విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ABN , First Publish Date - 2021-06-24T05:41:57+05:30 IST

పట్టణ ప్రణాళికా విభాగంలో ఎక్కువ కాలం ఫైల్స్‌ పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్‌ చల్లా అనురాధ సిటిప్లానర్‌ని ఆదేశించారు

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
నగర కమిషనర్‌ చల్లా అనురాధ

నగర కమిషనర్‌ చల్లా అనురాధ

గుంటూరు(కార్పొరేషన్‌), జూన్‌ 23: పట్టణ ప్రణాళికా విభాగంలో ఎక్కువ కాలం ఫైల్స్‌ పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై  చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్‌ చల్లా అనురాధ సిటిప్లానర్‌ని ఆదేశించారు. బుధవారం కమిషనర్‌ చాంబర్లో పట్టణ ప్రణాళిక అధికార, సిబ్బందితో ప్రత్యేక సమీక్ష సమావేశం జరిగింది.  ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ నగరంలో ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ ప్రకారం అనుమతులలు లేని హోర్డింగ్స్‌తో పాటు విచ్చలవిడిగా షాప్‌ల ఎదుట ఏర్పాటుచేసిన నేమ్‌ బోర్డ్‌లను కూడా తొలగించాలన్నారు. డ్రెయిన్లు, ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు.  సర్వే కోసం వచ్చిన దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని, పెండింగ్‌ ఉంచితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సమావేశంలో సిటీ ప్లానర్‌ సత్యనారాయణ, డీసీపీ హిమబిందు, ఏసీపీలు అశోక్‌, శాస్ర్తి, సూపరింటెండెంట్‌ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

పలు ప్రాంతాల్లో పర్యటన

నగరంలో తాగునీటి కాలుష్యంపై ఫిర్యాదులు వస్తే సంబంధిత ఎమినిటి కార్యదర్శితో పాటు ఇంజినీరింగ్‌ అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని నగర కమిషనర్‌ చల్లా అనురాధ తెలిపారు. స్థానిక గొలుసు కొండలరావునగర్‌, జాని మృత్యుంజయ నగర్‌, గౌడాస్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో బుధవారం పర్యటించి స్థానికులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి అధికారులు, సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మృత్యుంజయ కాలనీలో తాగునీరు కలుషితంగా వస్తుందని గమనించి వెంటనే పరిశీలించి పరిష్కరించాలన్నారు. కల్వర్టులు కుంగి మురుగు పారుదలకు అడ్డుగా ఉన్న ప్రాంతాల్లో  నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు.  గొలుసు కొండలరావు నగర్‌, జాని మృత్యుంజయనగర్‌, గౌడాస్‌నగర్‌ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టేలా ప్రత్యేకంగా రెండురోజుల డ్రైవ్‌ చేపట్టాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. పర్యటనలో కార్పొరేటర్‌ అబిద్‌ బాష, డీఈఈ ప్రసాద్‌, బయాలజిస్ట్‌ ఓబులు, శానిటరీ ఇన్ప్సెక్టర్లు దౌలా, విజయ్‌కుమార్‌, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-06-24T05:41:57+05:30 IST