మువ్వన్నెలు మురిసేనా?

ABN , First Publish Date - 2022-07-28T10:19:48+05:30 IST

రెండు దశాబ్దాలలో యూకే మూడోసారి కామన్వెల్త్‌ క్రీడలకు ఆతిథ్యమిస్తోంది. 56 దేశాలతో కూడిన కామన్వెల్త్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (సీజీఎ్‌ఫ)లో తొలుత డర్బన్‌ (సౌతాఫ్రికా) ఆతిథ్య బిడ్డింగ్‌ దక్కించుకొంది. కానీ ఆర్థిక కారణాలతో 2017లో

మువ్వన్నెలు మురిసేనా?

నేటినుంచే కామన్వెల్త్‌ క్రీడలు

భారత్‌ నుంచి 205 మంది అథ్లెట్లు

ప్రారంభోత్సవం రాత్రి 11 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో 


ఏడాదిలో మరో క్రీడా సంరంభానికి తెరలేవనుంది. గత సంవత్సరం ఇదే  సమయాన టోక్యోలో ఒలింపిక్స్‌ జరగగా..ఈ సంవత్సరం ఆ స్థాయిలో  కాకపోయినా బ్రిటిష్‌ పాలనలోని దేశాలు తలపడే కామన్వెల్త్‌ క్రీడలు గురువారం బర్మింగ్‌హామ్‌లో మొదలవనున్నాయి. 


యువరాజు చార్లెస్‌  గేమ్స్‌ను ప్రారంభిస్తారు. అనంతరం ఆయన రాణి ఎలిజిబెత్‌ సందేశాన్ని చదువుతారు. ఆరంభ వేడుకలకు అలెగ్జాండర్‌ స్టేడియం వేదిక కానుంది. బర్మింగ్‌హామ్‌ గొప్పదనాన్ని చాటిచెప్పేలా ప్రారంభ వేడుకలను తీర్చిదిద్దారు. స్థానిక న్యూవేవ్‌, డ్యూరాన్‌, డ్యూరాన్‌ బ్యాండ్‌, బ్రిటిష్‌ గిటారిస్ట్‌ టోనీ లోమి, ఇంగ్లిష్‌ రాక్‌ బ్యాండ్‌ బ్లాక్‌ సబ్బత్‌, బ్రిటన్‌ జాజ్‌ ప్లేయర్‌ సొవెట్‌ తమ కార్యక్రమాలతో ఉర్రూతలూగించనున్నారు.


బర్మింగ్‌హామ్‌: రెండు దశాబ్దాలలో యూకే మూడోసారి కామన్వెల్త్‌ క్రీడలకు ఆతిథ్యమిస్తోంది. 56 దేశాలతో కూడిన కామన్వెల్త్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (సీజీఎ్‌ఫ)లో తొలుత డర్బన్‌ (సౌతాఫ్రికా) ఆతిథ్య బిడ్డింగ్‌ దక్కించుకొంది. కానీ ఆర్థిక కారణాలతో 2017లో డర్బన్‌ వైదొలగడంతో యూకే బిడ్‌ దాఖలు చేసి.. నిర్వహణను హక్కులను కైవసం చేసుకుంది.  2012 లండన్‌ ఒలింపిక్స్‌ తర్వాత మరో ఖరీదైన, భారీస్థాయి క్రీడోత్సవానికి యూకే సిద్ధమైంది. కొవిడ్‌ దరిమిలా ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో ఈ క్రీడలకు ఇప్పటివరకు రూ. 7485  కోట్లు ఖర్చు అయినట్టు అంచనా. 


  ఐదువేల మంది అథ్లెట్లు..

వచ్చేనెల 8వరకు 11 రోజులపాటు జరిగే ఈ క్రీడా పండుగలో 20 క్రీడల్లో 72 జట్ల నుంచి ఐదువేల మందికిపైగా అథ్లెట్లు తలపడుతున్నారు. 


    ఈసారి కొత్తగా..

మహిళల టీ20 క్రికెట్‌, బాస్కెట్‌బాల్‌ 3-3, వీల్‌చైర్‌ బాస్కెట్‌బాల్‌ 3-3, మిక్స్‌డ్‌ సింక్రనైజ్డ్‌ డైవింగ్‌ను ప్రవేశపెట్టారు. 


   భారత్‌ టాప్‌-5లో నిలిచేనా?

ఈసారి క్రీడల పతకాల పట్టికలో భారత్‌ తొలి ఐదు స్థానాల్లో ఉండడం అనుమానమే. ఎందుకంటే..ఈసారి గేమ్స్‌నుంచి షూటింగ్‌ను తప్పించడం. 2002 నుంచి భారత్‌ టాప్‌-5లో నిలుస్తోంది. ఇందుకు ప్రధానం కారణం షూటింగే. దాంతో ఈసారి గేమ్స్‌ నుంచి ఆ క్రీడను తప్పించడంతో పెద్ద వివాదమే రేగింది. నాలుగేళ్ల కిందట గోల్డ్‌కో్‌స్టలో జరిగిన కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ సాధించిన మొత్తం 66 పతకాలలో 25 శాతం షూటింగ్‌ నుంచి వచ్చినవే. షూటర్లు ఏడు స్వర్ణ పతకాలు కైవసం చేసుకోవడం విశేషం. దాంతో షూటింగ్‌ స్థానాన్ని భారత్‌ ఎలా భర్తీ చేస్తుందో చూడాలి. వెయిట్‌లిఫ్టింగ్‌, బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌, రెజ్లింగ్‌, టీటీల ద్వారా ఆ లోటు భర్తీ చేయగలమని భావిస్తోంది. ఇక..75 ఏళ్ల కామన్వెల్త్‌ క్రీడల చరిత్రలో అథ్లెటిక్స్‌లో భారత్‌ ఇప్పటివరకు గెలిచింది 28 పతకాలే. చివరి నిమిషంలో స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా వైదొలగడం భారత్‌కు గట్టి ఎదురు దెబ్బే. అయినా..అథ్లెటిక్స్‌లో మనోళ్లు డార్క్‌హార్స్‌గా బరిలో దిగుతున్నారు. డోప్‌ టెస్ట్‌ల్లో పట్టుపడడంతో ధనలక్ష్మి, ఐశ్వర్య బాబు 36 మంది అథ్లెటిక్స్‌ జట్టునుంచి వైదొలిగారు. 


ఇవీ మన అంచనాలు..

12మంది తలపడుతున్న రెజ్లింగ్‌ నుంచి భారత్‌ భారీగా స్వర్ణ పతకాలు ఆశిస్తోంది. డిఫెండింగ్‌ చాంపియన్లు వినేశ్‌ ఫొగట్‌, బజ్‌రంగ్‌ పూనియా మరోసారి టైటిళ్లు నిలబెట్టుకునే చాన్సుంది. గోల్డ్‌కోస్ట్‌లో ఐదు స్వర్ణాలు సహా రెజ్లర్లు 12 పతకాలు అందుకున్నారు. ఐదు పసిడి సహా 9 పతకాలను వెయిట్‌లిఫ్టర్లు గెలిచారు. ఒలింపిక్స్‌ రజత పతక విజేత మీరాబాయ్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగానికి నాయకత్వం వహిస్తోంది. తెలుగు తేజం పీవీ సింధు సారథ్యంలోని షట్లర్లు మహిళలు, పురుషుల సింగిల్స్‌, పురుషుల డబుల్స్‌, మిక్స్‌డ్‌లో పతకాలు సాధిస్తారని విశ్వాసం. హాకీలో పురుషులు, మహిళల జట్లు టాప్‌-3లో ఉండొచ్చు. గోల్డ్‌కో్‌స్టలో మన టీటీ క్రీడాకారులు పతకాలతో దుమ్ము రేపారు. 8 పతకాలు సాధిస్తే..అందులో నాలుగు మనికా బాత్రా గెలిచినవే కావడం విశేషం. ఈసారి అన్ని పతకాలపై ఆశలు లేకున్నా..కనీసం రెండు స్వర్ణాలు గెలుస్తారని భావిస్తున్నారు. నాలుగేళ్ల కిందట తొమ్మిది పతకాలు సాధించిన బాక్సర్లు ఈసారి అదే స్థాయిలో సత్తా చాటతారని అంచనా వేస్తున్నారు. స్క్వాష్‌లో మిక్స్‌డ్‌, మహిళల డబుల్స్‌లో రెండు పతకాలు వస్తాయని అంచనా.


పతాకధారి.. సింధు

స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు కామన్వెల్త్‌ క్రీడల ప్రారంభ వేడుకల్లో భారత జట్టును ముందుండి నడిపించనుంది. ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా వేడుకల్లో ఫ్లాగ్‌బేరర్‌గా వ్యవహరించాలి. అయితే, గతవారం ప్రపంచ చాంపియన్‌షి్‌పలో  నీరజ్‌ గాయపడ్డాడు. దీంతో అతను కామన్వెల్త్‌ పోటీలకు దూరమవుతున్నట్టు ప్రకటించడంతో.. సింధుకు ఆ గౌరవం దక్కింది. టోక్యో ఒలింపిక్స్‌ పతక విజేతలైన లిఫ్టర్‌ మీరాబాయి చాను, బాక్సర్‌ లవ్లీనా బోర్గొహైన్‌ పేర్లను కూడా పరిశీలించినప్పటికీ.. విశ్వక్రీడల్లో రెండుసార్లు పతకం సాధించడంతో సింధు పేరునే పరిగణనలోకి తీసుకున్నామని ఐఓఏ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా.. గత క్రీడల్లోనూ సింధు పతాకధారిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.  


1875  ఈ క్రీడల్లో అథ్లెట్లకు అందజేయనున్న మొత్తం పతకాలు. 283 మెడల్‌ ఈవెంట్లలో కలిపి ఈ పతకాలను అందజేస్తారు.


 7485 కోట్లు  ఈ క్రీడల కోసం ఇంగ్లండ్‌ వెచ్చించిన ఖర్చు


503 ఈ క్రీడల్లో ఇప్పటిదాకా భారత్‌ సాధించిన మొత్తం పతకాలు. ఇందులో 181 స్వర్ణాలు, 173 రజతాలు, 149 కాంస్యాలున్నాయి. భారత్‌ అత్యుత్తమంగా 2010 ఢిల్లీ క్రీడల్లో 101 (38 స్వర్ణాలు) పతకాలతో రెండోస్థానంలో నిలిచింది. 2018 టోర్నమెంట్‌లో 26 పసిడి సహా 66 పతకాలు గెలుచుకుంది.


15 పోటీల కోసం ఆతిథ్యమిస్తున్న వేదికల సంఖ్య

Updated Date - 2022-07-28T10:19:48+05:30 IST