పోటీ 136 వార్డులకే..!

ABN , First Publish Date - 2021-03-03T05:30:00+05:30 IST

జిల్లాలో కడప నగరపాలక సంస్థ, ప్రొద్దుటూరు, పులివెందుల, రాయచోటి, బద్వేలు, మైదుకూరు పురపాలక సంఘాలు, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు నగర పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన ఇచ్చారు. 257 డివిజన్లు, వార్డులకు గత ఏడాది మార్చి 11 నుంచి 13వ తేది వరకు నామినేషన్లు స్వీకరిస్తే 1,543 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

పోటీ 136 వార్డులకే..!

బరిలో మిగిలిన అభ్యర్థులు 651 మంది

వైసీపీ ఏకగ్రీవాలు 121

పోటీ నుంచి తప్పుకున్న వారి సంఖ్య 493 

అందులో వైసీపీ అభ్యర్థులు 193, టీడీపీ అభ్యర్థులు 91

కేవలం 92 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్న టీడీపీ

చిన్న చిన్న సంఘటనలు మినహా ప్రశాంతంగా ఉప సంహరణ


పుర పోరులో కీలక ఘట్టం నామినేషన్ల ఉపసంహరణ బుధవారం ముగిసింది. బరిలో తలపడే అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. పోటీ జరిగే డివిజన్లు, వార్డుల్లో హోరా హోరీ ప్రచారానికి సై అంటున్నారు. కడప నగరపాలక సంస్థతో పాటు ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లో 257 వార్డులు ఉన్నాయి. 1,543 నామినేషన్లు దాఖలు కాగా పరిశీలనలో 108 తిరస్కరించారు. 1,435 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. 493 మంది అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటే 772 మంది అభ్యర్థులు నిలిచారు. వీరిలో 121 వార్డులు, డివిజన్లను అధికార పార్టీ వైసీపీ ఏకగ్రీవంగా తన ఖాతాలో వేసుకుంది. దీంతో 136 వార్డులకే ఈ నెల 10న పోలింగ్‌ జరగనుంది. 651 మంది బరిలో నిలిచారు. నామినేషన్ల వితడ్రా చివరి రోజున ఏకగ్రీవాల కోసం అధికార వైసీపీ నాయకులు పలు చోట్ల దౌర్జన్యం, బెదిరింపులకు పాల్పడ్డారు. చిన్న చిన్న సంఘటనలు మినహా ఉప సంహరణ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో కడప నగరపాలక సంస్థ, ప్రొద్దుటూరు, పులివెందుల, రాయచోటి, బద్వేలు, మైదుకూరు పురపాలక సంఘాలు, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు నగర పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన ఇచ్చారు. 257 డివిజన్లు, వార్డులకు గత ఏడాది మార్చి 11 నుంచి 13వ తేది వరకు నామినేషన్లు స్వీకరిస్తే 1,543 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అందులో 108 తిరస్కరించారు. ఎన్నికలు వాయిదా వేసే సమయానికి 170 మంది వితడ్రా చేసుకున్నారు. 1,265 నామినేషన్లు మిగిలాయి. మంగళవారం 210 మంది వితడ్రా చేసుకోగా.. చివరి రోజు బుధవారం 283 మంది పోటీ నుంచి తప్పుకున్నారు. అంటే 493 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.


121 వార్డులు ఏకగ్రీవం

257 వార్డులకు 772 మంది అభ్యర్థుల నామినేషన్లు మిగిలాయి. అందులో 121 వార్డులను అధికార వైసీపీ ఏకగ్రీవంగా తన ఖాతాలో వేసుకుంది. అంటే.. 136 వార్డులకు మాత్రమే ఎన్నికలు జరగున్నాయి. ఏకగ్రీవంగా విజేతలుగా నిలిచిన 121 మంది అభ్యర్థులు పోనూ 651 మంది అభ్యర్థులు ఈ నెల 10న ఓటరు తీర్పు ఎదుర్కోబోతున్నారు. వారిలో వైసీపీ అభ్యర్థులు 136, టీడీపీ అభ్యర్థులు 91, బీజేపీ/జనసేన కూటమి అభ్యర్థులు 23, ఇతర పార్టీలు, స్వతంత్రులు 186 మంది ఉన్నారు.


ఆ పట్టణాల్లో ఏక పక్షమే

సీఎం జగన సొంత నియోజకవర్గం పులివెందుల మున్సిపాలిటీలో 33 వార్డులను ఏకగ్రీవం చేసుకొని చైర్మన పీఠాన్ని వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. రాయచోటిలో 34 వార్డులకు 31, ఎర్రగుంట్లలో 20 వార్డులకు 12 వార్డులను ఏకగ్రీవం చేసుకొని చైర్మన పీఠం తమదేనని చాటింది. కీలకమైన కడన నగరంలో 50 డివిజన్లు ఉంటే వైసీపీ 24 డివిజన్లను ఏకగ్రీవం చేసుకుంది. చైర్మన పీఠానికి రెండు డివిజన్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ 15 డివిజన్లలో మాత్రమే తమ అభ్యర్థులను బరిలో దింపితే.. పోటీ జరిగే ఇతర వార్డుల్లో వామపక్షాలు, స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ఇస్తోంది.


చివరి రోజు ఏం జరిగిందంటే..!?

- కడప నగరంలో 11వ డివిజన టీడీపీ అభ్యర్థి వరలక్ష్మిని బలవంతంగా నామినేషన వితడ్రా చేయించేందుకు అధికార పార్టీ వైసీపీ నాయకులు తీసుకువెళ్తుండగా.. టీడీపీ నియోజకవర్గం ఇనచార్జి అమీర్‌బాబు అడ్డుకున్నారు. పలు డివిజన్లలో బెదిరింపులు, బేరాలతో అభ్యర్థులను పోటీ నుంచి తప్పించారు. 

- మైదుకూరులో ఒకటో వార్డు ఏకగ్రీవం కోసం పోటీ చేసిన వారి మధ్య వేలంపాట జరిపినట్లు తెలిసింది. టీడీపీ అభ్యర్థి వెంకటలక్ష్మమ్మ, స్వతంత్ర అభ్యర్థి విజయలక్ష్మి సాయంత్రం 4 గంటలకు ఆర్‌ఓ ఆఫీసులోకి వెళ్లారు. వితడ్రా కోసమే వెళ్లారని పసిగట్టిన టీడీపీ చైర్మన అభ్యర్థి ధనపాల జగన అడ్డుకొని వితడ్రా గడువు ముగిసినా ఎలా అనుమతిస్తారని వాగ్వాదానికి దిగారు. పోలీసులు జోక్యంతో అందరిని పంపడంతో వైసీపీ ఏకగ్రీవ వ్యూహం బెడిసికొట్టింది. వైసీపీ కీలక నాయకుల ఒత్తిళ్ల నుంచి తప్పించుకోవడానికి అజ్ఞాతంలోకి వెళ్లిన టీడీపీ అభ్యర్థులు వితడ్రా సమయం ముగిసిన తరువాత మైదుకూరుకు చేరుకున్నారు.

- బద్వేలులో 7వ వార్డు స్వతంత్ర అభ్యర్థి ఎస్‌.మునిషా సాయంత్రం 3.10 గంటలకు ఆర్‌ఓ ఆఫీసుకు చేరుకున్నారు. 3.15 గంటలకు తన నామినేషన వితడ్రా చేసుకోగా ఆర్‌ఓ జి.కృష్ణమూర్తి ఆమోదం తెలిపారు. గడువు ముగిసినా వితడ్రాను ఎలా ఆమోదిస్తారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, టీడీపీ నాయకుడు డాక్టరు ఓబులాపురం రాజశేఖర్‌ తదితరులు ఆర్‌ఓతో వాగ్వాదానికి దిగారు. తన వద్దనున్న గడియారం చూపుతున్న సమయం ప్రకారం 3 గంటలలోపే అభ్యర్థి వితడ్రా చేసుకోవడంతో ఆమోదించానని ఆర్‌ఓ వివరించారు.

- ప్రొద్దుటూరులో మెజార్టీ వార్డుల ఏకగ్రీవాల కోసం అధికార పార్టీ కీలక నాయకులు ఒత్తిళ్లు, బెదిరింపులు, బేరాలకు దిగడంతో టీడీపీ అభ్యర్థులను నియోజకవర్గం ఇనచార్జి జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ముందే క్యాంపునకు తరలించారు. దీంతో అధికార పార్టీ ఏకగ్రీవాల వ్యూహం బెడిసికొట్టింది. అయినా 9 వార్డులు ఏకగ్రీవం చేసుకోగలిగారు.

- రాయచోటిలో 34 వార్డులకు గానూ 31 ఏకగ్రీవం అయ్యాయి. టీడీపీ పట్టణ అధ్యక్షుడు బోనమల ఖాదర్‌బాషా, భార్య, తల్లి మూడువార్డులకు నామినేషన్లు వేశారు. ఆ మూడు వార్డుల్లోనూ వారితో వితడ్రా చేయించేందుకు వైసీపీ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. సఫలం కాకపోవడంతో ఆ మూడు వార్డుల్లో మాత్రమే పోటీ అనివార్యమైంది. 


నామినేషన్ల ఉప సంహరణల వివరాలు:

---------------------------------------------------------------------------------------------

కార్పొరేషన/         వైసీపీ     టీడీపీ బీజేపీ/ ఇతరులు మొత్తం

మున్సిపాలిటీ         జనసేనా

----------------------------------------------------------------------------------------------

కడప             20 30 9 63 122

ప్రొద్దుటూరు             50 34 3 47 134

మైదుకూరు             35 1 1 3 40

బద్వేలు     26 19 3 34 82

రాయచోటి             16 6 -- 9 31

జమ్మలమడుగు     33 -- 6 25 64

ఎర్రగుంట్ల             13 1 1 5 20

పులివెందుల     -- -- -- -- -- 

-----------------------------------------------------------------------------------------------

మొత్తం     193 91 23 186 493

-------------------------------------------------------------------------------------------------


ఉపసంహరణల తరువాత మిగిలిన నామినేషన్లు

------------------------------------------------------------------

కార్పొరేషన/         డివిజన/ వైసీపీ     టీడీపీ బీజేపీ/ ఇతరులు మొత్తం

మున్సిపాలిటీ వార్డులు         జనసేనా

---------------------------------------------------------------------------

కడప             50 50 15 11 184 260

ప్రొద్దుటూరు             41 41 32 15 54 142

మైదుకూరు             24 24 24 14 39 101

బద్వేలు     35 35 15 -- 45 95

రాయచోటి             34 34 3 -- 2 39

జమ్మలమడుగు     20 20 -- 18 23 61

ఎర్రగుంట్ల             20 20 3 5 13 41

పులివెందుల     33 33 -- -- -- 33

-------------------------------------------------------------

మొత్తం     257 257 92 63 360 772

--------------------------------------------------------------


ఏకగ్రీవమైన వార్డుల వివరాలు: 

---------------------------------------------------

కార్పొరేషన/         డివిజన/     వైసీపీ

మున్సిపాలిటీ వార్డులు

---------------------------------------------------

కడప             50 24

ప్రొద్దుటూరు             41 9

బద్వేలు     35 10

రాయచోటి             34 31

ఎర్రగుంట్ల             20 12

పులివెందల             33 33

జమ్మలమడుగు     20 2

మైదుకూరు             24 --

---------------------------------------------------

మొత్తం     257 121

---------------------------------------------------

Updated Date - 2021-03-03T05:30:00+05:30 IST