తాత్కాలిక ఉద్యోగాలకే కంపెనీల ఓటు

ABN , First Publish Date - 2020-10-19T05:50:23+05:30 IST

కొవిడ్‌ పుణ్యమాని ఉద్యోగాల స్వరూపం సమూలంగా మారిపోతోంది. గతంలో వలె కంపెనీలు శాశ్వత

తాత్కాలిక ఉద్యోగాలకే కంపెనీల ఓటు

కొవిడ్‌తో మారుతున్న కొలువుల తీరు


న్యూఢిల్లీ: కొవిడ్‌ పుణ్యమాని ఉద్యోగాల స్వరూపం సమూలంగా మారిపోతోంది. గతంలో వలె కంపెనీలు శాశ్వత ఉద్యోగుల్ని పెద్ద ఎత్తున నియమించుకునేందుకు ఇష్టపడడం లేదు. డిమాండ్‌కు తగ్గట్టు తాత్కాలిక ఉద్యోగుల నియామకానికి మొగ్గు చూపుతున్నాయి. అమెరికా, యూర్‌పలలో ఇలాంటి వారిని ‘గిగ్‌’ ఉద్యోగులుగా పిలుస్తారు.


ఆ దేశాల తీరులోనే పరిశ్రమలు, ఆఫీసుల్లో తాత్కాలిక ఉద్యోగులకు ప్రస్తుతం భారీగా డిమాండ్‌ ఏర్పడింది. గత  6 నెలల్లోనే ఇలాంటి ఉద్యోగుల డిమాండ్‌ గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రెండింతలు పెరిగింది. ఈ ఏడాది మార్చితో పోల్చినా డిమాండ్‌ 12 శాతం పెరిగిందని ప్రముఖ ఆన్‌లైన్‌ జాబ్స్‌ పోర్టల్‌ టీమ్‌లీజ్‌.కామ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కౌసిక్‌ బెనర్జీ చెప్పారు. 


ఈ-కామర్స్‌ కొలువులకి డిమాండ్‌

ఇపుడు దేశ వ్యాప్తంగా పండగల సీజన్‌ నడుస్తోంది. దీంతో ఈ-కామర్స్‌ దిగ్గజాల నుంచి తాత్కాలికంగా పనిచేసే డెలివరీ ఏజెంట్లు, వేర్‌హౌస్‌ హెల్పర్లు, అసెంబ్లీలైన్‌ ఆపరేటర్లకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. డిజైనర్లు, కాంటెంట్‌ రైటర్లు, డిజిటల్‌ మార్కెటీర్లదీ ఇదే పరిస్థితి.

‘ఇంటి నుంచి పని’ (డబ్ల్యుఎ్‌ఫహెచ్‌) విధానం పుణ్యమాని గిగ్‌ ఉద్యోగాల్లో స్త్రీల సంఖ్యా క్రమంగా పెరుగుతోంది. కోవిడ్‌కు ముందు  ఇలాంటి ఉద్యోగాల్లో మహిళల సంఖ్య 12.07 శాతం ఉంటే, గత ఆరు నెలల్లో అది 29.34 శాతానికి చేరింది. 


ప్రతికూలతలు 

ఉద్యోగాలు, జీతాల్లో స్థిరత్వం ఉండదు. 

కనీస వేతనాలు, పని గంటలు, ఓటీ, సెలవులకు చట్టపరమైన భద్రత లేదు. 

శాశ్వత ఉద్యోగులతో పోలిస్తే ఆర్థిక భద్రతా తక్కువే.

కంపెనీలకు మాత్రం జీతాలు, వ్యయాల భారం తగ్గించుకునే అవకాశం.


Updated Date - 2020-10-19T05:50:23+05:30 IST