Abn logo
Sep 22 2021 @ 00:55AM

ఎంపీపీ పీఠానికి పోటీ

తెర పైకి కొత్త పేర్లు...

మైదాన ప్రాంతంలో జోరుగా బేరసారాలు?

నేతల సమక్షంలోనే మంతనాలు

ఎవరు ఎక్కువ డబ్బు పెట్టగలిగితే వారికే చాన్స్‌

కొన్నిచోట్ల రూ.కోటికి కూడా సిద్ధం 


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

మండల పరిషత్‌ ఎన్నికల్లోను డబ్బే ప్రధాన పాత్ర పోషిస్తోంది. జిల్లాలోని 36 మండలాల్లో అధికార పార్టీ వైసీపీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. అయితే ఎన్నికలకు ముందే దాదాపు అన్ని మండలాల్లో అధ్యక్ష పదవికి అభ్యర్థులను ఖరారు చేసినా...ఇప్పుడు కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. కొంతమంది అధికార పీఠం కోసం ఎంతైనా ఖర్చు చేస్తామని ప్రకటించడంతో మండలాల్లో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోతున్నాయి. 


ఎన్నికల సమయంలోనే మండలాధ్యక్షులు (ఎంపీపీ)గా ఎవరు ఉండాలనే దానిపై స్పష్టత తీసుకొని, వారితోనే ఎంపీటీసీ సభ్యుల ఖర్చులకు కొంత నగదు ఇప్పించారు. గెలిస్తే ఎంపీపీ పదవికి పోటీ వుండదనే ఉద్దేశంతో ఆ అభ్యర్థులు కూడా ముందువెనుకా ఆలోచించకుండా ఒక్కో సభ్యునికి రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఇచ్చినట్టు చెబుతున్నారు. అనుకున్నట్టుగానే ఫలితాలు వచ్చాయి. జిల్లాలో 39 మండలాలకుగాను 36 మండలాల్లో వైసీపీ మెజారిటీ ఎంపీటీసీ స్థానాలను దక్కించుకుంది. మంగళవారం ఎంపీపీ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ సభ్యులుగా గెలుపొందిన వారిలో కొందరు తాము ఎంపీపీ పదవికి పోటీలో వుంటామని నియోజకవర్గ ఎమ్మెల్యే వద్ద మనసులో మాట బయటపెడుతున్నారు. దాంతో ఇప్పటికే ఎంపీపీ అభ్యర్థిగా భావించి ఖర్చు పెట్టినవారు గతుక్కుమంటున్నారు. తాము బోలెడు ఖర్చు చేశామని, ఇప్పుడు పోటీకి వస్తే..ఎలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలా రెండు, మూడు వర్గాలు ఎమ్మెల్యేల ముందు పంచాయితీలు పెట్టడంతో మధ్యే మార్గంగా ఎవరు ఎక్కువ డబ్బు పెట్టగలిగితే..వారికే ఎంపీపీ పదవి అని వారు స్పష్టం చేస్తున్నారు. అనకాపల్లి, పాయకరావుపేట, అరకులోయ ఇలా చాలా మండలాల్లో కొత్త పేర్లు తెర పైకి వచ్చాయి. ఇలాంటి వారు ఎవరైనా సరే...ఇంతకు ముందు ఎంపీపీ అభ్యర్థి చేసిన ఖర్చు అంతా ఆయనకు ఇవ్వడంతో పాటు ఎంపీటీసీ సభ్యులకు ఎంత ఇవ్వగలరో చెబితే...అవతలి వారిని విత్‌డ్రా చేయిస్తామని ఎమ్మెల్యేలు సర్దిచెబుతున్నారు. ఒక్కో మండలంలో వైసీపీకి 10 నుంచి 18 వరకు ఎంపీటీసీ స్థానాలు దక్కాయి. గతంలో ఒక్కో ఎంపీటీసీ సభ్యునికి ఎంపీపీ అభ్యర్థి ఇచ్చిన మొత్తం సగటున రూ.2 లక్షలు చొప్పున వేసుకున్నా...ఒక్కో మండలానికి 15 మందికి రూ.30 లక్షలు ఖర్చు వెనక్కి ఇవ్వాలి. ఇది పోటీ నుంచి తప్పుకొనే అభ్యర్థికి వెళుతుంది. ఇకపోతే ఎంపీపీగా ఎన్నుకోవాలంటే...గెలిచిన వారందరికీ మళ్లీ ముట్టజెప్పాలి. పాత అభ్యర్థి కంటే ఎక్కువే ఇవ్వాలి. అంటే ఎలా లేదన్నా మరో రూ.50 లక్షలు ఉండాలి. ఇంకా నియోజకవర్గ స్థాయి నేతలను కూడా చూసుకోవాలి. అన్నీ కలిపితే...కోటి రూపాయల వరకు చేతిచమురు వదిలిపోయే పరిస్థితి ఏర్పడింది. దీనికి కూడా సిద్ధపడి కొన్ని మండలాల్లో కొత్త వ్యక్తులు తెర పైకి వస్తున్నారు. ఇక మండల ఉపాధ్యక్ష పదవి కావాలనుకునేవారు కూడా అధమపక్షం రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలైనా ఖర్చు చేయాలని ఎమ్మెల్యేలు పరోక్షంగా సూచిస్తున్నారు. జిల్లాలోని 37 మండలాల్లో కనీసం 20 నుంచి 25 మండలాల్లో ఇలా డబ్బులు చేతులు మారే పరిస్థితులు ఉన్నాయి. 


ఆ రెండు మండలాల్లో పరిస్థితి వేరు

రావికమతం మండలంలో టీడీపీ, వైసీపీలకు చెరో పది ఎంపీటీసీ స్థానాలు వచ్చాయి. ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి. అలాగే జి.మాడుగులలో వైసీపీ, టీడీపీకి చెరి ఏడు ఎంపీటీసీలు వచ్చాయి. మరొక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఆయన ఎటు మొగ్గు చూపితే...ఆ పార్టీకి ఎంపీపీ పీఠం దక్కనున్నది. ఆయన మద్దతు కోసం ఇరుపక్షాలు కాకా పడుతున్నాయి. 


వైసీపీలో కుమ్ములాట

పదవి కోసం ఎవరి ప్రయత్నాలు వారివే

ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు

విశాఖపట్నం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): మండల పరిషత్‌ అధ్యక్ష పీఠం కోసం అధికార వైసీపీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. ఇప్పటివరకు రేసులో లేని వారు కూడా పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. వీరిలో పలువురు మంగళవారం నగరానికి వచ్చిన విజయసాయిరెడ్డిని కలిశారు.  


- పాయకరావుపేట ఎంపీపీ పీఠం కోసం నామవరం ఎంపీటీసీ ఇసరపు పార్వతి, రాజవరం ఎంపీటీసీ గోసల మరిణమ్మ, పాల్మన్‌పేట ఎంపీటీసీ మోసా మహంకాళమ్మ పోటీపడుతున్నారు. 

- కశింకోట మండలంలో కశింకోట ఎంపీటీసీ పెంటకోట జ్యోతి, గుజ్జనపాలెం ఎంపీటీసీ కలగల లక్ష్మి, తాళ్లపాలెం ఎంపీటీసీ లగిశెట్టి భవానీ మధ్య పోటీ ఉంది.

- అనకాపల్లి ఎంపీపీ పదవికి అక్కిరెడ్డిపాలెం ఎంపీటీసీ గొర్లె సూరిబాబు, గొలగాం ఎంపీటీసీ నారపిన్ని చంద్రశేఖర్‌ మధ్య గట్టి పోటీ ఉంది. 

- గొలుగొండ మండలాధ్యక్ష పదవి కోసం కృష్ణాదేవిపేట ఎంపీటీసీ గజ్జెలపు కుమారి, గొలుగొండ ఎంపీటీసీ చాపల చిన్నపాపలు రేసులో ఉన్నారు.

- పాడేరు ఎంపీపీ పదవి కోసం ఎంపీటీసీలు విజయలక్ష్మి, రత్నకుమారిలు పోటీ పడుతున్నారు. ఇక్కడ కుల సమీకరణలు ప్రధానపాత్ర వహిస్తాయి. 

- డుంబ్రిగుడ మండలంలో సొవ్వా నుంచి గెలుపొందిన బాకా ఈశ్వరి, అరకు నుంచి గెలుపొందిన లోతుగెడ్డ వరాలమ్మ, కొర్రాయి నుంచిగెలుపొందిన పంచాడి లలిత, కించుమండ నుంచి గెలుపొందిన గుజ్జేలి విజయ ఎంపీపీ పదవికి పోటీ పడుతున్నారు. 

- అరకు ఎంపీపీ సీటు కోసం పద్మాపురం ఎంపీటీసీ కిల్లో కుమారి, గన్నెల ఎంపీటీసీ ఎం. లలితాదేవి, లోతూరు ఎంపీటీసీ సమర్థి రాములమ్మ, కొర్రాగాసి ఎంపీటీసీ సుమాంజలి మధ్య గట్టి పోటీ ఉంది.

- కొయ్యూరు ఎంపీపీ పదవి కోసం మంప ఎంపీటీసీ బడుగు రమేష్‌, డౌనూరు ఎంపీటీసీ అప్పారావు పోటీ పడుతున్నారు. 

- వి.మాడుగుల ఎంపీపీ రేసులో పెదబాబు, తాళపురెడ్డి రాజారావు పోటీ పడుతున్నారు.

- బుచ్చెయ్యపేటలో ఇప్పటివరకు పదవి ఆశించిన పోలమల అచ్చెన్నాయుడు ఓడిపోవడంతో మరికొందరు పేర్లు తెరపైకి వస్తున్నాయి. చోడవరంలో వైస్‌ ఎంపీపీ పదవికి పోటీ పెరిగింది.