మత విద్వేషం ఆగేది అప్పుడే : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2022-01-02T22:29:52+05:30 IST

అందరూ కలిసి గళమెత్తినపుడే మహిళలపై మత విద్వేషం,

మత విద్వేషం ఆగేది అప్పుడే : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : అందరూ కలిసి గళమెత్తినపుడే మహిళలపై మత విద్వేషం, అవమానాలు ఆగుతాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. సంవత్సరం మారిందని, పరిస్థితి కూడా మారిందని, ఇక మనం మాట్లాడవలసి ఉందని, ఎటువంటి భయం అక్కర్లేదని అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ట్వీట్ చేశారు. ఢిల్లీలోని ఓ జర్నలిస్టు చేసిన ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో రాహుల్ ఈ ట్వీట్ చేశారు. 


ఢిల్లీకి చెందిన మహిళా జర్నలిస్టు ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, bullibai.github.io వెబ్‌సైట్/పోర్టల్‌లో తన ఫొటో మార్ఫింగ్ చేసి పెట్టారని ఆరోపించారు. ఈ కల్పిత ఫొటోను అత్యంత అభ్యంతరకరంగా, ఆమోదయోగ్యం కాని రీతిలో, అసభ్యకరమైన సందర్భంలో పెట్టారని తెలిపారు. స్వతంత్రంగా పని చేసే మహిళలు, జర్నలిస్టులను వేధించడానికే ఇటువంటి పనులు చేస్తున్నారని ఆరోపించారు. 


ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ, మహిళా జర్నలిస్టు ఫిర్యాదు మేరకు శనివారం రాత్రి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మహిళల గౌరవ, మర్యాదలకు భంగం కలిగించడం, అవమానించడం, లైంగిక వేధింపులు వంటివాటికి సంబంధించిన భారత శిక్షా స్మృతిలోని నిబంధనల ప్రకారం ఈ కేసు నమోదు చేశామన్నారు. bullibai.github.io వెబ్‌సైట్/పోర్టల్‌లోని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తనను టార్గెట్ చేశారని ఆమె ఆరోపించారని తెలిపారు. ఈ ఫిర్యాదుపై దర్యాప్తు జరుగుతోందని, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని చెప్పారు. 


ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, bullibai.github.io వెబ్‌సైట్/పోర్టల్‌ను బ్లాక్ చేసినట్లు తెలిపారు. తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ పోర్టల్‌ను బ్లాక్ చేసినట్లు GitHub ధ్రువీకరించిందన్నారు. తదుపరి చర్యల కోసం పోలీసులు, ఇతర వ్యవస్థలతో సమన్వయంతో పని చేస్తున్నారని చెప్పారు. 


Updated Date - 2022-01-02T22:29:52+05:30 IST