జడ్పీ పీఠం.. ఎవరికో?

ABN , First Publish Date - 2021-04-10T05:42:20+05:30 IST

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. పరిషత్‌ పోరును టీడీపీ బహిష్కరించడంతో.. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న వైసీపీ నాయకులకు కొత్త టెన్షన్‌ మొదలైంది. జడ్పీ పీఠం కోసం ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. చైర్‌పర్సన్‌ పదవి కోసం పోటాపోటీ నెలకొంది. ఎవరికివారు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి తమదేనంటూ ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ముఖ్య నాయకులు రంగంలోకి దిగారు. సామాజిక వర్గ సమీకరణలతో... పదవిని ఎవరికి కట్టబెట్టాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు.

జడ్పీ పీఠం.. ఎవరికో?

చైర్‌పర్సన్‌ పదవి కోసం పోటాపోటీ

వైసీపీలో ఆశావహుల తీవ్ర ప్రయత్నాలు

సామాజిక సమీకరణలతో మల్లగుల్లాలు

రంగంలోకి దిగిన ముఖ్య నేతలు

(శ్రీకాకుళం -ఆంధ్రజ్యోతి)

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. పరిషత్‌ పోరును టీడీపీ బహిష్కరించడంతో.. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న వైసీపీ నాయకులకు కొత్త టెన్షన్‌ మొదలైంది. జడ్పీ పీఠం కోసం ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. చైర్‌పర్సన్‌ పదవి కోసం పోటాపోటీ నెలకొంది. ఎవరికివారు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి తమదేనంటూ ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ముఖ్య నాయకులు రంగంలోకి దిగారు. సామాజిక వర్గ సమీకరణలతో... పదవిని ఎవరికి కట్టబెట్టాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో 590 ఎంపీటీసీ, 37 జడ్పీటీసీ స్థానాలకు గురువారం ఎన్నికలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 19,01,851 మంది ఓటర్లు ఉండగా... 11,17,476 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పరిషత్‌ ఎన్నికలను టీడీపీ బహిష్కరించిన నేపథ్యంలో ఈసారి పోలింగ్‌ శాతం కూడా తగ్గింది. 58.37 శాతం పోలింగ్‌ మాత్రమే నమోదైంది.  ఫలితాల ప్రకటన విషయంలో కోర్టు స్టే విధించింది. టీడీపీ ఎన్నికలను బహిష్కరించడంతో 37 జడ్పీటీసీ స్థానాలకు గానూ వైసీపీకే మెజార్టీ స్థానాలు దక్కనున్నాయి. దీంతో జడ్పీ పీఠం పొందడం ఆ పార్టీకి సునాయాసమే. అయితే చైర్‌పర్సన్‌ పదవి ఎవరికి కట్టబెట్టాలనే విషయమై ఆ పార్టీలో సీనియర్లకే స్పష్టత లేకుండా పోయింది. జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి బీసీ మహిళకు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఈ  పదవిపై కొంతమంది నేతలు కన్నేశారు. ఎవరి ప్రయత్నాలు వారు సాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి పదవులు పొందని సామాజిక వర్గానికే జడ్పీ పీఠం దక్కుతుందని ముఖ్య నేతలు కొందరు చెబుతుంటే.. అదేమీ లేదని... తమకే చైర్‌పర్సన్‌ పదవి దక్కుతుందని ఎవరికి వారే ప్రచారం సాగిస్తున్నారు. మరోవైపు సామాజికవర్గ సమీకరణలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో నేరుగా సీఎం వద్దకే వెళ్లి తమకు పదవి కట్టబెట్టాలని కొంతమంది నేతలు విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. ఇచ్ఛాపురం, టెక్కలి నియోజకవర్గాల్లో  టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ కేంద్రాల్లో ఒకరికి జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి కేటాయిస్తే.. టీడీపీ ప్రభావం కాస్త తగ్గించవచ్చని వైసీపీ అధిష్ఠానం గతంలో భావించింది. ఇందులో భాగంగా టెక్కలికి చెందిన ఓ నేత సతీమణికి చైర్‌పర్సన్‌ పదవి కట్టబెట్టాలని గతంలోనే నిర్ణయించినట్టు తెలిసింది. తాజాగా ఆ నేతకు ఇటీవల ఎమ్మెల్సీ పదవి కేటాయించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో ఆ నేత సతీమణి జడ్పీటీసీగా విజయం సాధించినా.. చైర్‌పర్సన్‌ పదవి కేటాయించడం కష్టమేనన్న వాదన వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. ఇక ఇచ్ఛాపురం నియోజకవర్గంలో మరో నేత సతీమణి.. కవిటి జడ్పీటీసీగా బరిలో నిలిచారు. ఆ నేతకు కూడా ఇప్పటికే నామినేటెడ్‌ పదవి కేటాయించడంతో.. ఆయన సతీమణికి చైర్‌పర్సన్‌ పదవి దక్కే అవకాశాలు తక్కువనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇతర సామాజిక వర్గాలకు జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి కేటాయించాలని వైసీపీ పెద్దలు ఆలోచన చేస్తున్నట్లు భోగట్టా. జిల్లాలో ఇప్పటికే రెండు ప్రధాన సామాజిక వర్గాలకు అన్ని పదవులు కట్టబెట్టారని.. జడ్పీ పదవి తమకే ఇవ్వాలంటూ పార్టీ సీనియర్‌ నాయకుడొకరు సీఎం జగన్‌ను కోరినట్లు సమాచారం. పాలకొండ నుంచి ఆ సామాజిక వర్గానికి చెందిన ఓ నేత సతీమణి.. తాను చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆమెకు పదవి దక్కకపోతే అదే కుటుంబంలో రేగిడి ఆమదాలవలస జడ్పీటీసీగా పోటీ చేసిన మరో మహిళకు జడ్పీ పీఠం కేటాయించాలని పట్టుబడుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో జిల్లా పెద్దలు రంగంలోకి దిగారు. సామాజికవర్గాల వారీగా సమీకరణలు చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి తరువాత చైర్‌పర్సన్‌ పీఠం విషయంలో వైసీపీ అధిష్ఠానం ఎవరిపైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాలి. 

Updated Date - 2021-04-10T05:42:20+05:30 IST