Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెద్దలతో పోలిస్తే పిల్లల్లో ఎక్కువ...

పిల్లలకూ రావచ్చు!

క్యాన్సర్‌ మహమ్మారికీ వయోభేదాలు లేవు. ఆ వ్యాధి బారిన పడే పసిమొగ్గలూ ఉంటారు. అయితే పెద్దలతో పోలిస్తే, పిల్లల్లో తలెత్తే క్యాన్సర్లను సమూలంగా తుదముట్టించే చికిత్సలు ఉంటున్నాయి అంటున్నారు వైద్యులు.


పెద్దల్లో వచ్చే అన్ని రకాల క్యాన్సర్లు పిల్లల్లోనూ వచ్చే వీలుంది. పిల్లల్లో ప్రధానంగా రక్తసంబంధ క్యాన్సర్లు (లుకేమియా), మెదడు కణితులు (బ్రెయిన్‌ ట్యూమర్లు), లింఫోమా, సాఫ్ట్‌ టిష్యూ సార్కోమా క్యాన్సర్లు ఎక్కువ. అయితే వీటి చికిత్సల్లో భాగంగా అందించే రేడియేషన్‌కు పిల్లలు భయపడే సందర్భంలో మత్తు ఇవ్వవలసి ఉంటుంది. 12 ఏళ్లు పైబడిన ఆడ, మగ పిల్లలకు అందించే రేడియేషన్‌ వల్ల వారి పునరుత్పత్తి వ్యవస్థల మీద ప్రభావం పడుతుంది. కాబట్టి ముందుగానే వారి నుంచి అండాలను, వీర్యకణాలను సేకరించి భద్రపరచాలి. పుట్టిన మొదటి బిడ్డకు రక్తసంబంధ క్యాన్సర్‌ ఉంటే, రెండో బిడ్డ విషయంలో తల్లితండ్రులు జాగ్రత్త పడవలసి ఉంటుంది.


పిల్లల్లో లుకేమియా!

పిల్లల్లో ఈ రకం క్యాన్సర్‌ సర్వసాధారణం. ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడవలసిన తెల్ల రక్తకణాలు అపరిమితంగా పెరిగిపోవడమే ఈ క్యాన్సర్‌ లక్షణం. ఈ రక్తకణాలు ఎర్ర రక్తకణాలను అడ్డుకుని, రక్తసరఫరాకు ఆటంకంగా మారతాయి. ఈ క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా కీమో, రేడియోథెరపీలు, ఎముకమజ్జ మార్పిడి, మూలకణ మార్పిడి చికిత్సలు అందించవలసి ఉంటుంది. పిల్లలు పాలిపోయినట్టు ఉండడం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, నీరసం, అలసట, త్వరగా చర్మం కమిలిపోతూ ఉండడం, చర్మం మీద మచ్చలు, తీవ్ర రక్తస్రావం, ఒళ్లు నొప్పులు లాంటి లక్షణాలు ఉంటాయి. రక్తపరీక్షలు, తుంటి లేదా ఇతర పెద్ద ఎముకల నుంచి సేకరించిన మజ్జలను పరీక్షించి, ఈ క్యాన్సర్‌ను నిర్ధారించవచ్చు. 


పిల్లల మెదడులో గడ్డలు!

పెద్దలతో పోలిస్తే పిల్లల్లో బ్రెయిన్‌ ట్యూమర్లు ఎక్కువ. ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే తీవ్రమైన తలనొప్పి, వికారం, వాంతులు, ప్రవర్తనలో మార్పులు, ఆందోళన, ఫిట్స్‌, చూపు/మాట మందగించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. మెదడులో తలెత్తే కణితి క్యాన్సర్‌ అయినా, కాకపోయినా ప్రమాదమే! కణితి ప్రదేశం, పరిమాణాలను బట్టి సర్జరీ లేదా ఇతర చికిత్సలను వైద్యులు ఎంచుకుంటారు. రేడియో సర్జరీతో కూడా కణితిని తొలగించే వీలుంటుంది. 


లింఫోమా!

మెడ, బాహుమూలాలు, గజ్జల్లో లింఫ్‌ గ్రంథుల వాపు, జ్వరం, చలి, ఆకలి తగ్గడం, రాత్రిళ్లు చమటలు, దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. లింఫోమాలో హాడ్కిన్స్‌, నాన్‌ హాడ్కిన్స్‌ అనే రెండు రకాల క్యాన్సర్లు ఉంటాయి. ఎముకలు, కండరాలను కలిపే మృదుకణజాలం క్యాన్సర్లకు సర్జరీ, అవసరాన్ని బట్టి సర్జరీకి ముందు లేదా తర్వాత రేడియో, కీమో థెరపీలు చేయవలసి ఉంటుంది. ఆడ, మగ పిల్లల అండాలు, వృషణాలలో జెర్మ్‌ సెల్‌ ట్యూమర్లు ఎక్కువే! రెండేళ్ల కన్నా తక్కువ వయసున్న పిల్లల్లో అడ్రినల్‌ గ్రంథిలో, మెడ, ఛాతి, పొట్ట, కటిలో కణుతులు (న్యూరో బ్లాస్టోమా) ఎముకలు, టిష్యూలలో (ఈవింగ్‌ సార్కోమా), మూత్రపిండాల్లో కణుతులు (నెఫ్రోబ్లాస్టోమా) క్యాన్సర్లు వస్తాయి. జన్యుసంబంఽధ కారణాలు, పుట్టుకతో వచ్చే లోపాలు పిల్లల్లో క్యాన్సర్‌లకు దారి తీయవచ్చు. కాబట్టి పిల్లలకు పోషకాహారలోపం లేకుండా చూసుకుంటూ, లక్షణాలను సత్వరం గుర్తించి వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి. 


- డాక్టర్‌ మోహన వంశీ

చీఫ్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌,

ఒమేగా హాస్పిటల్స్‌, హైదరాబాద్‌.

ఫోన్‌: 9848011421

Advertisement

పిల్లల సంరక్షణమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...