Abn logo
Sep 26 2021 @ 01:33AM

న్యాయ వ్యవస్థలోని భాషా సంక్లిష్టతలతోనే కోర్టులకు సామాన్యుడు దూరం!

సామాజిక వాస్తవికతలను పరిగణనలోకి తీసుకోవడంలో న్యాయస్థానాలు విఫలం

సామాన్యుడికి సన్నిహితమైతేనే విజయం

సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ వ్యాఖ్యలు


న్యూఢిల్లీ, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): సామాజిక వాస్తవికతలు, వాటి పర్యవసానాలను పరిగణనలోకి తీసుకోవడంలో న్యాయవ్యవస్థ విఫలమైందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. న్యాయ ప్రక్రియను ప్రజలకు సన్నిహితంగా తేనంతకాలం మన న్యాయవ్యవస్థ విజయవంతం కాలేదని చెప్పారు. శనివారం ఒడిసా రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ నూతన భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. న్యాయ వ్యవస్థను భారతీయం చేయాలని గతంలో తాను ప్రతిపాదించినపుడు కూడా సామాన్యుడికి దగ్గరవ్వాల్సిన అవసరాన్ని చెప్పానన్నారు. దేశంలో చట్టాలు చేసే పని న్యాయస్థానాలు చేస్తాయన్న భ్రమలను ప్రజల్లో పోగొట్టాల్సి ఉందని చెప్పారు. చట్టాలను పునః పరిశీలించి, కాలానికి, ప్రజల అవసరాలకు తగ్గట్టుగా సంస్కరించాల్సిన బాధ్యత చట్టసభలదన్నారు. అందుకు తగ్గ నిబంధనలను సరళీకరించాల్సిన బాధ్యత కార్యనిర్వహక వర్గానిదని చెప్పారు. రెండూ కలిసికట్టుగా ప్రజల రాజ్యాంగ ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాతే చట్టాలను అమలు చేయించడం, వ్యాఖ్యానించడం న్యాయవ్యవస్థ చేస్తుందన్నారు. మూడు వ్యవస్థలు కలిసి పని చేసినప్పుడే న్యాయం అందించడంలో అడ్డంకులు తొలగిపోతాయని చెప్పారు.


స్వాతంత్య్రం వచ్చిన 74 సంవత్సరాల తర్వాత కూడా సంప్రదాయ, వ్యవసాయ సమాజాలు కోర్టులను సంప్రదించేందుకు వెనుకాడుతున్నాయనీ, కోర్టుకు సంబంధించిన పద్ధతులు, భాష వారికి పరాయిగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. జస్టిస్‌ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఏప్రిల్‌లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ దేశంలో న్యాయవ్యవస్థ పునాదులు మరింత బలపడ్డాయని ఒడిసా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ మురళీధర్‌ అన్నారు, ఆయన వల్ల న్యాయ వ్యవస్థతో సంబంధం ఉన్నవారందరిలోనూ కొత్త శక్తివచ్చిందని పేర్కొన్నారు. ‘‘ఈ ఐదు నెలల్లో మార్పు లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  ప్రజలు కూడా ఈ మార్పులను ఎంతో సంతోషంగా ఆహ్వానించారు. పలువురు మహిళలు గణనీయమైన సంఖ్యలో న్యాయమూర్తులయ్యారు. ఇది ఎంతో సానుకూలమైన మార్పు’’ అని  అభిప్రాయపడ్డారు.


పూరీ జగన్నాథుడికి పూజలు

పూరీ జగన్నాథ ఆలయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ సందర్శించి, పూజలు నిర్వహించారు. ఒడిసా పర్యటనలో ఉన్న ఆయన 12వ శతాబ్దానికి చెందిన ఈ ప్రాచీన ఆలయంలో 45 నిమిషాలపాటు గడిపారు. 


సత్యం గెలిచి తీరుతుంది

దత్తాత్రేయుడు ఆత్మకథ ఆవిష్కరణలో జస్టిస్‌ రమణ 

‘‘ప్రముఖ కేన్సర్‌ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు వంటి పెద్ద మనిషికీ నీలాపనిందలు తప్పలేదు. తనపై వచ్చిన ఫిర్యాదుల గురించి, రెండేళ్లు సాగిన విచారణ గురించి, ఓర్పుగా ఉంటూ అగ్నిపరీక్షలో పునీతమైన సీతలాగా బయటపడిన వైనాన్ని ఆత్మకథలో ఒకింత బాధతో ఏకరువు పెట్టారు. నాకూ ఇలాంటి పరీక్షలు జీవితంలో ఎన్నో ఎదురయ్యాయి. ఆయన అనుభవించిన క్షోభను అర్థం చేసుకోగలను. సత్యం గెలిచి తీరుతుంది’’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పేర్కొన్నారు. నోరి దత్తాత్రేయుడు ఆత్మకథ ‘ఒదిగిన కాలం’ పుస్తకావిష్కరణ సందర్భంగా  వీడియో సందేశం పంపారు.   నోరి దత్తాత్రేయుడు అమెరికా వెళ్లి చేసిన పరిశోధనలు మన దేశంలోనూ జరిగేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని జస్టిస్‌ రమణ కోరారు. ‘‘దాదాపు ఐదు దశాబ్దాల క్రితమే నోరి బ్రాకీ థెరపీలో కంప్యూటర్లను ఉపయోగించారు.


మన ప్రభుత్వాలు ఆయన సేవలను ఉపయోగించుకోవడానికి ముందుకు రావాలి. నోరి ఆత్మకథ యువ శాస్త్రవేత్తలు, వైద్యులు, విధాన నిర్ణేతలకు స్ఫూర్తిదాయకం కావాలి’’ అని కోరారు. నోరి దత్తాత్రేయుడు విజయాలకు అండగా నిలిచిన ఆయన సతీమణి సుభద్రాదేవికి, ఆయన పిల్లలకు, పుస్తకాన్ని ప్రచురించిన సాహితీమిత్రులకు, తెలుగులో రావడానికి సహకరించిన రచయిత్రి అరుణా పప్పుకు జస్టిస్‌ రమణ అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది.