పరిహారమిచ్చి పనిచేయండి

ABN , First Publish Date - 2021-12-04T05:05:02+05:30 IST

మల్లన్నసాగర్‌అదనపు టీఎంసీ కాలువ కోసం భూములిచ్చినా.. పూర్తి పరిహారం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తుండడంతో నిర్వాసితుల్లో ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. శుక్రవారం సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఘనపూర్‌ గ్రామం వద్ద నిర్వాసితులు కాలువ పనులను అడ్డుకొని అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

పరిహారమిచ్చి పనిచేయండి
ఘనపూర్‌ గ్రామం వద్ద కాలువ పనులను అడ్డుకున్న నిర్వాసితులతో మాట్లాడుతున్న కాంట్రాక్టర్లు

మల్లన్నసాగర్‌ అదనపు టీఎంసీ కాలువ పనులను అడ్డుకున్న నిర్వాసితులు 

అక్కడే బైఠాయించి నిరసన


తొగుట, డిసెంబరు 3 : మల్లన్నసాగర్‌అదనపు టీఎంసీ కాలువ కోసం భూములిచ్చినా.. పూర్తి పరిహారం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తుండడంతో నిర్వాసితుల్లో ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. శుక్రవారం సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఘనపూర్‌ గ్రామం వద్ద నిర్వాసితులు కాలువ పనులను అడ్డుకొని అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పూర్తి పరిహారం ఇచ్చేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని నిర్వాసితులు భీష్మించుకుని కూర్చున్నారు. వివరాల్లోకి వెళితే.. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ అదనపు టీఎంసీ కాలువ కోసం ఘనపూర్‌ గ్రామం నుంచి 74 ఎకరాల 36 గుంటల భూమిని ప్రభుత్వం సేకరించింది. ఎకరాకు రూ.13 లక్షలు చెల్లిస్తామని నిర్వాసితులకు హామీ ఇచ్చింది. అందులో భాగంగా మొదటి విడతగా భూములు కోల్పోయిన వారికి ఎకరాకు రూ.8 లక్షలు చెల్లించారు. మిగతా రూ.5 లక్షలను మూడు నెలల్లో చెల్లిస్తామని చెప్పి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేయించుకున్నారు. హామీ ఇచ్చి ఆరు నెలలు గడుస్తున్నా పరిహారం విషయాన్ని దాటవేస్తుండటంతో నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం కాలువ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లిన ఘనపూర్‌ నిర్వాసితులు పనులను అడ్డుకున్నారు. అక్కడే బైఠాయించి తమకు పూర్తి పరిహారం ఇచ్చే వరకు పనులు జరగనివ్వబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును వెల్లబోసుకున్నారు. మొదటి విడతగా వచ్చిన డబ్బుతో వేరే దగ్గర భూములు కొన్నామని వాటికి మిగతాది కట్టకపోతే ఇచ్చిన డబ్బులు పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం విషయమై పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. భూమి రిజిస్ట్రేషన్‌ చేయాలని ఒత్తిడి చేసిన ప్రజాప్రతినిధులు ఇప్పుడు తమవైపు కన్నెత్తి చూడటం లేదని ఆరోపించారు. నమ్ముకున్న భూమినిచ్చి త్యాగం చేసిన తమకు పూర్తి నష్టపరిహారం ఇవ్వకుండా వేధించడం ఎంతవరకు సమంజసం అని మండిపడ్డారు. తమకు రావాల్సిన పరిహారం ఇచ్చేవారకు అదనపు టీఎంసీ పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. కాగా నిర్వాసితులు కాలువ పనులు అడ్డుకున్న విషయం తెలుసుకున్న కాంట్రాక్టర్లు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ప్రస్తుతం రూ.3 లక్షల పరిహారం ఇస్తామని మిగతా రూ.2 లక్షలు తర్వాత ఇస్తామని హామీ ఇవ్వగా దానికి రైతులు ఒప్పుకోలేదు. పూర్తి పరిహారం ఇవ్వాలని అప్పటివరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని నిర్వాసితులు తేల్చిచెప్పారు.

Updated Date - 2021-12-04T05:05:02+05:30 IST