కోర్టు మెట్లెక్కి.. వ్యవస్థలతో పోరాడి..

ABN , First Publish Date - 2022-08-05T06:26:34+05:30 IST

తేజస్విన్‌ శంకర్‌.. కామన్వెల్త్‌ క్రీడల హైజంప్‌లో దేశానికి తొలి పతకం అందించిన అథ్లెట్‌.

కోర్టు మెట్లెక్కి.. వ్యవస్థలతో పోరాడి..

ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం: తేజస్విన్‌ శంకర్‌.. కామన్వెల్త్‌ క్రీడల హైజంప్‌లో దేశానికి తొలి పతకం అందించిన అథ్లెట్‌. అయితే, ఇది అతడికి అంత సులభంగా దక్కలేదు. అందుకోసం ఎన్నో కష్టాలకు ఓర్చాడు.. కోర్టు మెట్లెక్కాడు.. వ్యవస్థలతో పోరాడాడు. అసలు పోటీల్లో పాల్గొనే అవకాశం వస్తుందో? లేదో? అనే డోలాయమాన స్థితి నుంచి.. కాంస్య పతకం సాధించడం అద్భుతం. 


నిద్రలేని రాత్రులు..

తొలుత కామన్వెల్త్‌కు ఎంపిక చేసిన 36 మంది ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్ల జాబితాలో తేజస్విన్‌కు చోటు దక్కలేదు. అమెరికాలో ఈవెంట్‌లో పాల్గొనాల్సి రావడంతో.. చెన్నైలో జరిగిన ఇంటర్‌-స్టేట్‌ మీట్‌లో బరిలోకి దిగలేక పోయాడు. కామన్వెల్త్‌ అర్హత మార్క్‌ 2.27 మీటర్లు సాధించినా.. ఎంపిక చేయకపోవడం శంకర్‌ను బాధించింది. దీంతో భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎ్‌ఫఐ)పై కోర్టులో కేసు వేశాడు. ఈ సమయంలో అతడు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. ఆ తర్వాత కోటా పెంచితే తేజస్విన్‌కు అవకాశం ఇస్తామని ఏఎఫ్‌ఐ తెలిపింది. అయితే, మరో అథ్లెట్‌ ఆరోకియా రాజ్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌లో విఫలమవడం తేజస్విన్‌కు మార్గం సుగమం చేసింది.


కానీ, అప్పటికే ఆలస్యమైందనే సాకుతో కామన్వెల్త్‌ ఫెడరేషన్‌ అతడి పేరును జాబితాలో చేర్చడానికి అనుమతించలేదు. కానీ, ఇద్దరు భారత అథ్లెట్లు డోపింగ్‌లో దొరికిపోవడంతో.. శంకర్‌ను అదృష్టం వరించింది. ఈ అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్న శంకర్‌.. పతకంతో సత్తా చాటాడు. తన శ్రమ, మానసిక సంఘర్షణకు తగిన ఫలితం లభించిందనే ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. 


క్రికెట్‌ నుంచి హైజంప్‌నకు

ఢిల్లీకి చెందిన తేజస్విన్‌.. చిన్నప్పుడు క్రికెట్‌ ఎక్కువగా ఆడేవాడు. ఎనిమిదో తరగతిలో పీటీ మాస్టర్‌.. హైజం్‌పనకు మారాలని సలహా ఇవ్వడంతో అటుగా ప్రయత్నించి విజయవంతమయ్యాడు. తేజస్విన్‌ తండ్రి హరిశంకర్‌ కేన్సర్‌తో మరణించినా.. తల్లి లక్ష్మి అన్నీ తానై పెంచిపెద్ద చేసి కుమారుడి కెరీర్‌ ఎదుగుదలలో ముఖ్య పాత్ర పోషించింది. 2015 కామన్వెల్త్‌ యూత్‌ గేమ్స్‌లో తేజస్విన్‌ స్వర్ణం నెగ్గగా.. 2016 దక్షిణాసియా క్రీడల్లో రజతం సాధించాడు. 17 ఏళ్ల వయసులో జాతీయ రికార్డు నెలకొల్పిన శంకర్‌.. ఐఏఏఎఫ్‌ జూనియర్స్‌లో ముగ్గురు టాప్‌ హైజంపర్లలో ఒకడిగా నిలిచాడు. 2017లో యూఎ్‌సలోని కాన్సస్‌ స్టేట్‌ యూనివర్సిటీ నుంచి అథ్లెటిక్స్‌ స్కాలర్‌పిఫ్‌ లభించడంతో.. అక్కడ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ చదువుతున్నాడు.


2018 కామన్వెల్త్‌ క్రీడల్లో ఆరో స్థానంలో నిలిచాడు. ఈసారి మాత్రం టోర్నీలో పాల్గొనేందుకే ఎన్నో ఆటంకాలు ఎదురైనా.. వాటన్నింటిని అధిగమించి ఏకంగా పతకంతో తిరిగొచ్చాడు. కాగా.. వచ్చే ఏడాది జరిగే ఆసియా క్రీడల్లో డెకాథ్లాన్‌లో బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తానన్నాడు. ఒకవేళ ఆ విభాగంలో బెర్త్‌ దక్కకపోయినా.. తాను మాత్రం డెకాథ్లాన్‌ ఈవెంట్లు ప్రాక్టీస్‌ చేస్తానని తేజస్విన్‌ చెప్పాడు. 

Updated Date - 2022-08-05T06:26:34+05:30 IST