పశు బీమా ఏదీ?

ABN , First Publish Date - 2021-10-23T04:09:57+05:30 IST

పశు బీమా ఏదీ?

పశు బీమా ఏదీ?

- 22 నెలలుగా అందని పరిహారం

- జిల్లా వ్యాప్తంగా రూ.10.41 కోట్లు పెండింగ్‌

- ఆశగా ఎదురుచూస్తున్న పాడి రైతులు


(టెక్కలి)

టెక్కలి మండలం కొల్లివలసకు చెందిన బిల్లింగి మల్లేసు పాడి రైతు. పాడి ఆవుతో వచ్చే ఆదాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. ఆరు నెలల కిందట ఆవు అనారోగ్యంతో మృతిచెందడంతో ఉపాధి లేకుండా పోయింది. పశు బీమా కట్టినా ఇంతవరకూ పరిహారం అందలేదు. సంబంధిత అధికారులను అడుగుతుంటే అదిగో..ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప అందించడం లేదు. 

...ఇది ఒక మల్లేసు పరిస్థితే కాదు. జిల్లాలో దాదాపు ఎనిమిది వేల మంది రైతులు పశుబీమా పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. గడిచిన 22 నెలల వ్యవధిలో వివిధ కారణాలతో 8 వేల ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు మృత్యువాత పడ్డాయి.  కానీ బాధిత రైతులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు. పాడి రైతుల సంక్షేమం కోసం వైఎస్సార్‌ పశు బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. పాడిరైతులు ఈ పథకంలో నమోదు కావాలని అధికారులు పెద్దఎత్తున అవగాహన కల్పించారు. దగ్గరుండి పథకంలో చేర్పించారు. దేశవాళీ ఆవు, గేదె మృత్యువాతపడితే రూ.15వేలు, మేలుజాతి ఆవులు, గేదెలు మృత్యువాత పడితే రూ.30వేలు, మూడు గొర్రెలు, మేకలు దాటి ఒకేసారి చనిపోతే ఒక్కోదానికి రూ.6వేల చొప్పున చెల్లించాలన్నది పథకం ముఖ్య ఉద్దేశం. మృత్యువాత పడిన పశువు ఫొటో, రైతు ఆధార్‌ నంబరు, బ్యాంకు ఖాతా వివరాలు, చెవిపోగు నంబరు, పశువైద్యాధికారి ఇచ్చిన ధ్రువపత్రం, శవపంచనామా వివరాలు క్షేత్రస్థాయిలో పశువైద్యాధికారులకు అందిస్తే వారు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఆ తరువాత వరుస క్రమంలో పరిహారం అందుతుందని అధికారులు తెలిపారు. కానీ 22 నెలలు గడుస్తున్నా పరిహారం ఊసే లేదు. అధికారులను అడుగుతుంటే అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రూ.10 కోట్ల 41 లక్షలు బకాయిలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. 


అక్కరకు రాని సచివాలయ సేవలు

గ్రామాల్లో సచివాలయాలను అందుబాటులోకి తెచ్చారు. పశుసంవర్థక శాఖ సహాయకులను నియమించారు. కానీ వారి సేవలు అక్కరకు రాకుండా పోయాయని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాడి పశువులకు ఎటువంటి సుస్తీ చేసినా వారిని సంప్రదిస్తుంటే పట్టించుకోవడం లేదు. దీంతో సమీపంలోని పశువైద్యశాలకు తీసుకెళ్లాల్సి వస్తోంది. లేకుంటే గోపాలమిత్రలను ఆశ్రయించాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యసేవలందక పశువులు మృత్యువాత పడుతున్నాయి. అటు వైద్యసేవలందక, పశువులు మృత్యువాత పడితే పరిహారం అందకపోవడంతో పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా ప్రోత్సాహం అంటూ నిట్టూరుస్తున్నారు. 


అర్హులందరికీ పరిహారం

పశు బీమా పరిహారానికి సంబంధించి బడ్జెట్‌ విడుదలైంది. బాధిత రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులందరికీ పరిహారం అందుతుంది. ఈ విషయంలో ఎటువంటి ఆందోళన వద్దు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన పశువైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 

- జయరాజ్‌, పశుసంవర్థక శాఖ డీడీ

 

Updated Date - 2021-10-23T04:09:57+05:30 IST