కరోనా దెబ్బకు పెళ్లిళ్లలో భోజనాలు బంద్.. గుళ్లల్లో అన్నదానాలకు కూడా బ్రేక్..!

ABN , First Publish Date - 2021-04-30T17:01:37+05:30 IST

కరోనా దెబ్బకు పెళ్లిళ్లలో భోజనాలు బంద్.. గుళ్లల్లో అన్నదానాలకు కూడా బ్రేక్..!

కరోనా దెబ్బకు పెళ్లిళ్లలో భోజనాలు బంద్.. గుళ్లల్లో అన్నదానాలకు కూడా బ్రేక్..!

కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. ఓ వైపు కరోనా కేసుల సంఖ్యను తగ్గించేందుకు కృషి చేస్తూనే మరో వైపు ఆర్థిక రంగాన్ని కూడా కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. భారత్ లో రోజువారీ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లోనే మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయని అధికారులు తేల్చారు. ఎన్నికల వల్లే ఈ స్థాయిలో కరోనా కేసులు వస్తున్నాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కేసులను కట్టడి చేసేందుకు  నష్ట నివారణ చర్యలు చేపట్టాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాలు రాత్రిళ్లు కర్ఫ్యూను విధిస్తున్నాయి. కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. ఈ నేపథ్యంలోనే ఓ రాష్ట్రం పెళ్లి భోజనాలపై కూడా నిషేధం విధించింది.


హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 96,929గా ఉండగా, 1447 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లోనే ఆ రాష్ట్రంలో 3040 కేసులు నమోదయ్యాయి. దీంతో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గురువారం కీలక ఉత్తర్వులను జారీ చేశారు. పెళ్లిళ్లలోనూ, ఇతర సందర్భాల్లోనూ సామూహిక భోజనాలు చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. గుళ్లల్లోనూ అన్నదానాలు జరుగుతుంటుంటాయి. వీటి వల్ల కూడా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ సామూహిక భోజనాలపై హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది.


 ‘పెళ్లిళ్లు, ఇతర ఏ ఫంక్షన్లలో అయినా సరే సామూహిక భోజనాలు జరగడానికి వీల్లేదు. ఎలాంటి శుభకార్యమయినా, అశుభకార్యమయినా కేవలం 20 మందికి మించి పాల్గొనడానికి వీల్లేదు. అన్ని మతాల గుళ్లల్లోనూ అన్నదానాలపై నిషేధం విధిస్తున్నాం. మే 10వ తారీఖు వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి. అప్పటి పరిస్థితిని బట్టి ఇదే విధానాన్ని పొడిగించాలా? అన్నది నిర్ణయం తీసుకుంటాం.’ అని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ప్రభుత్వం తేల్చిచెప్పింది. మొత్తానికి కరోనా కారణంగా వివాహ భోజనాన్ని ఆస్వాదించాలనుకునేవారి ఆశల్లోనూ నీళ్లు చల్లినట్టయింది. ఇదే సమయంలో మే 10వ తారీఖు వరకు అన్ని విద్యాలయాలను మూసేస్తున్నట్టు ప్రకటించింది. 10, 12 తరగతుల పరీక్షలను కూడా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. 

Updated Date - 2021-04-30T17:01:37+05:30 IST