పోటాపోటీ

ABN , First Publish Date - 2022-04-19T07:02:50+05:30 IST

జిల్లాలో రాజకీయ నాయకులు దూకుడు పెంచారు. పోటాపోటీగా నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సంవత్సరం పైగా సమయం ఉన్నా.. అధికార పార్టీ ప్రజాప్రతినిఽధులతో పాటు ప్రతిపక్ష నేతలు జిల్లాలో ముమ్మరంగా పర్యటనలు చేపడుతున్నారు. నియోజకవర్గాల పరిధిలో పలు కార్యక్రమాలు చేపడుతూ తమ క్యాడర్‌ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

పోటాపోటీ

జిల్లాలో వేడెక్కుతున్న రాజకీయ వాతావరణం

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాలు

క్యాడర్‌ను ఉత్తేజపరిచే విధంగా కార్యక్రమాలు

నియోజక వర్గాల్లో నేతల సుడిగాలి పర్యటనలు

బీజేపీలో నియోజకవర్గాల వారీగా మొదలైన వర్గపోరు

కాంగ్రెస్‌లో అన్ని నియోజకవర్గాల్లో మొదలైన కదలిక

కొత్త పార్టీల నుంచి పోటీచేసేందుకు నేతల ఆసక్తి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో రాజకీయ నాయకులు దూకుడు పెంచారు. పోటాపోటీగా నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సంవత్సరం పైగా సమయం ఉన్నా.. అధికార పార్టీ ప్రజాప్రతినిఽధులతో పాటు ప్రతిపక్ష నేతలు జిల్లాలో ముమ్మరంగా పర్యటనలు చేపడుతున్నారు. నియోజకవర్గాల పరిధిలో పలు కార్యక్రమాలు చేపడుతూ తమ క్యాడర్‌ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలను చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. పోటాపోటీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అధికార పార్టీకి భిన్నంగా ప్రతిపక్ష పార్టీల్లో అభ్యర్థులు పోటీకి సిద్ధమవుతున్నారు. ఎవరికివారే తమ వర్గాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టికెట్‌ సాధించేవిధంగా కార్యక్రమాలను చేపడుతున్నారు. తమకు పోటీగా ఉన్న అభ్యర్థులను ఢీకొంటూ వచ్చే ఎన్నికలకు అవసరమైన సామగ్రిని సమకూర్చుకుంటున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీ నుంచే కాకుండా బీఎస్‌పీ, వైఎస్‌ఆర్‌టీపీ, ఆప్‌ పార్టీలతో పాటు ఇతర పార్టీల నుంచి పోటీచేసేందుకు పలువురు సిద్ధమవుతున్నారు. 

        అధికార పార్టీలో దూకుడు..

జిల్లాలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ముమ్మరంగా కార్యక్రమాలను చేపగుతున్నారు. స్పీకర్‌ పోచారంతో పాటు మంత్రి వేముల, ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా, జీవన్‌రెడ్డి, షకీల్‌ అమిర్‌లు తమ నియోజకవర్గాల్లో ఉంటూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూనే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నికలలోపు ఇచ్చిన హామీలలన్నీ పూర్తిచేయడంతో పాటు కొత్తగా మరికొన్ని పనులు చేసేవిధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వకుండా పనులు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాపై ఎమ్మెల్సీ కవిత దృష్టిపెట్టి పలు పనులను అయ్యేవిధంగా కృషి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని 9 నియోజకవర్గాల్లో పనులను సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్సీగా పర్యవేక్షిస్తున్నారు. పెండింగ్‌ పనులకు అనుమతులు తెస్తూనే నియోజకవర్గ పార్టీ నేతలకు అండగా ఉంటున్నారు. పార్లమెంట్‌ సెగ్మెంట్‌లో పలు కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.

       బీజేపీలో వర్గపోరు..

జిల్లాలోని నిజామాబాద్‌ నియోజకవర్గంలో బీజేపీలో వర్గపోరు హనుమాన్‌ శోభాయాత్ర సందర్భంగా బయటపడింది. ఈ నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు మాజీ ఎమ్మెల్యే యెండల, సీనియర్‌ నేత ధన్‌పాల్‌ సూర్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మినర్సయ్య దృష్టిపెట్టారు. ఎవరికివారే ప్రయత్నాలు చేస్తున్నారు. నగరం పరిధిలో గతంలో రెండు దఫాలు పార్టీ అభ్యర్థి గెలవడం వల్ల తమకు ఈ దఫా మారిన సమీకరణాల వల్ల కలిసివస్తుందని భావిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా వర్గాలుగా మారి నిర్వహణ చేస్తున్నారు. బోధన్‌ నియోజకవర్గం పరిధిలో మేడపాటి ప్రకాష్‌, రూరల్‌ నియోజకవర్గంలో దినేష్‌, బాల్కొండలో మల్లికార్జున్‌రెడ్డి, ఆర్మూర్‌లో వినయ్‌రెడ్డి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఎంపీ అర్వింద్‌సైతం ఆర్మూర్‌ నియోజకవర్గంపైన దృష్టిపెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అక్కడే ఉండి ఇతర నియోజకవర్గాలను పర్యవేక్షిస్తున్నారు. బాల్కొండ నియోజకవర్గంపైన కూడా మరికొంతమంది నేతలు దృష్టిపెట్టినట్లు సమాచారం. ఆర్మూర్‌, బోధన్‌, రూరల్‌ పరిధిలో కూడా కొంతమంది నేతలు, వ్యా పార వేత్తలు పోటీకి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

       కాంగ్రెస్‌పార్టీలో మొదలైన కదలిక..

జిల్లాలోని కాంగ్రెస్‌పార్టీలోనూ కదలిక మొదలైంది. రాష్ట్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు కూడా ముమ్మరంగా కార్యక్రమాలను చేపడుతున్నారు. జిల్లా పార్టీకి పెద్దదిక్కుగా మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి వ్యవహరిస్తుండగా, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ క్యాడర్‌ను బలోపేతం చేస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల ఆధ్వర్యంలో కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. నిజామాబాద్‌అర్బన్‌ పరిధిలో తాహెర్‌బిన్‌ హుందాన్‌, రూరల్‌ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి, ఆర్మూర్‌లో ప్రస్తుతం ఇన్‌చార్జ్‌ లేకున్నా రాష్ట్ర నేతల పర్యవేక్షణలో కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. బాల్కొండలో మాజీ విప్‌ అనిల్‌ ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎన్నికలలోపు గతంలో పార్టీ నుంచి వెళ్లిన సీనియర్‌ నేతలతో పాటు ఇతరపార్టీ నేతలు చేరే అవకాశం ఉండడంతో ముందస్తుగానే నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు కార్యక్రమాలను ఎక్కువగా కొనసాగిస్తున్నారు. తమకు ఇబ్బందులు లేకుండా రాష్ట్ర నేతలతో సమన్వయం చేసుకుంటే పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గం నుంచి కూడా కాసుల బాల్‌రాజ్‌ రెగ్యులర్‌గా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

      బీఎస్పీ, ఆప్‌, వైఎస్‌ఆర్‌టీపీ వైపు నేతల చూపు..

ప్రధాన పార్టీల కార్యక్రమాలు కొనసాగుతుండగా ఇప్పటికే ఇతర పార్టీల్లో ఉన్న కొంతమంది నేతలు వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ, ఆప్‌, వైఎస్‌ఆర్‌టీపీ పార్టీ తరఫున పోటీచేసేందుకు సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో బాల్కొండ నుంచి బీఎస్పీ తరఫున పోటీచేసిన సునిల్‌రెడ్డి 2వ స్థానంలో ఉండడంతో ఎక్కువ మంది ఆ పార్టీ ద్వారా పోటీచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బీఎస్పీ గుర్తు కూడా కలిసివచ్చే అవకాశం ఉండడంతో ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పార్టీ సమన్వయకర్త ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. పంజాబ్‌లో ఎలాంటి ప్రచారం లేకుండా ఆమ్‌ఆద్మీ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొంతమంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు రాష్ట్రంలో మొదలుకాగానే అందులో చేరి నియోజకవర్గాల్లో కార్యక్రమాలను నిర్వహించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వైఎస్‌ఆర్‌టీపీలో చేరిన వారితో పాటు మరికొంతమంది చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలలోపు ఈ పార్టీ పుంజుకుంటే ఆ పార్టీ తరఫున పోటీచేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు కొత్త పార్టీలో చేరేందుకు కొంతమంది ఎన్‌ఆర్‌ఐలు, ఉద్యోగ సంఘ నేతలు, వ్యాపార వేత్తలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. జిల్లాలో మరికొన్ని రోజుల్లో నియోజకవర్గాల్లో అన్ని పార్టీల కార్యక్రమాలు ఉధృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఏ పార్టీలో ఏ నేత చేరతారో కొన్ని నెలల తర్వాత తేలే అవకాశం ఉంది.

Updated Date - 2022-04-19T07:02:50+05:30 IST