ఈ క్రమంలో మార్గమధ్యలోని చండ్రుగొండ మండలం తిప్పనపల్లి వద్ద ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి జాతీయ రహదారిపైకి ఎక్కుతుండగా సత్తుపల్లి వైపు(వెనుక) నుంచి వేగంగా వచ్చిన బొగ్గుటిప్పర్‌.. కూలీలు ప్రయాణిస్తున్న ట్రాలీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దళితవాడకు చెందిన వెక్కిరాల సుజాత(30), కత్తి స్వాతి(28) ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందగా, కత్తి సాయమ్మ(50), గుర్రం లక్ష్మి(50) కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ట్రాలీ డైవర్‌ మారుతి రామ్‌దాస్‌, కూలీలు కత్తి నాగులు, సుగుణ, అచ్చమ్మ, నరసమ్మ, సుశీల, వెంకటనారాయణమ్మ, సావిత్రి, వీరయ్య, వెంకటరమణ, పోలమ్మ తీవ్రగాయాలపాలయ్యారు. వారంతా కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కల్తి లక్ష్మి అనే మహిళ పరిస్థితి విషమించడంతో ఖమ్మం తరలించారు.  బొగ్గు టిప్పర్ల మితిమీరిన వేగం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. సత్తుపల్లి నుంచి రెండు బొగ్గు టిప్పర్లు పోటీపడి వేగంగా వచ్చే క్రమంలోనే.. ఒక టిప్పర్‌ వాహనం.. ట్రాలీని ఢీకొట్టినట్లు చెబుతున్నారు.


పలువురి పరామర్శ

రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను, గాయాలపాలైన వారిని భద్రాద్రి జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, సీపీఐ, సీపీఎం నాయకులు పరామర్శించారు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలంటూ చండ్రుగొండ జడ్పీటీసీ సభ్యుడు వెంకటరెడ్డి అర్ధనగ్నంగా జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. ఆర్డీవో స్వర్ణలత ఘటనా స్థలానికి చేరుకొని మృతుల కుటుంబాలకు రూ.50వేల తో పాటు సింగరేణిలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు, ప్రభుత్వంతో మాట్లాడి పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - 2022-01-29T07:58:07+05:30 IST