అంగనవాడీల అభివృద్ధిలో కమిటీలు కీలకం

ABN , First Publish Date - 2021-04-17T06:21:35+05:30 IST

అంగనవాడీ కేంద్రాల అభివృద్ధికి కమిటీలు ఎంతగానో దోహదపడాలని మున్సిపల్‌ చైర్‌పర్సన ఇంద్రజ పేర్కొన్నారు.

అంగనవాడీల అభివృద్ధిలో కమిటీలు కీలకం
కార్యక్రమంలో మాట్లాడుతున్న చైర్‌పర్సన ఇంద్రజ

-మున్సిపల్‌ చైర్‌పర్సన ఇంద్రజ 

హిందూపురం టౌన, ఏప్రిల్‌ 16: అంగనవాడీ కేంద్రాల అభివృద్ధికి కమిటీలు ఎంతగానో దోహదపడాలని మున్సిపల్‌ చైర్‌పర్సన ఇంద్రజ పేర్కొన్నారు. శుక్రవారం పూలకుంటలోని ఐసీడీఎస్‌ కార్యాలయంలో సీడీపీఓ నాగమల్లీశ్వరి ఆధ్వర్యంలో మన అంగనవాడీ నాడు నేడు కార్యక్రమంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. దీనికి చైర్‌పర్సనతోపాటు మునిసిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్‌రావులు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ అంగనవాడీ అభివృద్ధికి కలిసికట్టుగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఇందులో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌, మహిళా పోలీసు, ఇంజనీర్‌, అంగనవాడీ వర్కర్‌, చిన్నపిల్లల తల్లులు ముగ్గురు మొత్తం ఏడు మంది కమిటీలో ఉంటారన్నారు. చిన్నారులను అంగనవాడీలకు పంపించి బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్లు, అంగనవాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా వెలుగు కార్యాలయంలో 10 అంగనవాడీ కమిటీలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీఓ శ్రీనివాసులు, కౌన్సిలర్‌ మారుతిరెడ్డి, సీఆర్‌పీ సురేష్‌, ఏఈ సునీత, సూపర్‌వైజర్‌ లలిత, కమిటీ సభ్యులు హాజరయ్యారు. 

గోరంట్ల: మండలంలోని 9 అంగనవాడీ కేంద్రాలకు నూతన భవనాలు, ఐదు కేంద్రాల్లో భవనాల మరమ్మతులకు నిధులు మంజూరైనట్లు ఐసీడీఎస్‌ ఏసీడీపీఓ గాయత్రి తెలిపారు. మందలపల్లి-2, కల్లితండా, గోరంట్ల -5, కాగానిపల్లి, కరావులపల్లి, పుట్టగుండ్లపల్లి తండా, గుంతపల్లి, గౌనివారిపల్లి అంగనవాడీ నూతన భవనాల మరమ్మతుల కోసం ఆర్‌ఐడీఎఫ్‌ ద్వారా రూ.12లక్షల వంతున నిధులు మంజూరైనట్లు తెలిపారు. అలాగే కరావులపల్లి తండా-1, పులేరు, వానవోలు-1, పాలసముద్రం, కమ్మవారిపల్లి గ్రామాల్లోని అంగనవాడీ భవనాల మరమ్మతుల కోసం రూ.5లక్షల వంతున నిధులు కేటాయించారు. ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓ గాయత్రి, హౌసింగ్‌ ఏఈ కులచంద్రారెడ్డి, అంగనవాడీ సూపర్‌వైజర్లు సుశీలా,సౌభాగ్యవతి, వజియకుమారి, కమిటీసభ్యులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-17T06:21:35+05:30 IST