అట్టుడికిన సర్కిల్‌ కార్యాలయాలు

ABN , First Publish Date - 2020-10-30T09:58:59+05:30 IST

: నేరేడ్‌మెట్‌ డివిజన్‌కు చెందిన సంతో్‌షనగర్‌ బస్తీ వాసులకు పరిహారం అందిస్తామని కొం దరు రెండు..

అట్టుడికిన సర్కిల్‌ కార్యాలయాలు

మల్కాజిగిరి, అక్టోబర్‌ 29 (ఆంధ్రజ్యోతి) : నేరేడ్‌మెట్‌ డివిజన్‌కు చెందిన సంతో్‌షనగర్‌ బస్తీ వాసులకు పరిహారం అందిస్తామని కొం దరు రెండు రోజుల క్రితం ఆధార్‌ కాపీ లు తీసుకుని  వెళ్లా రు. కొందరికి డబ్బు లు అందలేదు. పలువురు మహిళలు గురువారం మధ్యాహ్నం సర్కిల్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. డీసీ చాంబర్‌లోకి వెళ్లి దశరథ్‌తో వాగ్వాదానికి దిగారు. సమాధానం చెప్పలేక చాంబర్‌ నుంచి డీసీ వెళ్లిపోతుండగా మెట్ల వద్ద నిలువరించారు. మీ కార్పొరేటర్‌ను అడగండంటూ చెప్పి డీసీ వెళ్లిపోయారు. 


కాప్రా కార్యాలయం వద్ద ధర్నా 

కాప్రా, అక్టోబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): కాప్రా పరిసర కాలనీలు, బస్తీల వాసులు కాప్రా మండల కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. శ్రీశ్రీనగర్‌, యాదవబస్తీ, ఎస్టీ కాలనీ, గాంధీనగర్‌ తదితర ప్రాంతాలలో కొందరికే ఆర్థిక సహాయం అందజేసి వెళ్లిపోయారని ఆరోపించారు. 


ఉప్పల్‌ సర్కిల్‌ కార్యాలయం ముందు..

ఉప్పల్‌, అక్టోబర్‌ 29 (ఆంధ్రజ్యోతి) : సహాయం కోసం ఉప్పల్‌ సర్కిల్‌ కార్యాలయం ముందు బాధితులు ధర్నా చేశారు. తమకు న్యాయం చేసేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని బైఠాయించిన ఉప్పల్‌ హిల్స్‌, కురుమనగర్‌, సత్యనగర్‌, ఉప్పల్‌ భరత్‌నగర్‌ వాసులను డిప్యూటీ కమిషనర్‌ అరుణకుమారి సముదాయించారు. అందరికీ సహాయం అందజేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 


చందానగర్‌ సర్కిల్‌ కార్యాలయం వద్ద..

మియాపూర్‌, అక్టోబర్‌ 29(ఆంధ్రజ్యోతి): చందానగర్‌ సర్కిల్‌ వద్ద ఇందిరానగర్‌కు చెందిన బాధితులు ఆందోళనకు దిగారు. హఫీజ్‌పేట డివిజన్‌లోనూ బీజేపీ నాయకులు మహే్‌షయాదవ్‌తో కలిసి నిరసన తెలిపారు. కొండాపూర్‌ డివిజన్‌లోని టీఆర్‌ఎస్‌ నేత రాజరాజేశ్వరి కాలనీ ఇంటి వద్ద ఆర్థికసాయం కోసం దాదాపు రెండు గంటలు ఎదురుచూసిన బాధితులు హైటెన్షన్‌లైన్‌ వద్ద కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. కొన్ని చోట్ల బాధిత కుటుంబాల సంఖ్య అనుకున్న దానికంటే పెరగడంతో సగం మందికే ఇచ్చి మళ్లీ వస్తామని నేతలు వెళ్లిపోతున్నారు. 


చిన్నతోకట్ట కమ్యూనిటిహాలు వద్ద ఆందోళన 

బోయినపల్లి, అక్టోబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): తమకు నష్ట పరిహారం అందడం లేదని కంటోన్మెంట్‌ ఒకటవ వార్డు పరిధిలోని చిన్నతో కట్టకు చెందిన ప్రజలు గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక సహాయం అందజేతలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. బోయినపల్లి చిన్నతోకట్టలోని కమ్యూనిటీ హాలు వద్ద నిరసన తెలిపారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు మాత్రమే డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 


రెండు వర్గాల మధ్య ఘర్షణ 

మహిళ తలకు తీవ్ర గాయాలు 

కార్వాన్‌, అక్టోబర్‌ 29 (ఆంధ్రజ్యోతి) : వరద బాధితులకు  సహాయం పంపిణీ కార్యక్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది. ఓ మహిళ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గుడిమల్కాపూర్‌, అల్లూరి సీతారామరాజునగర్‌ ప్రాంతంలో ప్రభుత్వం తరఫున బాధితులకు సహాయం అందిస్తుండగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల తోపులాట 

గచ్చిబౌలి, అక్టోబర్‌ 29 (ఆంధ్రజ్యోతి) : శేరిలింగంపల్లి డివిజన్‌  నెహ్రూనగర్‌లో డబ్బు పంపిణీలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు, నాయకులు జోక్యం చేసుకోవడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.

Updated Date - 2020-10-30T09:58:59+05:30 IST