వరదల్లో దెబ్బతిన్న ఇళ్లకు పరిహారమేది?

ABN , First Publish Date - 2020-12-03T08:12:19+05:30 IST

వందేళ్లలో కురవనంత వర్షానికి నగరంలో జీవనమంతా అతలాకుతలమై 4,247 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఆ ఇళ్లకు పరిహారంపై ఇప్పటి వరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు.

వరదల్లో దెబ్బతిన్న ఇళ్లకు పరిహారమేది?

4,247 ఇళ్లపై వరదల ప్రభావం..

రెండు నెలలు గడుస్తున్నా సాయం అందలేదు

హైదరాబాద్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): వందేళ్లలో కురవనంత వర్షానికి నగరంలో జీవనమంతా అతలాకుతలమై 4,247 ఇళ్లు దెబ్బతిన్నాయి.  ఆ ఇళ్లకు పరిహారంపై ఇప్పటి వరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. వరదలు సంభవించి రెండునెలలు గడుస్తున్నా పరిహారం చేతికి రాలేదు. 67 పక్కా, 27 కచ్చా ఇళ్లు పూర్తిస్థాయిలో, 4,153  పాక్షికంగా మొత్తం 4,247 ఇళ్లు దెబ్బతిన్నాయి. పూర్తిగా దెబ్బతిన్న పక్కా, కచ్చా ఇళ్లకు ఒక్కొక్కదానికి రూ.95,100ల చొప్పున పరిహారం అందించాలి. పాక్షికంగా దెబ్బతిన్న  ఇళ్లకు  రూ.5,200ల చొప్పున పరిహారం ఇవ్వాలి.


అంతే కాకుండా పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ల కుటుంబాలను ఇందిరా ఆవాస్‌ యోజన పథకం కింద ఎంపిక చేయాలని నిబంధనలున్నాయి. విపత్తులు సంభవించినప్పుడు సహాయం చేయడానికి వీలుగా కేంద్రప్రభుత్వం రాష్ట్ర విపత్తుల స్పందన నిధి(ఎ్‌సడీఆర్‌ఎఫ్‌) కింద సహాయాన్ని ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉంచుతుంది.


ఆ నిధి నుంచి ఏ నష్టానికి ఎంత మేర పరిహారం ఇవ్వాలో 2015లోనే కేంద్రం  స్పష్టం చేసింది. దానికి అనుగుణంగా ఇచ్చే పరిహారానికి సంబంధించి 2015 జూన్‌ 15న రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ జీవో నెం.2ను జారీ చేసింది. ఈ నిధిలో 75 శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం చె ల్లించాలి.  పాలిచ్చే ఆవులు, గేదెలు, దున్నపోతులు కలిపి 77 వరకు వరదలకు మృత్యువాతపడ్డాయి. ఒక్కో పశువుకు రూ.30 వేల వరకు ఇవ్వాలి.


ఇక 11,500 కోళ్లు కూడా చనిపోయాయని ప్రభుత్వం లెక్కకట్టింది. ఒక్కో కోడికి రూ.50 చెల్లించాలి.  ఆయా పరిహారాలు జిల్లా కలెక్టర్లే విడుదల చేసి, ఆ తర్వాత ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్‌ కోసం ప్రతిపాదనలు పంపించాలి. అయితే ఆ దిశగా జిల్లా యంత్రాంగం స్పందించిన దాఖలాలు లేవు. ఉన్నత స్థాయిలో ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడితేనే బాధిత కుటుంబాలకు సహాయం అందే అవకాశాలున్నాయి. 




వరదసాయం దరఖాస్తుకు మరో అవకాశం ఇస్తారా ?

వరద సాయం కోసం దరఖాస్తు చేసుకోవడానికి మరో అవకాశం ఇస్తారా? ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ సాయాన్ని అంది స్తారా ? అనే అంశంపై కొంత అస్పష్టత నెలకొంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో నిలిచిపోయిన వరద సాయాన్ని ఈ నెల 7 నుంచి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ఇంతకు ముందు ప్రకటించిన విషయం తెలిసిందే. సాయం అందని వారితోపాటు అసలు దరఖాస్తు చేసుకోనివారు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు.


వరదల సమయంలో మంత్రులు, అధికారులు కలిసి  సుమారు 4.86 లక్షల మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.486 కోట్లను పంపిణీ చేశారు. ఆ తర్వాత మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. దాంతో మూడు రోజుల్లోనే  2.86 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1.78 లక్షలమందికి సుమారు రూ.178 కోట్ల సాయాన్ని వారి ఖాతాలో జమ చేశారు. ఇలా మొత్తం 6.64 లక్షలమందికి రూ.664 కోట్లు పంపిణీ చేశారు.


ఆ తర్వాత వదర సాయాన్ని  నిలిపివేయాలని, దరఖాస్తులను కూడా స్వీకరించవద్దని నవంబరు 18న ఎన్నికల సంఘం ఆదేశించింది.  దానికితోడు అంతకు ముందు రోజు నుంచే మీసేవా కేంద్రాల్లో  సర్వరు పనిచేయలేదు. దాంతో ప్రజలు పెద్దఎత్తున  మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులను సమర్పించారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో వాటిని కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదు. ఈ నేపథ్యంలో దరఖాస్తులకు మరో అవకాశం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. 


Updated Date - 2020-12-03T08:12:19+05:30 IST