పతకాలు తగ్గినా..

ABN , First Publish Date - 2022-08-09T09:59:51+05:30 IST

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ మెరుగైన ప్రదర్శన చేసింది. మొత్తం 61 (22 స్వర్ణ, 16 రజత, 23 కాంస్య) మెడల్స్‌ సాధించి..

పతకాలు తగ్గినా..

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ మెరుగైన ప్రదర్శన చేసింది. మొత్తం 61 (22 స్వర్ణ, 16 రజత, 23 కాంస్య) మెడల్స్‌ సాధించి.. పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా 178 (67-57-54) మెడల్స్‌తో టాప్‌ లేపగా.. ఇంగ్లండ్‌ 176 (57-66-53), కెనడా 92 (26-32-34) పతకాలతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. 2018 గోల్డ్‌కోస్ట్‌ క్రీడల్లో భారత్‌ 26 స్వర్ణాలు సహా 66 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. అయితే, బర్మింగ్‌హామ్‌ క్రీడల్లో షూటింగ్‌ను తప్పించడం.. కొంత ప్రభావం చూపింది. కానీ, అథ్లెటిక్స్‌, లాన్‌ బౌల్స్‌లో సాధించిన పతకాలు దేశంలో పెరుగుతున్న క్రీడా సంస్కృతికి అద్దం పడుతున్నాయి. రెజ్లర్లు అత్యధికంగా 6 స్వర్ణాలు సహా 12 పతకాలు పట్టేయగా.. వెయిట్‌ లిఫ్టర్లు 10 (3 స్వర్ణ, 3 రజత, 4 కాంస్య) మెడల్స్‌ అందించాడు.


సింగిల్స్‌లో 16 ఏళ్లపాటు స్వర్ణం కోసం ఎదురు చూసిన టీటీ ప్లేయర్‌ శరత్‌ కమల్‌.. ఏకంగా ‘ట్రిపుల్‌’ ధమాకా సృష్టించగా.. ఏస్‌ షట్లర్‌ సింధు తొలి కామన్వెల్త్‌ స్వర్ణంతో మెరిసింది. ఓవరాల్‌గా బ్యాడ్మింటన్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా 3 స్వర్ణాలు సహా 6 పతకాలు దక్కితే.. టీటీలో 4 బంగారు పతకాలు సొంతమయ్యాయి. కాగా, అథ్లెటిక్స్‌లో స్వర్ణం సహా 8 పతకాలు రావడం హైలైట్‌. ట్రిపుల్‌ జంప్‌లో స్వర్ణ, రజతాలు మనవాళ్లకే దక్కగా.. తొలిసారిగా ప్రవేశపెట్టిన మహిళల క్రికెట్‌లో టీమిండియా వెండి పతకంతో మురిసింది. క్రీడల చరిత్రలోనే తొలిసారి లాన్‌ బౌల్స్‌లో స్వర్ణ, రజతాలు లభించాయి. బాక్సింగ్‌లో నిఖత్‌ జరీన్‌, నీతూ, అమిత్‌ పంగల్‌ పసిడి పంచ్‌లతో విసరగా.. మొత్తం 7 పతకాలు వచ్చాయి. అయితే, పురుషుల హకీ జట్టు ఫైనల్లో చిత్తుగా ఓడడం నిరాశపర్చినా.. మహిళలు కాంస్యంతో తళుక్కుమన్నారు. జిమ్నాస్టిక్స్‌, సైక్లింగ్‌, స్విమ్మింగ్‌, ట్రయథ్లాన్‌లో మనం అసలు ఖాతా తెరవలేక పోవడం దృష్టి సారించాల్సిన అంశం.          

         (ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

Updated Date - 2022-08-09T09:59:51+05:30 IST