దళితబంధు యూనిట్ల కుదింపు

ABN , First Publish Date - 2022-09-27T05:23:23+05:30 IST

దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకానికి సంబంధించి రెండో విడత ఇస్తామని ప్రకటించిన యూనిట్లను ప్రభుత్వం తగ్గించింది.

దళితబంధు యూనిట్ల కుదింపు

- రెండో విడతలో నియోజకవర్గానికి 1500 కేటాయింపు

- 500 యూనిట్లకే లబ్ధిదారుల ఎంపిక

- గ్రౌండింగ్‌ పూర్తయిన కొద్దీ దశల వారీగా ఎంపిక

- ఎమ్మెల్యేలపై పెరుగుతున్న ఒత్తిళ్లు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకానికి సంబంధించి రెండో విడత ఇస్తామని ప్రకటించిన యూనిట్లను ప్రభుత్వం తగ్గించింది. మొదటి విడత కింద ప్రతి నియోజకవర్గానికి 100 యూనిట్ల చొప్పున కేటాయించగా, రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 1500 యూనిట్లు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దీంతో అనేక మంది దళితులు పథకంపై ఆశలు పెంచుకున్నారు. గత ఏడాది ఆగస్టు 16వ తేదీన దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ పథకం కింద ఏదైనా యూనిట్‌ ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందేందుకు గానూ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఆ నియోజకవర్గంలో ఉన్న దళిత కుటుంబాలన్నింటికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించింది. ఆ మేరకు అక్కడ యూనిట్లను మంజూరు చేసింది. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రతి నియోజకవర్గానికి 100 యూనిట్లు మంజూరు చేయగా, లబ్ధిదారులను ఎంపిక  చేసి యూనిట్లను గ్రౌండింగ్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాలతో పాటు ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని ధర్మారం మండలానికి 258 యూనిట్లను మంజూరు చేశారు. ఇందులో 254 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 9 లక్షల 90 వేల రూపాయల చొప్పున 25 కోట్ల 14 లక్షల 60 వేల రూపాయలు మంజూరు చేశారు. సెంట్రింగ్‌ యూనిట్లు, టెంట్‌ హౌస్‌లు, మార్బుల్‌, టైల్స్‌ యూనిట్లు, అల్యూమినియం టెండింగ్‌ మిషన్‌, సిమెంట్‌ హార్డ్‌వేర్‌ షాపులు, సిమెంట్‌ స్టీల్‌, ఫొటో స్టూడియోలు, రవాణా రంగానికి సంబంధించి 71 ట్రాక్టర్లు, ఐదు కార్లు, మూడు అశోక్‌ లేలాండ్‌ బడా దోస్త్‌ యూనిట్లను జూలై 29వ తేదీన రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పంపిణీ చేశారు.

- నాలుగు నెలలు గడుస్తున్నా..

రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 1500 యూనిట్లు కేటాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దీంతో అనేక మంది దళితులు ఈ పథకంపై ఆశలు పెట్టుకున్నారు. ఈ యూనిట్లు ప్రకటించి నాలుగు మాసాలు గడస్తున్నా అమలుకు నోచుకోవడం లేదు. ఈ యూనిట్ల విషయంలో ఎమ్మెల్యేలపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతున్నది. అయితే 1500 యూనిట్లకు గాకుండా లబ్ధిదారులను ప్రస్తుతానికి 500 యూనిట్లకే ఎంపిక చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తున్నది. మిగతా యూనిట్లను ఆ తర్వాత ఎంపిక చేయనున్నారని సమాచారం. ఒక్కో నియోజకవర్గానికి 1500 యూనిట్లు కేటాయించడంతో చాలా మంది దళితులు టీఆర్‌ఎస్‌ పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నారు. ఎమ్మెల్యేలను కలిసి దరఖాస్తులను అందజేస్తున్నారు. లబ్ధిదారులను ఎంపిక చేయడం ఎమ్మెల్యేలకు కత్తి మీద సాములా మారింది. ప్రస్తుతం 500 మందిని మాత్రమే ఎంపిక చేయాల్సి ఉంది. అవి గ్రౌండింగ్‌ అయిన తర్వాత మరో 500 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తున్నది. యూనిట్లు తగ్గాయని తెలిసి టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఈ యూనిట్ల విషయంలో తమకు అనుకూలంగా ఉన్న వారిని, అనుచరులను ఎంపిక చేయించేందుకు తంటాలు పడుతున్నారు. ఒకేసారి 1500 యూనిట్లకు లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి వస్తే పని సులువు కానున్నది. దళితుల నుంచి ఎమ్మెల్యేలపై పెద్దగా ఒత్తిడి లేకుండా పోయేది. 


Updated Date - 2022-09-27T05:23:23+05:30 IST