పరిహారం ఎప్పుడు?!

ABN , First Publish Date - 2022-01-24T07:55:01+05:30 IST

వరుస విపత్తులతో పంట నష్టపోయిన రైతాంగానికి పరిహారం అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాప్యం చేస్తున్నాయి.

పరిహారం  ఎప్పుడు?!

వరుస విపత్తులతో పంట నష్టాలు

కేంద్ర బృందం పర్యటించి నెలలు గడిచినా

సాయంపై స్పందించని కేంద్ర ప్రభుత్వం

ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా ఇవ్వని సర్కార్‌


  (అమరావతి-ఆంధ్రజ్యోతి): వరుస విపత్తులతో పంట నష్టపోయిన రైతాంగానికి పరిహారం అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాప్యం చేస్తున్నాయి. 2021-22 ఖరీఫ్‌లో పంట నష్టపోతే, రబీ సీజన్‌ ముగిస్తున్నా.. నగదు సాయం అందించలేదు. నవంబరులో అధిక వర్షాలు, వరదలకు పంట దెబ్బతిన్న రాయలసీమ జిల్లాల్లో కేంద్రబృందం పర్యటించి, నష్టాన్ని అంచనా వేసినా.. ఇంత వరకు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల చేయలేదు. కేవలం రాయితీ విత్తనాలు మాత్రమే అందించారు. అవి కూడా కొన్ని జిల్లాల్లోనే పంపిణీ చేశారు. అంతకుమించి ఏ సాయమూ బాధిత రైతులకు అందించలేదు. పెట్టుబడి సాయం ఇస్తున్నామన్న ఉద్దేశంతో పంట నష్టపరిహారం అందించడంలో తాత్సారం చేస్తున్నట్లు కన్పిస్తోందని బాధిత రైతులు మండిపడుతున్నారు. ‘‘ప్రతి ఎకరాకు, ప్రతి రైతుకు న్యాయం చేస్తాం.. ఎంత నష్టపోతే.. అంత పరిహారమిస్తాం. పంట సీజన్‌ ముగిసేలోగా.. నష్టపరిహారం కచ్చితంగా చెల్లిస్తాం. ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదు’’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గత నవంబరులో ప్రకటించారు. దీంతో బాధిత రైతులు ఆయన మాటలపై నమ్మకం పెట్టుకున్నారు. కానీ, ఇప్పటి వరకు వారికి ఎలాంటి సాయం అందకపోవడంతో ఇప్పుడు లబోదిబోమంటున్నారు.


గత అక్టోబరు, నవంబరు, డిసెంబరులో వాయుగుండాలతో దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో అధిక వర్షాలు, వరదలు వచ్చాయి. దీంతో రూ.6 వేల కోట్ల విలువైన పంటలు దెబ్బతిన్నాయి. జవాద్‌ తుఫాన్‌తో ఉత్తరాంధ్రలోనూ రైతులు పంటలు నష్టపోయారు. ఆ మూడు నెలల్లో దాదాపు 12 లక్షల ఎకరాలు ముంపుబారిన పడ్డాయని, అందులో 8 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, శనగ, మిర్చి, పెసర, మినుము, చెరకు, మొక్కజొన్న, చిరుధాన్యాల పంటలతో పాటు అరటి, బొప్పాయి వంటి ఉద్యాన పంటలు, వేలాది ఎకరాల్లో చేపలు, రొయ్యల పంటకు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఈ నెలలో అకాల వర్షాలకు మళ్లీ పంటలు నీటిపాలయ్యాయి. 


ఊసులేని కేంద్రం!

వరద ప్రాంతాలను కేంద్ర బృందాలు నవంబరులో పరిశీలించాయి. ముఖ్యమంత్రితోనూ భేటీ అయి, నష్టాలపై చర్చించాయి. కానీ, కేంద్రం నుంచి ఇంతవరకూ పరిహారంపై ప్రకటన రాలేదు. పైగా విపత్తు సాయం కింద తక్షణం రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలని సీఎం లేఖ రాసినా, కేంద్రం నుంచి సానుకూల స్పందన లేదు. ఇదిలావుంటే, రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టిన దాఖలా కనిపించడం లేదు. దీంతో నష్ట పరిహారం వస్తుందనే ఆశలు రైతుల్లో సన్నగిల్లుతున్నాయి. పైగా వర్షాలకు తడిసిన ధాన్యం కొనుగోలులో నిబంధనలు అన్నదాతలకు అశనిపాతంగా మారాయి.  

Updated Date - 2022-01-24T07:55:01+05:30 IST