అంచనాలకు మించి..!

ABN , First Publish Date - 2022-08-10T05:57:24+05:30 IST

కామన్వెల్త్‌ క్రీడల నుంచి షూటింగ్‌ను తొలగించడంతో.. పతకాల పట్టికలో భారత్‌ టాప్‌-5లో నిలవడం కష్టమేననే భావన నెలకొంది.

అంచనాలకు మించి..!

కామన్వెల్త్‌లో అదరగొట్టిన భారత్‌

ముగింపు వేడుకల్లో 

నిఖత్‌ జరీన్‌-శరత్‌ కమల్‌

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ క్రీడల నుంచి షూటింగ్‌ను తొలగించడంతో.. పతకాల పట్టికలో భారత్‌ టాప్‌-5లో నిలవడం కష్టమేననే భావన నెలకొంది. కానీ, అథ్లెటిక్స్‌, లాన్‌బౌల్స్‌లో అనూహ్యంగా పతకాలు నెగ్గడంతో.. బర్మింగ్‌హామ్‌ క్రీడలను భారత్‌ నాలుగో స్థానంతో ముగించింది. 2018 గోల్డ్‌కోస్ట్‌ క్రీడల్లో మనకు 66 పతకాలు లభిస్తే.. అందులో 25 శాతం షూటింగ్‌ విభాగం నుంచి వచ్చినవే..! ఈ నేపథ్యంలో మొత్తం 50 పతకాలు లభిస్తే గొప్ప అని అనుకొంటే.. ఏకంగా 61 (22 స్వర్ణ, 16 రజత, 23 కాంస్య) మెడల్స్‌ రావడం విశేషం. గతంలో ఎన్నడూ లేనివిధంగా విదేశాల్లో జరిగిన ఈవెంట్‌లో ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్స్‌లో భారత్‌ 8 పతకాలు నెగ్గడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. ట్రిపుల్‌ జంప్‌లో ఎల్దోస్‌ పాల్‌, అబ్దుల్లా అబూబకర్‌ స్వర్ణ, రజతాలు గెలవడం చిరస్మరణీయం.


3000 మీ. స్టీపుల్‌చేజ్‌లో అవినాష్‌ సబ్లే (రజతం), హైజంప్‌లో తేజస్విన్‌ శంకర్‌ (కాంస్యం) ఆయా విభాగాల్లో దేశానికి తొలి పతకాలు అందించగా.. 1978 తర్వాత లాంగ్‌ జంప్‌లో మురళీ శ్రీశంకర్‌ (రజతం) మెడల్‌ నెగ్గాడు. ఇక, జావెలిన్‌ త్రో కాంస్యంతో అన్నూరాణి రికార్డుల్లోకెక్కగా.. ప్రియాంక గోస్వామి, సందీప్‌ కుమార్‌ రేస్‌ వాక్‌లో పతకాలతో మెరిశారు. క్రీడల ఆరంభానికి ముందు ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్స్‌లో మనకు 7 మెడల్స్‌ దక్కే అవకాశం ఉందని మాజీ అథ్లెట్‌ అంజూ బాబీ జార్జ్‌ అంచనా వేయగా.. ఒలింపిక్‌ చాంప్‌ నీరజ్‌ చోప్రా గైర్హాజరీలోనూ 8 పతకాలు సొంతం కావడం గమనార్హం. 


స్వర్ణాల ‘పట్టు’ పట్టారు

 రెజ్లింగ్‌లో మనోళ్ల హవా కొనసాగింది. అత్యధికంగా 6 స్వర్ణాలు సహా 12 పతకాలు ఈ విభాగం నుంచే లభించాయి. ఒలింపిక్‌ పతక విజేత రవి దహియా, బజరంగ్‌ పూనియాలు పూర్తి ఆధిపత్యంతో పసిడి పట్టు పడితే.. గత కొంతకాలంగా ఫామ్‌ కోసం తంటాలు పడుతున్న సాక్షి మాలిక్‌, వినేష్‌ ఫొగట్‌ స్వర్ణాలతో పునరాగమనం చేశారు. జూడోలో రజతం సహా మూడు పతకాలు దక్కగా.. టేబుల్‌ టెన్ని్‌సలో మన ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేశారు. 16 ఏళ్లపాటు కామన్వెల్త్‌ స్వర్ణం కోసం ఎదురుచూసిన టీటీ స్టార్‌ శరత్‌ కమల్‌ ఆచంట ఏకంగా 3 స్వర్ణాలు సహా 4 పతకాలు కొల్లగొట్టగా.. పారా ప్లేయర్‌ భవీనా పటేల్‌ బంగారు పతకం నెగ్గింది. ఏస్‌ షట్లర్‌ పీవీ సింధు పసిడి కల నెరవేరగా.. యువ కెరటం లక్ష్య సేన్‌ గోల్డ్‌తో అదరగొట్టడంతో బ్యాడ్మింటన్‌లో మూడు బంగారు పతకాలు లభించాయి. ఇక, బాక్సింగ్‌లో నిఖత్‌ జరీన్‌, నీతూ, అమిత్‌ పంగల్‌ స్వర్ణ పంచ్‌లు విసరగా.. మహిళ క్రికెట్‌లో హర్మన్‌సేన కొద్దిలో పసిడి చేజార్చుకుంది. 2006 తర్వాత మహిళల హాకీ జట్టు తొలి పతకం (కాంస్యం) నెగ్గడం ఊరటనిచ్చే అంశం కాగా.. పురుషుల హాకీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా చిత్తుగా ఓడడం మాత్రం తీవ్రంగా నిరాశపర్చింది.


ఆరు రోజులపాటు వరుసగా మ్యాచ్‌లు ఆడిన భారత షటర్లు 3 స్వర్ణాలు సహా 6 పతకాలు అందించారు. ఇక లక్ష్య సేన్‌ విషయంలో ఐస్‌ బాత్‌ బాగా పని చేసింది. ఆహారం విషయంలో కూడా ఎంతో శ్రద్ధ వహించేవారు. ప్రముఖ రెస్టారెంట్‌ నుంచి ఆర్డర్‌ చేసిన గ్రిల్‌ చికెన్‌, బంగాళదుంపలు సేన్‌కు ఇచ్చేవారు. ఇక, డబుల్స్‌ ఆటగాడు సాత్విక్‌ సాయిరాజ్‌ కోసం అతడి సోదరుడు అన్నం, పప్పు వండిపెట్టేవాడు. అతడి పార్ట్‌నర్‌ చిరాగ్‌కు ప్రత్యేకంగా తయారు చేసిన మటన్‌ పులుసు ఎంతో ఉపయోగపడింది. క్వార్టర్స్‌ మ్యాచ్‌ తర్వాత సింధును మడమ నొప్పి తీవ్రంగా బాధించింది. కానీ, మసాజ్‌, హైడ్రో థెరపీలతో కోలుకొనేలా కోచ్‌ ప్రయత్నించాడు. 


లాన్‌ బౌల్స్‌లో అదరహో..

పెద్దగా పరిచయం లేని లాన్‌ బౌల్స్‌లో లవ్లీ చౌబే, పింకీ, రూపా రాణి, నయన్‌మోనీ సైకియాలతో కూడిన మహిళల జట్టు పసిడితో చరిత్ర సృష్టించింది. కామన్వెల్త్‌ క్రీడల్లో ఈ విభాగంలో ఎన్నడూ పతకం నెగ్గని భారత్‌.. ఏకంగా స్వర్ణా న్ని ఎగరేసుకు పోయింది. నలుగురు సభ్యుల పురుషుల జట్టు కూడా ఫైనల్‌ చేరి రజతంతో సరిపెట్టుకొంది. 

Updated Date - 2022-08-10T05:57:24+05:30 IST