Abn logo
Sep 21 2021 @ 01:05AM

ఎంపీపీ పదవి కోసం పోటాపోటీ

జనరల్‌ స్థానాలలో మరింత ప్రతిష్టాత్మకం 

వైసీపీకి తలనొప్పిగా మారనున్న ఎంపీపీల ఎంపిక?

కందుకూరు, సెప్టెంబరు 20: జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యంతో ఘన విజయాలు సాధించిన అధికార పార్టీకి ఎంపీపీల ఎంపిక తలనొప్పిగా మారే పరిస్థితి కనిపిస్తోంది. నియోజకవర్గంలో  రెండు మండలాల్లో నూటికి నూరుశాతం ఎంపీటీసీలు వైసీపీకే దక్కాయి. మరో రెండు మండలాల్లో ఒక్కొక్క ఎంపీటీసీ మాత్రమే టీడీపీ ఖాతాలో చేరాయి. మిగిలిన అన్ని ఎంపీటీసీల్లో వైసీపీనే గెలిచింది. దీంతో ఎంపీపీ పదవిని ఆశించే ఔత్సాహికులు అధికమయ్యారు. ముఖ్యంగా ఎంపీపీ పదవి జనరల్‌కు కేటాయించిన కందుకూరు, లింగసముద్రం మండలాల్లో ఈ పోటీ అధికంగా ఉంది. ఈ రెండు మండలాల్లో ఎంపీపీల ఎంపిక అధికార పార్టీకి తలనొప్పిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక వలేటివారిపాలెం, ఉలవపాడు మండలాల్లో కూడా ఎంపీపీ పదవి కోసం ఔత్సాహికులు అధికంగానే  ఉన్నారు. దీంతో నాయకత్వానికి ఎంపీపీల వ్యవహారం తలనొప్పిగా మారినట్లు కనిపిస్తోంది. ఎస్సీ జనర్‌లకు ఎంపీపీ పదవి రిజర్వ్‌ అయిన గుడ్లూరు మండల ంలో మాత్రం ఎంపీపీ ఎంపిక సులువుగానే జరగవచ్చని భావిస్తున్నారు.

నియోజకవర్గ కేంద్రమైన కందుకూరు ఎంపీపీ పదవి జనరల్‌ కేటగిరికి రిజర్వ్‌ అయ్యింది. దీంతో ఇక్కడ ఔత్సాహికులు అధికంగా ఉన్నారు. జనరల్‌ కేటగిరి, జనరల్‌ మహిళ కేటగిరిలో ఎంపీటీసీలుగా గెలుపొందిన వారితో పాటు బీసీ, ఎస్సీ ఎంపీటీసీలు కూడా ఈ పదవిని ఆశిస్తుండటంతో ఔత్సాహికుల సంఖ్య ఇక్కడ అధికంగా ఉంది. 11 ఎంపీటీసీ స్థానాలు ఉన్న కందుకూరు మండలంలో 7 స్థానాలను ఏకగ్రీవంగా, 4 స్థానాలను ఎన్నికల్లో వైసీపీ దక్కించుకుంది. దీంతో పదవిని ఆశించే వారి సంఖ్య పెరుగుతోంది. పలుకూరు, మాచవరం ఎంపీటీసీగా జనరల్‌ కేటగిరి అభ్యర్థులు గెలుపొందగా కొండముడుసుపాలెం, ఓగూరులలో జనరల్‌ మహిళలు ఎంపీటీసీలుగా గెలుపొందారు. ప్రస్తుతం వీరు నలుగురు ఎంపీపీ పదవిని ఆశిస్తూ తమ అభ్యర్థనను ఎమ్మెల్యే ముందు ఉంచారు. బీసీ మహిళలు గెలుపొందిన మోపాడు, కోవూరు గ్రామ నాయకులు కూడా ఎంపీపీ అవకాశం తమకు ఇవ్వాలని  పట్టుబడుతున్నట్లు తెలిసింది. దీంతో ఎంపీపీ పదవి ఎవరిని వరిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. 

అదేవిధంగా లింగసముద్రం మండలంలో కూడా ఎంపీపీ ఎంపిక కూడా ప్రతిష్టాత్మకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. జనరల్‌ కేటగిరికి రిజర్వ్‌ అయిన లింగసముద్రం-2లో పోటీచేసి ఎంపీటీసీగా గెలిచిన బీసీ సమాజిక వర్గానాకి చెందిన న్యాయవాది పెన్నా కృష్ణయ్య ఇక్కడ ఎంపీపీ పదవిని ఆశించినట్లు తెలిసింది. ఎన్నికలకు ముందునుంచి ఆయన పేరు వినపడింది. అయితే లింగసముద్రం-1 స్థానం నుంచి వైసీపీ మండల కన్వీనర్‌ తిరుపతిరెడ్డి కోడలు పిచ్చపాటి వనజ ఎంపికైంది. దీంతో మొగిలిచర్ల నుండి వెన్నపూస కృష్ణారెడ్డి, వీఆర్‌ కోట నుంచి వంకాయలపాటి సుబ్బమ్మ ఎంపీటీసీలుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం సుబ్బమ్మ ఎంపీపీ పదవిని ఆశించనప్పటికీ తిరుపతిరెడ్డి, వెన్నపూస కృష్ణారెడ్డిలు తమకు అవకాశం కల్పించాలని జనరల్‌ కేటగిరి ఎంపీపీ పదవిని బీసీలకు ఇవ్వడం న్యాయం కాదని కోరుతున్నట్లు తెలిసింది. దీంతో ఇక్కడ కూడా ఎంపిపి ఎంపిక అధికారపార్టీకి తలనొప్పిగా మారుతోంది. ఇక ఎస్సీలకు రిజర్వ్‌ అయిన గుడ్లూరు ఎంపీపీ పదవికి అర్హత ఉన్న వ్యక్తులు పరకొండపాడు, బసిరెడ్డిపాలెం ఎంపీటీసీలకు మాత్రమే ఉంది. దీంతో వారిలో ఒకరికి అవకాశం కల్పిస్తారని పెద్ద సమస్య లేకుండానే ఈ ఎంపిక పూర్తయ్యే అవకాశం ఉంది. పరకొండపాడు ఎంపీటీసీకే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం. ఎంపీపీ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్‌ అయిన వలేటివారిపాలెం మండలంలోనూ, పలువురు ఈ పదవి కోసం పోటీపడుతున్నారు. నలదలపూరు, పోకూరు, వలేటివారిపాలెం, బడేవారిపాలెం, శింగమనేనిపల్లి ప్రాదేశికాల నుంచి ఎస్సీ మహిళా అభ్యర్థులు వైసీపీ నుంచి గెలుపొందారు. వీరిలో వలేటివారిపాలెం ఎంపీటీసీ స్థానం విజేతకు ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం రావడంతో ఆమె రేపోమాపో ఈ పదవికి రాజీనామా చేయనున్నట్లు చెబుతున్నారు. ఇక బడేవారిపాలెం నుంచి జడ్పీటీసీ ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఆ గ్రామానికి ఎంపీపీ పదవి ఇచ్చే అవకాశం లేదు. ఇక మిగిలిన పోకూరు, శింగమనేనిపల్లి, నలదలపూరులలో నలదలపూరు  ఎంపీటీసీలకే అవకాశాలు మెండుగా ఉన్నట్లు సమాచారం. ఉలవపాడు ఎంపీపీ పదవి బీసీలకు రిజర్వ్‌ కాగా ప్రస్తుతం ఆ సామాజిక వర్గానికి చెందిన అనేకమంది ఈ పదవిని ఆశిస్తూ ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఎన్నికలకు ముందే కరేడుకే చెందిన బీసీ సామాజికవర్గం వ్యక్తికి ఈ పదవి ఇస్తారని చెప్పి ఉండటంతో ప్రస్తుతం ఏమి జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.