పరిహారమా.. బిచ్చమా?

ABN , First Publish Date - 2021-10-18T06:41:27+05:30 IST

నిర్మాణానికి ముందే చిత్తూరు - తచ్చూరు జాతీయ రహదారి రైతుల ఆందోళనలతో భగ్గుమంటోంది. బంగారం పండే భూములకు ప్రభుత్వం నిర్ణయించిన పరిహారం అన్యాయంగా ఉందని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. పరిహారం పేరుతో తమకు బిచ్చం వేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. తరచూ నిరసనలతో హోరెత్తిస్తున్నారు.

పరిహారమా.. బిచ్చమా?
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న నిర్వాసిత రైతులు (ఫైల్‌ఫొటో)

చిత్తూరు- తచ్చూరు జాతీయ రహదారి భూసేకరణపై రైతుల ఆగ్రహం

నిరసనలు, ధర్నాలతో హోరెత్తిస్తున్న ప్రజలు


చిత్తూరు, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): నిర్మాణానికి ముందే చిత్తూరు - తచ్చూరు జాతీయ రహదారి రైతుల ఆందోళనలతో భగ్గుమంటోంది. బంగారం పండే భూములకు ప్రభుత్వం నిర్ణయించిన పరిహారం అన్యాయంగా ఉందని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. పరిహారం పేరుతో తమకు బిచ్చం వేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. తరచూ నిరసనలతో హోరెత్తిస్తున్నారు. జిల్లా మంత్రులు, ఎంపీలు చొరవ తీసుకుని పరిహారం విషయంలో తగిన పరిష్కారానికి ప్రయత్నించకపోతే రైతు ఆందోళనలు ఉద్యమంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. 

భారతమాల పరియోజన పేరుతో బెంగళూరు- చెన్నై నడుమ ఆరు వరుసల(ఎన్‌హెచ్‌ 716బీ) ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ.3,197.56 కోట్లు వ్యయం అవుతుంది. 126.55 కిలోమీటర్ల మేర సాగే ఈ రహదారి జిల్లాలో 83 కి.మీలు.. తమిళనాడులో 43.55 కి.మీలు ప్రయాణిస్తుంది. జిల్లాలో 152వ కి.మీ వద్ద మొదలై 8 మండలాల మీదుగా సాగి తమిళనాడులోని తచ్చూరు వద్ద ముగుస్తుంది. ఈ రహదారి కోసం ఈ 8 మండలాల పరిధిలోని 46 రెవెన్యూ గ్రామాల నుంచి సుమారు 1400 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఈ భూమికి పరిహారం విషయంలోనే తకరారు మొదలైంది. రిజిస్ర్టేషన్ల శాఖ విలువ మేరకు లేదా నోటిఫికేషన్‌ ఇచ్చినప్పటి నుంచి మూడేళ్లకు ముందు వరకు జరిగిన భూముల కొనుగోళ్లు ధరకు రెండున్నర రెట్లు పరిహారం ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం చెల్లించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. నిజానికి ఒక్కో మండలంలో ఒక్కో రకంగా భూముల ధరలున్నాయి. నిండ్ర మండలం అత్తూరులో మార్కెట్‌ ధర ప్రకారం ఎకరా రూ.30 లక్షలు పలుకుతోంది. అధికారులు మాత్రం రూ.8 లక్షలు ప్రకటించారు. అలాగే ఎస్‌ఆర్‌ పురం మండలం వేణుగోపాలపురంలో మార్కెట్‌ ధర ప్రకారం ఎకరా రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలుగా ఉంది. ఇక్కడా రూ.7 నుంచి రూ.8 లక్షలుగా ప్రకటించారు. ఇప్పటికే భూముల సర్వే పూర్తి అయింది. పరిహారం చెల్లించి భూసేకరణ చేయడమే మిగిలుంది. 


విచక్షణాధికారంతో పరిష్కారం సాధ్యం


వాస్తవానికి ప్రభుత్వ నిర్మాణాలకు భూమిని సేకరిస్తే రిజిస్ర్టేషన్‌ శాఖ విలువకు రెండున్నర రెట్లు పరిహారం ఇస్తారు. అన్ని ప్రాజెక్టులకూ ఇదే విధానాన్ని అనుసరిస్తారు. జిల్లాలో కొన్ని జాతీయ రహదారులకు ఇలాగే పరిహారం చెల్లించి భూసేకరణ చేశారు. కానీ ఎక్కడా ఈ స్థాయిలో రైతుల నుంచి సమస్య ఉత్పన్నం కాలేదు. కలెక్టర్‌, మంత్రులు, ఎంపీలు చర్చించి తమ విచక్షణాధికారంతో పరిహారం పెంపు విషయంగా నిర్ణయం తీసుకునే వీలుంది. ఇలా జరగకపోతే కోర్టు కేసులతో ఎన్నేళ్లయినా రహదారి పూర్తి కాకుండానే ఉంటుంది. 



Updated Date - 2021-10-18T06:41:27+05:30 IST