ఎకరం మిర్చికి రూ.లక్ష పరిహారం ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-01-22T05:35:38+05:30 IST

తెగుళ్ల కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1.30లక్షల ఎకరాల్లో మిర్చి పంటకు నష్టం వాటిల్లిందని, అయినా ప్రభుత్వం కనీసం స్పందించలేదని, ఎకరానికి రూ.లక్ష పరిహారం ఇవ్వాలని వామపక్ష రైతు సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు శుక్రవారం ఖమ్మంలోని ఉద్యాన శాఖ జిల్లా

ఎకరం మిర్చికి రూ.లక్ష పరిహారం ఇవ్వాలి

ఖమ్మం ఉద్యానశాఖ కార్యాలయం ఎదుట వామపక్ష రైతుసంఘాలు ధర్నా

ఖమ్మం సంక్షేమ విభాగం, జనవరి 21: తెగుళ్ల కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1.30లక్షల ఎకరాల్లో మిర్చి పంటకు నష్టం వాటిల్లిందని, అయినా ప్రభుత్వం కనీసం స్పందించలేదని, ఎకరానికి రూ.లక్ష పరిహారం ఇవ్వాలని వామపక్ష రైతు సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు శుక్రవారం ఖమ్మంలోని ఉద్యాన శాఖ జిల్లా కార్యాలయం ఎదుట రైతులతో కలిసి నాయకులు ధర్నా చేశారు. అంతకుముందు తెగుళ్లతో ఎండిపోయిన మిర్చి మొక్కలతో నగరంలో ప్రదర్శన నిర్వహించారు. ఉద్యానశాఖ కార్యాలయం వద్ద ధర్నాలో ఈ సందర్భంగా నాయకులు బొంతు రాంబాబు, గోవిందరావు, ఆవుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఒక్కో రైతు ఒక్కో ఎకరానికి రూ.1లక్షకు పైగా పెట్టుబడి పెట్టారని, మిర్చి పంటకు తెగుళ్లు ఆశించడాన్ని ప్రకృతి విపత్తుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. మిర్చి సాగు చేసిన వారిలో 60శాతం మంది కౌలు రైతులు ఉన్నారని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో వారికి ఎలాంటి గుర్తింపు లేకుండా పోయిందని ఆరోపించారు. మరో వైపు బ్యాంకు అధికారులు గతంలో తీసుకున్న రుణాలను చెల్లించాలని రైతుల ఇళ్లను జప్తు చేస్తున్నారని విమర్శించారు. రైతు సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకొంటున్న టీఆర్‌ఎస్‌ హయాంలో నష్టపోతున్న రైతులకు చేసిందేమీలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు ఆడపా రామకోటయ్య, దొండపాటి రమేశ, మాదినేని రమేశ, మలీదు నాగేశ్వరరావు, పోటు కళావతి, ఏపూరి లతాదేవి, తాటి వెంకటేశ్వరరావు, ఎస్‌కే మీరా, చలపతి, అవుల ఆశోక్‌, గుర్రం అచ్చయ్య, మంగతాయి, పీవై పుల్లయ్య, ఝాన్సీ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T05:35:38+05:30 IST