త్వరలోనే పోటీ పరీక్షలు!

ABN , First Publish Date - 2022-02-17T08:44:32+05:30 IST

త్వరలోనే పోటీ పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉన్నందున, వర్సిటీ విద్యార్థులు సిద్థమయ్యేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని.. అందుకవసరమయ్యే నిధులను ప్రభుత్వం వెంటనే

త్వరలోనే పోటీ పరీక్షలు!

  • నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం..
  • విద్యార్థులకు ఏర్పాట్లు చేయండి..
  • అందుకు నిధుల్ని ప్రభుత్వం ఇస్తుంది
  • వీసీల సమావేశంలో మంత్రి సబిత


హైదరాబాద్‌, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): త్వరలోనే పోటీ పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉన్నందున, వర్సిటీ విద్యార్థులు సిద్థమయ్యేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని.. అందుకవసరమయ్యే నిధులను ప్రభుత్వం వెంటనే అందజేస్తుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పరిశ్రమలతో యూనివర్సిటీలు అనుసంధానం కావాలని.. చదువును పూర్తి చేసుకున్న ప్రతి విద్యార్థీ ఉపాధి, ఉద్యోగంతోనే బయటకు వెళ్లే విధంగా కరికులం ఉండాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆ దిశగా యూనివర్సిటీలను అభివృద్ధి చేయాలని.. ఉద్యోగం, ఉపాధి లభిస్తుందన్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని విద్యార్థుల్లో కల్పించాలని మంత్రి సూచించారు.  నగరంలోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్థి కేంద్రంలో బుధవారం జరిగిన యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్ల సమావేశంలో ఆమె ప్రసంగించారు.


మానవ వనరులను అభివృద్థి చేయడంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలని.. లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్పాన్ని, అడ్డంకులను అధిగమించే సామర్థ్యాన్ని విద్యార్థుల్లో కల్పించాల్సిన బాధ్యత యూనివర్సిటీ అధ్యాపకులదేనని పేర్కొన్నారు. వర్సిటీల్లో పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని.. పరిశోధనల అనుభవం నాణ్యమైన బోధనకు దారితీస్తుందని, ఉన్నత విద్యాభ్యాసాన్ని మెరుగుపరుస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఉన్నత విద్యలో సుమారు 60-70 శాతం మహిళల అడ్మిషన్లు అవుతున్నాయని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు తగు చర్యల్ని తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని వర్సిటీలకు పూర్వవైభవం తీసుకురావడంతోపాటు వాటిని ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్నారు. వర్సిటీల్లో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు వైస్‌ చాన్స్‌లర్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి నివేదిక రూపొందిస్తామని చెప్పారు. విద్యార్థులు పరిశోధనలవైపు ఆకర్షితులయ్యేలా అవసరమైన జర్నల్సును అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.


విద్యా సంబంధిత పరిశ్రమలు నెలకొనే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో యూనివర్సిటీల భూముల కబ్జా అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. భూములు అన్యాక్రాంతం కాకుండా గట్టి చర్యల్ని తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అలాగే ఖాళీల భర్తీ గురించి వీసీలు ప్రస్తావించగా.. త్వరలోనే ఆ పని పూర్తిచేస్తామని మంత్రి, సీఎస్‌ తెలిపారు. వర్సిటీలకు నిధుల కేటాయింపుల్ని పెంచాల్సిన అవసరం గురించి వీసీలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. 




ఇంటర్‌ విద్యాశాఖలో స్పౌజ్‌ బదిలీలను చేపట్టాలి

ఇంటర్‌ విద్యాశాఖలో స్పౌజ్‌ బదిలీ కేసులను సత్వరమే పరిష్కరించాలని ఇంటర్‌ విద్యా జేఏసి చైర్మన్‌ మధుసూధన్‌రెడ్డి మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని కోరారు. వారిని వెంటనే బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంటర్‌ విద్యలో సుమారు 6 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, స్పౌజ్‌ కేసులను పరిష్కరించడానికి ఖాళీలు లేవనే సమస్యే తలెత్తదని ఆయన చెప్పారు. ఈ  విషయంపై స్పందించిన మంత్రి.. అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాగా, త్వరలో వార్షిక పరీక్షలు రాయబోయే ఇంటర్మీడియట్‌ విద్యార్థుల కోసం టి-శాట్‌ ద్వారా ప్రశ్నలు-జవాబులను ప్రసారం చేయనున్నారు. ఈ నెల 20 నుంచి ప్రాక్టికల్స్‌ పరీక్షలకు సంబంధించి, 21నుంచి థియరీ పరీక్షలకు సంబంధించిన డిజిటల్‌ పాఠాలు ప్రసారం చేయనున్నారు. 

Updated Date - 2022-02-17T08:44:32+05:30 IST