నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలి

ABN , First Publish Date - 2021-05-07T06:25:40+05:30 IST

అకాలవర్షంతో నష్టపోయిన పంటలకు వెంటనే నష్ట పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలి
అకాల వర్షానికి నష్టపోయిన పంట పొలాలను పరిశీలిస్తున్న ఏలేటి

కరోనావ్యాప్తిని అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలం  

ప్రజలకు వైద్యం అందించని ప్రభుత్వానికి ప్రజలే 

బుద్ధి చెబుతారు  మాజీ ఎమ్మెల్యే ఏలేటి

సారంగాపూర్‌, మే 6 : అకాలవర్షంతో నష్టపోయిన పంటలకు వెంటనే నష్ట పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం మండలంలోని ఆయా గ్రామాల్లో అకాలవర్షానికి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులను పంటల వివరాలను అడిగి తెలుసుకుని ఈ సందర్భంగా విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. అకాల వర్షంతో నష్టపోయిన పంట రైతులకు ఎకరానికి రూ. 12 వేలు నష్టపరిహరంను అందించాలని పేర్కొన్నారు. మొక్కజొన్న ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారులకు అమ్మి తీవ్రస్థాయిలో నష్టపోయారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షానికి తడిసిన ధాన్యంను తేమ శాతం లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. కొవిడ్‌- 19 వైరస్‌ వ్యాధితో ప్రజలు ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారని ఆసుపత్రులలో వ్యాధిగ్రస్తులకు వ్యాధికి సంబంధించిన సౌకర్యాలు లేకపోవడంతో వేలాది సంఖ్యలో మృతి చెందుతున్నారని, ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఆసుపత్రులలో కరోనా వ్యాధిగ్రస్తులకు అన్ని సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేసి కరోనా వైద్య చికిత్సను ఆరోగ్యశ్రీ లోనే వైద్యం చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. లేని యెడల కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. ప్రజలకు వైద్యం అందించని ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సొంత పనులకు పరిమితమయ్యారే తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు రాం శంకర్‌రెడ్డి, జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షుడు బడి పోతన్న, జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు నక్క రాజన్న, మండల బీసీ సెల్‌ పార్టీ అధ్యక్షుడు కాల్వ నరేష్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దశరథ్‌ రాజేశ్వర్‌, నాయకులు చంద్ర ప్రకాష్‌ గౌడ్‌, శ్రావణ్‌, శ్రీకాంత్‌ రెడ్డి, దయాకర్‌ రెడ్డి, కార్తీక్‌లతో పాటు నాయకులు, రైతులు ఉన్నారు. 


Updated Date - 2021-05-07T06:25:40+05:30 IST