వచ్చే ఏడాదికి సాధారణ జలుబులా కొవిడ్‌

ABN , First Publish Date - 2021-11-13T08:48:08+05:30 IST

‘‘వచ్చే ఏడాది నాటికి పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయి. కొవిడ్‌ సాధారణ జలుబులా మారుతుంది’’ అని ఏఐజీ (ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ) ఆస్పత్రుల చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి అన్నారు.

వచ్చే ఏడాదికి సాధారణ జలుబులా కొవిడ్‌

  • మొదట్లో ఈ ముప్పును ఎదుర్కోవడమెలానో తెలియలేదు
  • కొవిడ్‌ మాకు గురువు.. పాఠాలు నేర్పింది
  • ఏఐజీ చైర్మన్‌ నాగేశ్వర్‌ రెడ్డి వ్యాఖ్యలు
  • మశూచి, పోలియో అంతానికీ టైం పట్టింది 
  • కొవిడ్‌కు కూడా కొంతసమయం అవసరం
  • ఐఐపీహెచ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జీవీఎస్‌ మూర్తి


హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి): ‘‘వచ్చే ఏడాది నాటికి పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయి. కొవిడ్‌ సాధారణ జలుబులా మారుతుంది’’ అని ఏఐజీ (ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ) ఆస్పత్రుల చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి అన్నారు. కొవిడ్‌ ఒక విషాదం కాదని.. అది ఒక గురువులా పాఠాలు నేర్పిందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో శుక్రవారం ఆయన ‘పబ్లిక్‌ హెల్త్‌ ఇన్నోవేషన్స్‌ కాన్‌క్లేవ్‌ (పీహెచ్‌ఐసీ) ఎక్స్‌పో’ను ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఆయన.. కరోనా గురించి ప్రస్తావించారు.  వైద్యులు ప్రతి రోజు మరణాలను చూస్తుంటారని.. కానీ, కొవిడ్‌ సమయంలో చూసింది వేరని అన్నారు. కొన్ని చోట్ల కొవిడ్‌ దెబ్బకు మొత్తం కుటుంబాలే తుడిచిపెట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మొదట్లో కొవిడ్‌ను ఎలా ఎదుర్కోవాలో వైద్యులకే తెలియని పరిస్థితి నెలకొందని గుర్తుచేశారు. ‘‘అప్పట్లో మేం చాలా భయపడ్డాం, మా పరిస్థితి ఆయుధాలు లేకుండా యుద్ధానికి వెళ్లే సైనికుడిలా ఉండేది. దానికి తోడు డబ్ల్యూహెచ్‌వో అంచనాలు, మన వాతావరణ అంచనాల్లాగా ఉండేవి. చేతుల పరిశుభ్రత కంటే మాస్క్‌, భౌతిక దూరం చాలా ముఖ్యమైనవని అనుభవంతో గుర్తించాం. రెండేళ్లలో ఏఐజీ ఆస్పత్రిలో 30 వేల మంది కొవిడ్‌ రోగులకు చికిత్స అందించాం.’’ అని వివరించారు. కాగా.. మహమ్మారి తర్వాత జీవితం ఇప్పటికీ అనూహ్యంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కంట్రీ ఆఫీసర్‌ ఫర్‌ ఇండియా డాక్టర్‌ అనూజ్‌శర్మ పేర్కొన్నారు. ఆరంభంలో తాము చేసిన సిఫారసులు కొన్ని తప్పుగా ఉన్నాయని ఒప్పుకొన్న ఆయన.. వాటిని తాము సొంతంగా చేయలేదని, నిపుణుల సలహాలు, సూచనల ఆధారంగానే తాము వ్యవహరించినట్లు చెప్పారు.


ఇక.. వైద్య రంగంలో కొత్త విధానాలను కనుగొనే అవకాశాన్ని కొవిడ్‌ తమకు ఇచ్చిందని ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌ అకాడమీ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ డాక్టర్‌ రంగారెడ్డి అన్నారు. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో ఆక్సిజన్‌ పైప్‌లైన్‌లను ఏర్పాటు చేసినట్లు ఐపీఎం డైరెక్టర్‌ డాక్టర్‌ శంకర్‌ చెప్పారు. వైర్‌సవల్ల మృత్యువాత పడకుండా టీకాలు రక్షిస్తాయని.. 2022 నాటికి మనకు సాధారణ జీవితం ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఇక.. గత పీహెచ్‌సీ సదస్సులో మాట్లాడే సమయంలో మాస్కు తీయడానికి సంకోచించానని, కానీ ఇప్పుడు మాస్కు తీసి మాట్లాడగలుగుతున్నానని, గత ఏడాదికి, ఈ ఏడాదికి వచ్చిన మార్పు ఇదని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (ఐఐపీహెచ్‌) డైరెక్టర్‌ డాక్టర్‌ జీవీఎస్‌ మూర్తి పేర్కొన్నారు. ప్రజారోగ్యానికి ఇంక్యుబేషన్‌ సమయం కావాలని.. మశూచి, పోలియో అదృశ్యం కావడానికి కొంత సమయం పట్టిందని, కొవిడ్‌కి కూడా అలాంటి సమయం అవసరమని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - 2021-11-13T08:48:08+05:30 IST