రామస్వామిని సస్పెండ్‌ చేయాలి!

ABN , First Publish Date - 2021-12-04T06:45:17+05:30 IST

వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగుల సంఘాల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి.

రామస్వామిని సస్పెండ్‌ చేయాలి!

వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల ధర్నా 

జేసీ కార్యాలయం ఎదుట బైఠాయింపు  

మరోసారి బహిర్గతమైన సంఘాల విభేదాలు 

విజయవాడ, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగుల సంఘాల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఆ శాఖ విజయవాడ-1 డివిజన్‌ పరిధిలోని ఇంద్రకీలాద్రి సర్కిల్‌లో విధులు నిర్వహిస్తున్న వట్టిపల్లి రామస్వామి గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు విజయవాడ-1 డివిజన్‌ కార్యాలయంలో నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఏపీ సిటీ ఎన్జీవోస్‌ (అశోక్‌బాబు వర్గం) నాయకుడైన ఆయన తమ శాఖలో అక్రమాలకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ జాయింట్‌ కమిషనర్‌ కార్యాలయం ముందు కూర్చుని నిరసన కొనసాగించారు. అయితే అదే వట్టిపల్లి రామస్వామి తమ కార్యాలయంలో ఉద్యోగులపై తప్పుడు పిటిషన్లు పెడుతూ కులం పేరుతో భయబ్రాంతులకు గురిచేస్తూ వేధిస్తున్నాడని, ఉన్నతాధికారులు వెంటనే అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఎన్జీవోస్‌ అసోసియేషన్‌ (కేఆర్‌ సూర్యనారాయణ వర్గం) ఉద్యోగులు శుక్రవారం అదే జేసీ కార్యాలయం ముందు ఽధర్నాకు దిగారు. డివిజన్‌ పరిధిలోని 8 సర్కిళ్లలో పనిచేస్తున్న దాదాపు 100 మందికి పైగా ఉద్యోగులు జేసీ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నాకు దిగారు. తమపై తప్పుడు ఫిర్యాదులు చేస్తున్న రామస్వామిని సస్పెండ్‌ చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం కమర్షియల్‌ ట్యాక్స్‌ ఎన్జీవోస్‌ అసోసియేషన్‌ (కేఆర్‌ సూర్యనారాయణవర్గం) జిల్లా నేత బి.మెహర్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ ఏపీ సిటీ ఎన్జీవోస్‌ మాజీ అధ్యక్షుడు పి.అశోక్‌బాబు అనుచరుడైన వట్టివల్లి రామస్వామి సంఘ నేతగా చెప్పుకుంటూ సాటి ఉద్యోగులపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ వేధిస్తున్నాడన్నారు. రామస్వామి తప్పుడు ఫిర్యాదులపైన, తమ ఉద్యోగుల సమస్యలపైన జాయింట్‌ కమిషనర్‌కు అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చామని, ఇంతవరకు ఒక్క డిమాండ్‌ను కూడా పరిష్కరించలేదన్నారు. వాణిజ్య పన్నులశాఖ సబార్డినేట్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాపట్ల గోపాలకృష్ణయ్య మాట్లాడుతూ ఏపీ సిటీ ఎన్జీవోస్‌ సంఘం (కేఆర్‌ సూర్యనారాయణ వర్గం) చేసే నిరసన కార్యక్రమాల్లో తాము భాగస్వాములుగా ఉంటామన్నారు. డిపార్ట్‌మెంట్‌లో కొంతమంది చేపడుతున్న తప్పుడు కార్యక్రమాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సబార్డినేట్స్‌ సంఘ జిల్లా అధ్యక్షుడు కేసన శంకరరావు మాట్లాడుతూ వట్టివల్లి రామస్వామి సంఘ నేతనని చెప్పుకుంటూ డిపార్ట్‌మెంట్‌లో డీసీలు, ఏసీలను బెదిరిస్తూ, లేనిపోని సమస్యలు సృష్టిస్తున్నాడని, ఉన్నతాధికారులు అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-12-04T06:45:17+05:30 IST